మంచికంటి రాంకిషన్ రావు

మంచికంటి రాంకిషన్‌ రావు (అక్టోబరు 11, 1917 - ఫిబ్రవరి 8, 1995) తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు.

మంచికంటి రాంకిషన్‌ రావు
జననంరాంకిషన్‌ రావు
అక్టోబరు 11, 1917
పెనుగంచిప్రోలు, నందిగామ తాలూకా, కృష్ణాజిల్లా
మరణంఫిబ్రవరి 8, 1995
ప్రసిద్ధిసీనియర్‌ కమ్యూనిస్టు (రైతుసంఘం) నాయకులు, మాజీ శాసనసభ్యులు.

జననం మార్చు

రాంకిషన్‌ రావు కృష్ణాజిల్లా, నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలులో పర్సా రామానుజరావు, సీతమ్మ దంపతులకు 1917 అక్టోబరు 11 న జన్మించారు.[1]

బాల్యం మార్చు

రాంకిషన్‌రావుకు ఐదారేళ్ల వయసున్నప్పుడే వారి నాన్న చనిపోయారు. రాంకిషన్‌రావుకు ఓ అక్క, అన్న కూడా ఉన్నారు . పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకూ వ్యవసాయం చేసుకొని ఫలసాయం అప్పుల కింద జమ చేసుకునేలా పొలాన్ని అప్పలవాళ్లకు అప్పగించి ఆ కుటుంబం ఖమ్మం వెళ్లిపోయింది. రాంకిషన్‌రావు తల్లి బ్రాహ్మణులకూ, వైశ్యులకూ మునేటి నుంచీ, ఖిల్లా బావి నుంచీ ప్రతిరోజూ పది బిందెల వరకూ మంచినీళ్లు మోసి వారిచ్చే కొద్ది కాసులతో కుటుంబాన్ని పోషిస్తుండేది. ఆ కాలంలో వీరి కుటుంబ విషయం విని కాచిరాజుగూడెం భూస్వామీ, పట్వారీ అయిన మంచికంటి తిరుమలరావు రాంకిషన్‌రావును దత్తత చేసుకున్నారు. కాచిరాజుగూడెంలో ఇంటి వద్దనే ప్రయివేటు మాస్టారును పెట్టించి మూడో తరగతి వరకూ రాంకిషన్‌రావుకు చదువు చెప్పించారు. ఈ తరువాత పై చదువుకోసం ఖమ్మంలో పెట్టారు. ఆరవ తరగతి చదువుతుండగానే రాంకిషన్‌రావుకు వివాహమయ్యింది . వీరి భార్య పేరు సత్యావతి, కుమారుడు లక్ష్మీ నారాయణ, కుమార్తెలు లక్ష్మీ నరసమ్మ, భారతి .

రాజకీయ జీవితం మార్చు

హైదరాబాదులో ల్యాండ్‌ రెవెన్యూ కార్యాలయంలో చిన్న ఉద్యోగంలో చేరారు. రాంకిషన్‌రావు తన భార్యను హైదరాబాద్‌లోనే వదిలేసి షోలాపూర్‌ వెళ్లి సైన్యంలో అబులెన్సు దళంలో చేరారు. ఆ సమయంలో ఆంధ్ర మహాసభలో పనిచేస్తునన జాతీయవాది కొమరగిరి నారాయణరావు రాంకిషన్‌రావు చిరునామా తెలుసుకొని పూనా వచ్చారు. తర్వాత వారిద్దరూ కలిసి మాట్లాడినప్పుడు భార్య, పెంపుడు తండ్రి పడుతున్న ఆందోళన, ఆవేదన వివరించి తిరిగి వచ్చేయాలని రాంకిషన్‌రావును కొమరగిరి కోరారు. దీనిని అర్థం చేసుకొన్న ఆయన సైన్యం శిబిరం (పూనా) నుంచి దొడ్డిదారిన హైదరాబాద్‌కు పారిపోయి వచ్చారు. పోలీసుల కళ్లబడకుండా ఉండేందుకు కొన్నేళ్లపాటు అజ్ఞాతవాసంలో గడపాల్సివచ్చింది. కొణతమాత్మకూరులో ఉన్నప్పుడు ప్రముఖ కమ్యూనిస్టు అగ్రనేతలు కామ్రేడ్స్‌ పుచ్చలపల్లి సుందరయ్య, మానికేని బసవపున్నయ్య, చండ్ర రాజేశ్వరరావులను కలిసారు.

రాంకిషన్‌రావు కొణతమాత్మకూరులోనే కమ్యూనిస్టుపార్టీ సభ్యుడయ్యారు. రాంకిషన్‌రావు తన దత్తత తండ్రినుండి సంక్రమించిన 200 ఎకరాలు బీదలకు పంచారు. నిజాం నవాబుకు చెందిన రజాకార్లు, భూస్వామ్య శక్తులు.. ప్రజలపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఆయన కృష్ణాజిల్లా కమ్మవారిపాలెంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో గెరిల్లా పోరాట యుద్ధ పద్ధతుల్లో శిక్షణ పొందారు. శిక్షణ పొందాక ఎన్నో దాడుల్లో పాల్గొన్నారు.[2] పిండిప్రోలులో దేశ్‌ముఖ్‌ జగన్నాధరెడ్డి గడీని కూల్చివేసిన సంఘటనలో కూడా రాంకిషన్‌రావు పాల్గొన్నారు. అలాగే సంకీస పోలీసుస్టేషన్‌, మానుకోట తాలూకాలోని నెల్లికుదురు పోలీసుస్టేషన్లపై దాడిచేసిన దళాల్లో కూడా ప్రధానపాత్ర వహించారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మృతిచెందారు. ములకలపల్లి మిలిటరీ క్యాంప్‌పై దాడిలోనూ పాల్గొన్నారు.[3]

రాంకిషన్‌రావు తన రాజకీయ జీవితంలో అనేకసార్లు జైళ్లపాలయ్యారు. వరంగల్‌ జైల్లో ఉన్నంతకాలం రేయింబవళ్లు కాళ్లూ చేతులకు బేడీలు వేయబడి అతి ఇరుకైన గదిలో శిక్ష అనుభవించారు. 1964లో సిపిఎం వైపు వచ్చిన ఆయన ప్రభుత్వ ఆగ్రహానికిగురై 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే ఆయన ప్రమాదకరమైన జబ్బున పడ్డారు. 1974లో అధిక ధరలకు నిరసనగా సిపిఎం ఇచ్చిన పిలుపునందుకుని నిర్వహించిన ఆందోళనకు నాయకత్వం వహించారని మరో కమ్యూనిస్టు యోధుడు చిర్రావూరి లక్ష్మీనరసయ్యతోపాటు అరెస్టు చేశారు. అంతటితో ఆగక ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారిద్దరికీ బేడీలు వేయించి ఖమ్మం పురవీధుల్లో ఊరేగింపజేశారు. తర్వాత ఆ ఖమ్మం గడ్డపైనే చిర్రావూరి మున్సిపల్‌ ఛైర్మన్‌గా, రాంకిషన్‌రావు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. 1975లో ఎమర్జెన్సీలో కూడా రాంకిషన్‌రావును రాజమండ్రి, హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్ర కారాగారాల్లో నిర్బంధించారు. మళ్లీ ఆయనకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడటంతో వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రిలో చేర్చారు. ఆ స్థితిలోకూడా ఆయనను గొలుసులతో మంచానికీ, కాలుకీ కట్టేసి హింసలపాల్జేశారు.

సిపిఎంలో రాంకిషన్‌రావు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు. 1952లో అవిభక్త కమ్యూనిస్టుపార్టీలో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, 1964 నుంచి సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, 1972 నుండి రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 1971 నుండి 78 వరకూ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1980లో అదే జిల్లాకు సిఐటియు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1982, 1985లో ఖమ్మం శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.[4]

మరణం మార్చు

1995 ఫిబ్రవరి 8వ తేదీన కన్నుమూశారు.

మూలాలు మార్చు

  1. మణి సంలోష బ్లాగ్. "వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు : మంచికంటి రాంకిషన్‌ రావు". mani-santhosha.blogspot.in. Archived from the original on 22 ఏప్రిల్ 2017. Retrieved 8 February 2017.
  2. మన తెలంగాణ. "సువర్ణాక్షర లిఖితం తెలంగాణ సాయుధ పోరాటం". Retrieved 8 February 2017.[permanent dead link]
  3. ప్రజాశక్తి. "సిపిఎం సీనియర్‌ నాయకులు". Retrieved 8 February 2017.[permanent dead link]
  4. నమస్తే తెలంగాణ. "పొత్తులు పొసగేనా..!". Retrieved 8 February 2017.[permanent dead link]