మాధవపెద్ది గోఖలే

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా.గోఖలే) తెలుగు సినిమా ప్రపంచంలో ఉన్నతమైన కళా దర్శకుడు, చిత్రకారులు.

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే
జననం
మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే

1917
గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బ్రాహ్మణకోడూరు
మరణం1981
జాతీయతభారతీయుడు
వృత్తిచిత్రకారుడు, కళా దర్శకుడు
ఉద్యోగంవిజయా పిక్చర్స్
గుర్తించదగిన సేవలు
మాయా బజార్
బంధువులుమాధవపెద్ది వెంకట్రామయ్య

ఇతడు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బ్రాహ్మణకోడూరు గ్రామములో 1917లో జన్మించాడు. ఇతని తండ్రి మాధవపెద్ది లక్ష్మీనరసయ్య స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న జాతీయవాది. ఇతడు కొడవటిగంటి కుటుంబరావుకి దగ్గర బంధువు. గోఖలే విజయా స్టుడియోలో శాశ్వత కళా దర్శకులుగా పనిచేసి, ఎన్నో విజయవంతమైన పౌరాణిక, చారిత్రక చిత్రాలు విజయం పొంది శాశ్వత స్థానం పొందడానికి కీలకమైన కృషి చేశాడు. అంతే కాకుండా గోఖలే మంచి చిత్రకారుడు, సాహితీవేత్త, జర్నలిస్టు, మానవతావాది. 'ఆంధ్రపత్రిక', 'భారతి', 'యువ', 'ఆంధ్రజ్యోతి', 'ప్రజాశక్తి' పత్రికలలో ఎన్నో చిత్రాలు వేశాడు. రచనా రంగములో కూడా కృషి చేసి 'బల్లకట్టు పాపయ్య', 'మూగజీవాలు (కథాసంపుటి) ', 'గోఖలే కథలు' మున్నగు రచనలు చేశాడు. ఇతడు గ్రామీణ జీవితాలను తన కథలలో అతి సహజంగా సాక్షాత్కరింప చేశాడు.

పాతాళభైరవి, మాయా బజార్ తదితర చిత్రాల్లో కథాకాలంనాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేందుకు గోఖలే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. పాత్రధారులు ధరించే సుస్తులు, నగలు, కట్టూ బొట్టూ అచ్చం తెలుగుతనం ఉట్టిపడేవి. చలనచిత్రాలకు సంబంధించిన వివరణాత్మకమైన స్కెచ్ లు వేసేవాడు.

అతడు ప్రజాశక్తి, ఆంధ్రపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశాడు. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, సమస్యలపై సంపూర్ణ అవగాహన ఆయన రచనలలో కనిపించేది. ఇతడు తెనాలిలోని రామ విలాస సభతో సన్నిహిత సంబంధాలు కలిగివుండేవాడు. ఇతడు అభ్యుదయ రచయితల సంఘం లోను, ఆంధ్ర కళాకారుల సంఘం లోను, ఆంధ్ర చిత్రకళా పరిషత్తు లోను సభ్యులుగా ఉన్నాడు.

ఇతడు 1981 సంవత్సరంలో మరణించారు.[1]

చిత్ర సమాహారం మార్చు

 
చందమామ 1948 సంచికలో ప్రచురించబడిన గోఖలే చిత్రలేఖనం దమయంతి-హంస.
 
భారతి 1950 మే సంచికలో ప్రచురితమైన గోఖలే వర్ణచిత్రం
  1. శ్రీకృష్ణసత్య (1971)
  2. శ్రీకృష్ణ విజయం (1971)
  3. శ్రీకృష్ణావతారం (1967)
  4. శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
  5. మహామంత్రి తిమ్మరుసు (1962)
  6. భక్త జయదేవ (1961)
  7. జగదేకవీరుని కథ (1961)
  8. మహాకవి కాళిదాసు (1960)
  9. అప్పు చేసి పప్పు కూడు (1958)
  10. మాయా బజార్ (1957)
  11. మిస్సమ్మ (1955)
  12. చంద్రహారం (1954)
  13. ధర్మ దేవత (1952)
  14. పెళ్ళిచేసి చూడు (1952)
  15. పాతాళ భైరవి (1951)
  16. షావుకారు (1950)
  17. రైతుబిడ్డ (1939)

మూలాలు మార్చు

  1. గోఖలే మాధవపెద్ది, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 499.
  • తెరమీద కనిపించడు గోఖలే దాగి ఉంటాడు ఫ్రేములో ప్రతి ఫ్రేములో, ఎస్.వి.రామారావు ఆంధ్రప్రభ విశేష ప్రచురణ 'మోహిని' లో రచించిన వ్యాసం ఆధారంగా.

బయటి లింకులు మార్చు