ఈ శతకాన్ని దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి[1] రచించాడు. దీనిలో నూరు పద్యాలున్నాయి. పిఠాపురం రాజా రావు గంగాధరరామారావుతో కలసి మందపల్లి గ్రామంలో శ్రీ మందేశ్వరుడు అని పిలువబడే శివుడి ఆలయాన్ని దర్శించినపుడు కవి ఈ శతకాన్ని ఆశువుగా(?) చెప్పాడు. ఈ మందేశ్వరుడు శనిమహాత్ముని చేత ప్రతిష్ఠింపబడినవాడు. "మందేశ్వరా!" అనే మకుటం కలిగి శార్దూల మత్తేభ వృత్తాలున్న ఈ శతకాన్ని ఈశ్వరునికి అంకితమిచ్చాడు. 1949లో మద్రాసులోని శుభోదయా ప్రెస్సులో ఈ శతకముతో పాటు మల్హణము (మల్హణకవి సంస్కృతంలో వ్రాసిన శివస్తోత్రానికి ఆంధ్రీకరణము) కలిపి ఒకే పుస్తకంగా వెలువరించారు.

ఈ శతకంలో కవుల కృతుల ప్రశంస, సద్విభుని స్తుతి, సచివవ్యాపారములు, రాజనీతి, పతివ్రతాధర్మములు, లోకప్రవృత్తి, అవినీతి, కన్యాశుల్కము, ధనమహిమ,ఋణరాహిత్యము అనేక మొదలైన ప్రాపంచిక విషయాలు స్పృశించబడ్డాయి. ఇంకా వైరాగ్యము, పరోపకారము, సత్యప్రశస్తి, వినయశీలత, భూతదయ మొదలైనవి ఉపదేశించబడ్డాయి. కుంకుమ, పసువు,కాటుక, తాంబూలము, గంధము, కీలుజడ, పుష్పాలంకృతి, నుదుట సింధూరము, హస్తాంఘ్రికంఠాద్యలంకారములు స్త్రీలకు మంగళకరములని,ఆయా అలంకారధారణ వలన పతి దీర్ఘాయువుకలవాడవుతాడని ఈ శతకంలో కవి వ్రాశాడు.

మచ్చుతునకలు మార్చు

శా|| శూరున్ భీరుత ధీరు బేలతనము న్ముశ్లోకు దుష్కీర్తిసా
చారున్నైష్టిక ధర్మహైన్యమును విజ్ఞానిందమోవృత్తి స్వా
కారాధ్యున్ వికృతాకృతిత్వమును బ్రజ్ఞాశాలి మందత్వమున్
జేరున్నీవు నిషిద్ధమై వెలయు రాశింజెంద మందేశ్వరా!


మ|| ఋణరాహిత్య మనామయత్వ మపర ప్రేష్యత్వముం గల్గినన్
మణిభూషాగణ నిష్కపుష్కల మహామంజూషలున్ సుప్రసి
ద్యణిమాద్యష్ట విభూతులు న్విపుల భృత్యేఘాది పత్యంబులున్
గుణింపన్ దృణలేశ తుల్యములుగాఁ గన్పట్టు మందేశ్వరా!
మ|| దయతోడంగొనుమొక్క మ్రొక్కి దెసుమాతైలప్రదీపంబయో
మయభూషాళి శమీదళంబులు తిలల్మాషాన్నమున్ లోహమూ
ర్తియు భాగంబు మహేంద్రనీలమణియుం గృష్ణాంబరబుంద్విజా
న్వయుఁ బూజింవి యొసంగినట్లు మది నానందించి మందేశ్వరా!

మూలాలు మార్చు

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973