రామకథను వినరయ్యా

రామకథను వినరయ్యా పాట లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించారు. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రీకరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీల మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చారు.

నేపథ్యం మార్చు

చాకలివాడు వేసిన నిందని తలమీద మోస్తూ శ్రీరాముడు సీతా మాహాసాధ్విని అడవికి పంపిస్తాడు. వాల్మీకి ఆశ్రమం చేరిన ఆమెకు లవకుశులు జన్మిస్తారు. వారి విద్యాబోధ మహర్షి జరిపిస్తాడు. వారి ద్వారా తాను రచించిన రామాయణ కావ్యాన్ని ప్రచారం కోసం లవకుశులకు నేర్పించి గానం చేయమని ఆదేశిస్తారు.

నాలుగు పాటలలో మొదటిదైన ఈ పాటలో రామాయణంలోని బాలకాండము, అయోధ్యాకాండములోని ముఖ్యమైన ఘట్టాలను, సీతారామ కళ్యాణము వరకు చిత్రీకరించారు.

పాట మార్చు

పల్లవి :

రామకథను వినరయ్యా

ఇహపర సుఖముల నొసగే

సీతారామకథను వినరయ్యా


చరణం 1 :

అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు

ఆ రాజుకు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్రా కైకేయి

నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ||| రామకథ |||


చరణం 2 :

ఘడియ ఏని రఘురాముని విడచి గడపలేని ఆ భూజాని

కౌశిక యాగము కాచిరమ్మని పలికెను నీరద శ్యాముని ||| రామకథ |||


చరణం 2 :

తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవెన తలదాల్చి

జనకుని యాగము జూచు నెపమ్మున చనియెను మిధిలకు దాశరధి ||| రామకథ |||


చరణం 3 :

మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది

ధరణిజ మదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది ||| రామకథ |||


చరణం 4 :

హరుని విల్లు రఘునాధుడు చేగొని ఎక్కిడ ఫెళఫెళ విరిగినది

కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి ||| రామకథ |||

సాహిత్య సౌరభాలు మార్చు

శ్రీరాముని సౌందర్యము లోకోత్తరమైనదనే అర్థంలో "మిథిలకు మిథిలయే మురిసినది" అని సముద్రాల సీనియర్ చెప్పారు. అలాగే సీతాదేవిని చూసినపుడు కలిగిన సంతోషాన్ని "కన్నుల వెన్నెల విరిసినది" అని ఆలంకారికంగా చెప్పడం కొత్త అందాన్ని అందించింది. "సీతారాముల కన్నులు కరములు కలసినవి" అనేది పాటకు మనోహరమైన ముగింపు.[1] ఈ పాటను హిందోళ రాగంలో స్వరపరచారు.

మూలాలు మార్చు

  1. లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.

బయటి లింకులు మార్చు