వాడుకరి:Purushotham9966/పాలుట్ల గిరిజన బిడ్డలు సైకిల్ పై కార్గిల్ సాహస యాత్ర

సైకిల్ యా త్రికుల బృందం అయోధ్యలో

2021 ఫిబ్రవరి 6 వ తారీకు నెల్లూరువాసి కాళిదాసు వంశీధర్ ప్రకాశంజిల్లా పాలుట్ల నుంచి, చెంచు పిల్లలతో ఉత్తరాఖండ్ లోని భీమ్ తల్ వరకు 3000 కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. ఈ యాత్ర ఏప్రిల్ 7న భీమ్ తల్ లో ముగిసింది. వంశీధర్ కొన్ని సంవత్సరాలుగా శ్రీశైలం ప్రాంతం సున్నిపెంటలో 2013 వరకు చెంచుల జీవితాన్ని అధ్యయనం చేశాడు. అటుతర్వాత ప్రకాశం జిల్లా పాలుట్ల చెంచుపెంటలో సేవలందించాడు. పాలుట్ల దట్టమయిన అడవి నడుమ ఉంది. అక్కడ చెంచుల జనాభా అధికం. షుమారు 400 మంది చెంచులున్నారు. ఈ చెంచుగూడెం కృష్ణా నదికి 7 కి.మీ. దూరంలో, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి 53కి.మీ. దూరంలో ఉంది. దట్టమైన అరణ్యం మధ్య ఈ గూడెం చాలా అందంగా ఉంటుంది. అక్కడ కరెంటు, టెలిఫోన్, పోస్టాఫీసు సౌకర్యాలు లేవు. ఊరు దాటితే వన్యమృగాలు, ఎలుగుబంట్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడతాయి. వైద్యంకోసం ఎర్రగొండపాలెం వెళ్ళవలసిందే. లేదా ఎగువపాళెం పోవాలి. చెంచులు సున్నిపెంట నుంచి గాని, ఎర్రగొండపాళెం నుంచి గాని కాలినడకన ఆరుగంటల్లో పాలుట్ల చేరుకొంటారు. సాధారణ పౌరులకు 12 గంటల నడక.

2012లో పాలుట్లగూడెం మొత్తం కాలిబూడిదయిది. వంశీధర్ తరచు పాలుట్ల చెంచులకు వంట పాత్రలు, బట్టలు, పిల్లలకు పుస్తకాలు, ఆటవస్తువులు ఇస్తూవచ్చాడు. 2020-21 మధ్య పిల్లలకు చదువు చెప్పడానికి, సామాజిక కార్యక్రమాలు జరపడానికి అనువుగా పాలుట్లలో 300ల చదరపు అడుగుల వైశాల్యంతో చెంచుల సహకారంతో ఒక పర్ణశాల నిర్మించి, అందులో ఉంటూ చెంచు పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలకు చదువుమీద ఆసక్తిలేదు, బడికి పోకుండా గాలికి తిరిగేవారు. ఒక బృందంగా కలిసి పనిచేయడం రాదు. చిన్నా,పెద్దా ప్రతివారి చేతిలో గొడ్డలి ఉంటుంది. నడుస్తూ దారిలో ప్రతి చెట్టు కొమ్మను నరకడం వారికి ఒక దురలవాటు. ఇప్పుడు కూడా ఆహారసేకరణ దశలోనే ఉన్నారు. ఆడ, మగా తాగుడుకు విపరీతంగా బానిసలు. దానికితోడు కొందరికి జూదం వ్యసనం. ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తుంది, అన్నానికి కొదవలేదు. వాళ్ళు వండి పారేసే అన్నం ఊరకుక్కలకు కూడా ఎక్కువయి ముట్టవు. చెంచులకు కట్టుకోను బట్టలుండవు. అతి బాల్య వివాహాలు, 13 ఏళ్ళకే బాలికలు తల్లులవుతారు, శిశుమరణాలు, విఫలప్రేమలు, ఆత్మహత్యలు సాధారణం. పాలుట్ల ఊళ్ళోనే ఒకవైపు లంబాడీల తండా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని చక్కగా ఉపయోగించుకొని అభివృద్ధికి వచ్చారు. ఆ సమాజం ప్రభావం చెంచులమీద లేదు.

యుపి ముఖ్యమంత్రితో, వెనుక బృందం నాయకుడు వంశీధర్
గోమతి నది ఘాట్ లో శుభ్రంచేస్తూ

విలువిద్యలో శిక్షణ :

మఖ్యమంత్రి పిల్లలతో సంభాషిస్తూ
మొదట వంశీధర్ చెంచుబాలలకు విలువిద్యలో శిక్షణ యిప్పించడానికి ప్రయత్నం చేశాడు, అందులో ఉన్న ఇబ్బందులను గమనించి, వాళ్లకు సైకిళ్ళు తొక్కడం నేర్పించి, పాత సైకిళ్ళు సేకరించి ఇచ్చాడు. వాళ్లకు సైకిల్ తొక్కడం చాలా ఇష్టమని తెలిసింది. అయితే వాళ్ళకు దేన్నీ జాగ్రత్త చేసుకోడం తెలీదు, పాడయితే పడేస్తారు. 

మేరథాన్ పరుగుపందెంలో శిక్షణ:

హైదరాబాదులో

2020 నుంచి తను పాలుట్లలో ఉంటూ చెంచు పిల్లలకు ఆరునెలలు రోజూ 20కి.మి దూరం పరిగెత్తడం నేర్పించాడు. వంశీధర్ ప్రతిరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ వెంట ఉండేవాడు. మేరథాన్.లో పాల్గొనేవారికి ప్రోత్సాహకంగా, నెల్లూరులో ఒక ఉదార హృదయుని సహకారంతో లక్షరూపాయల విలువైన స్పోర్టుషూస్, బట్టలు వగయిరా ఆ బాలలకు బహూకరించాడు. వ్యాయామం తర్వాత రోజూ వేరుసెనగ ముద్దలు, పౌష్టిక ఆహరం, చిక్కీలు, పప్పుచెక్కలు, గుగ్గెళ్ళు చిరుతిండ్లు, రాగిజావ ఏర్పాటు చేసేవాడు. పిల్లలకు ఇదొక ఆకర్షణ. వారంలో ఒకటి రెండు పర్యాయాలు భోజనం ఏర్పాటు చేసేవాడు. కరోన కారణంగా పిల్లలను క్రీడా పోటీలకు తీసుకొని వెళ్ళే అవకాశం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో చెంచు బాలబాలికలచేత సైకిల్ యాత్ర చేయించాలని తలపెట్టాడు. ఆ పిల్లలు ఊరి గెవినిదాటి ఎరగరు.

వంశీధర్ చెంచు పిల్లల తల్లితండ్డ్రులకు తన ఆలోచన వివరించి, వారి అనుమతితో 2021 జనవరిలో "చెంచు బాలల హిమాలయ యాత్ర" పేరుతొ కార్యక్రమాన్ని రూపొందించాడు. ఇందుకు ఉదారులయిన మిత్రులు, వితరణశీలురు సహకరించారు. రెండేళ్లుగా తనతో ఉంటున్న 10వ తరగతి వరకు చదివిన జయంతి సూర్య అనే పాతిక సంవత్సరాల యువకుణ్ణి అతని తల్లితండ్రులు(ఇద్దరూ డాక్టర్లు) పంపించడానికి అంగీకరించారు. ఈ రెండేళ్లలో కొండయ్య అనే 31 సంవత్సరాల పాలుట్ల చెంచు యువకుడు, అతని భార్య 24 ఏళ్ళ చెంచు యువతి చేవూరి పోతమ్మ వంశీధర్ తొ పనిచేస్తూ చేదోడు వాదోడుగా వున్నారు. కొండయ్య దంపతులు ఒకసారి తిరుమల చూచి రావడం తప్ప వారికి మరేమీ తెలియదు. అతనకి డ్రైవింగ్ వచ్చు. ఈ దంపతులు యాత్రలో పాల్గొనడానికి అంగీకరించారు.

యాత్రలో పాల్గొనే చిన్నారులు:

ఈ సైకిల్ యాత్రలో 8 నుంచి 14 యేండ్ల మగపిల్లలు 7 మంది, 13 నుంచి 17 సంవత్సరాల మధ్య బాలికలు 5 మంది, మొత్తం 20 మంది చెంచు బాలబాలికలు, ఇద్దరు యువజనులు(కొండయ్య దంపతులు) చెంచుపెద్దల సమక్షంలో యాత్రాబృందంలో చేరారు.

అవసరమైన వస్తుసామగ్రి:

వంశీధర్ తన మిత్రులతో చర్చించి ఈ సుదీర్ఘ సాహస యాత్రకు అవసరమైన సామగ్రి అంతా చాలా ముందుగానే పాలుట్ల చేర్చాడు. 3 కుక్కర్లు, 4 డీజిల్ స్టవ్.లు వంటకు అవసరమయిన సామగ్రి, 20 లీటర్ల హ్యాండ్ వాష్, వాటర్ బాటిల్స్, ప్రతి ఒకరికి భోజనం పళ్ళెం, గ్లాస్, స్పూన్లు, 200 మాస్కులు, 6 టార్పాలిన్ షీట్లు , 30లీటర్ల నీళ్ళకేన్, వారం రోజులకు సరిపోయే భోజన పదార్థాలు వగయిరా, యాత్ర ముఖ్య ఘట్టాలను రికార్డు చేయడానికి విడియొ కెమెరా, సైకిల్ యాత్రికులకు ముందు వెనక రక్షణగా ఉండి, సామగ్రిని తీసుకొని వేళ్లేందుకు రెండు మారుతి వేన్లు- ఒకటి ఏసి, మరొకటి మాములు వ్యాన్ సమకూర్చుకొన్నారు. ఈ ప్రయత్నానికి దన్నుగా ఎందరో మిత్రులున్నారు. ఎట్టి పరిస్థితిలోను కమ్యూనికేషన్ నిరాటంకంగా సాగడానికి హైదరాబాదు మిత్రులు స్వఛ్ఛందంగా కొన్ని ఏర్పాట్లు చేశారు.

అవసరమైన బట్టలు:

యాత్రలో పాల్గొంటున్న బాలలకు ఒక్కొక్కరికి 6 జతల బట్టలు, ఒక జెర్కిన్, ఒకస్వెట్టర్, 6 టిషర్టులు, 3 నిక్కర్లు, అన్ని సమయాల్లో వాడుకోను 6 ట్రాక్ పాంట్లు, రెండు మంకీ టోపీలు, రెండు జతల ఊలు మేజోళ్ళు, ప్రతి ఒకరికి మూడువేల ఖరీదయిన స్లీపింగ్ బాగ్, వీపుకు కట్టుకొనే బ్యాక్ ప్యాక్ ఇచ్చారు. శిక్షణ పూర్తయి, బయలుదేరే తేది నిర్ణయమయినా, పిల్లలలో నమ్మకమే కుదరలేదు. వారిలో చాలామంది పాలుట్ల దాటి బాహ్య ప్రపంచాన్ని చూడనే లేదు. ఆ పిల్లల అమ్మానాన్నలకు దేనిమీద ఆసక్తిలేదు.

ఒకరోజుముందు:

2021 పిబ్రవరి 5 ఉదయం, రేపు సాహసయాత్రకు బయలుదేరుతారనగా, పాలుట్ల గ్రామదేవత, ఆంజనేయస్వామి గుడివద్ద, సైకిళ్ళు పెట్టి పూజచేశారు. 14 సంవత్సరాల లోపల పిల్లలంతా పుజాకార్యక్రమానికి వచ్చారు. సైకిళ్ళు తెచ్చి పూజ చేయించారు. పెద్ద పిల్లలు రాలేదు. వాళ్లకు నిజంగా ఈ యాత్ర జరుగుతుందన్న నమ్మకం కుదరలేదు. కొందరు వచ్చినా ప్రసాదం పెట్టేవరకు నిలవకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకు ఓపిక లేదు. ముగ్గురు దంపతులు తప్ప మిగతా పెద్దలు కూడా రాలేదు. కొందరు త్రాగుడు మత్తులో నిద్రలో ఉన్నారు. వచ్చినవారికే వంశీధర్ విధివిధానాలను వివరించాడు. పూజకు తెచ్చిన సైకిళ్లను పెద్దపిల్లలు అక్కడే వదలి వెళ్ళిపోతే, ఏడెనిమిదేళ్ళ పిల్లలే వాటిని సాముదాయక కేంద్రంలో భద్రంచేశారు.

సాహసయాత్ర బయలుదేరింది!

ఫిబ్రవరి 6వ తారీకు సైకిల్ సాహస యత్రాబృందం పాలుట్లలో ఫలహారంచేసి బయలుదేరింది. కేవలం ముగ్గురు పిల్లల తల్లితండ్రులు మాత్రమే వీడుకోలు పలకడానికి వచ్చారు. కొందరు పిల్లలు చివరి క్షణంలో వచ్చి తమ కిట్లను, వస్తువులను అడిగి తీసుకొని హడావుడిగా బృందంలొ కలిశారు. బృందం ముందు వెనుక మారుతీ వ్యానులు నడవగా, మధ్యాహ్నానికి ఎర్రగుంట్ల గురుకుల పాఠశాలచేరారు. పాఠశాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బృందం ఆరాత్రి, మరుసటిరోజు అక్కడే విశ్రమించింది. ఒక పిల్లవాడు అక్కడకు వచ్చి కలిశాడు. ఒకరిద్దరు పిల్లలు తప్ప, అందరూ మొదటిసారి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆ వాతావరణం అలవాటు కావడానికి సమయం పడుతుంది.

జిల్లా కలెక్టర్ జండా ఊపారు!

8 వ తారీకు ఉదయం పత్రికలవాళ్ళు యాత్ర వివరాలు అడిగి తెలుసుకొన్నారు. 11 గంటల సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ వర్చ్యువల్ విధానంలో యాత్ర జయప్రదం కావాలని శుభాకాంక్షలు తెలుపుతూ, జండావూపి వీడ్కోలుచెప్పారు. నాగార్జునసాగర్ వెళ్ళే దారిలో చిగురుపాడులో డాబా హోటల్లో యాత్రికులు మధ్యాహ్న భోజనం చేశారు. ఇద్దరు పిల్లవాళ్ళు చెవుల రాజు, బుద్దా వీరడు చిగురుపాడువచ్చి బృందంలో కలిశారు. దారిలో పెదఅంజి అనే పిల్లవాడి సైకిలు పంక్చర్ అయితే వ్వాన్ లో ఉన్న సైకిల్ ఇస్తే ఆడపిల్లల సైకలు అని వాడు ససేమిరా తీసుకోలేదు. యాత్రికుల బృందం రాత్రి 8 గంటలకు నాగార్జున సాగర్ ఎడమ గట్టుచేరి అక్కడ ఆంజనేయస్వామి గుడిలో విశ్రమించింది.

కాళీమందిరంలో మొదటి మూడు రాత్రులు:

చిగురుపాడునుంచి సాగర్.కు 65 కి.మి. ఈ రెండు రోజుల్లో పిల్లలు షుమారు 125 కి.మి సైకిల్ తొక్కారు. మరుసటిరోజు ఉదయం బయలుదేరే సమయంలో సాగర్ సమీపంలో తెలంగాణా ముఖ్యమత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయని, వారు వెళ్ళి పోయేవరకు బయలుదేరవద్దని హైదరాబాదు నుంచి సూచన అందడంతో యాత్రికులు మూడు రాత్రులు కాళీమందిరంలో వండుకొని తింటూ ఉండిపోయారు. పిల్లలు వంటపాత్రలు శుభ్రంచేసుకోడం వంటి పనులకు అలవాటుపడి ఉన్నారు కనుక ఇబ్బందిలేదు. బృందంలో 24 ఏళ్ళ యువతి పొలమ్మ పర్యవేక్షణ ఉండనే ఉంది. వంశీధర్ మిత్రులు సమతాప్రసాద్ మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేసి, పిల్లలు కోరితే చేపలకూర ప్రత్యేకంగా వండించి పంపాడు. మొత్తం పర్యటనలో పైలట్ వ్యాన్లో కొండయ్య, వెనుక రియర్ వ్యాన్.లో వంశీధర్ ఉండి యాత్రంతా డ్రైవ్ చేశారు. సాగర్.లో పత్రికలవాళ్ళు కలిశారు. ఇక్కడ యాచారం గ్రామ సమీపంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్సు వారు నిర్వహిస్తున్న 'పుడమి'స్కూల్లో 11 రాత్రి విశ్రాంతిగా ఉన్నారు. స్కూల్ వాళ్ళే భోజనాలు ఏర్పాటు చేశారు. 12 వ తారీకు ఉదయం బయలుదేరి, హైదరాబాదులో వంశీధర్ నిర్వహిస్తున్న గణితయోగ స్కూల్లో దిగారు. 12 రాత్రి కుడుముల వెంకటేశం అనే 18 ఏళ్ళ చెంచు కుర్రాడు ఒంటరిగా హైదరాబాద్ వచ్చి సైకిల్ యాత్ర బృందంలో చేరాడు.

తొలి తిరుగుబాటు:

13 వ తారీకు ఉదయం యాత్రాబృందంలో మొగపిల్లలందరికి సౌకర్యంగా ఉంటుందని శుభ్రంగా, మట్టసంగా, పొట్టిగా మిలిటరీ క్రాఫ్ కొట్టించారు. హైదరాబాదు వచ్చి కలిసిన వెంకటేశం అందుకు అంగీకరించక, వెళ్ళిపోతూ తనతోపాటుగా బృందంలోని చెవుల రాజును కుడా వెంట తీసుకొనివెళ్ళాడు. బయటి ప్రపంచం, చదువు ఎరగని పిల్గలతో ఏగడానికి ఎంతో సహనం, సంయమనం ఉండాలి. వంశీధర్.కు భూదేవికి ఉన్నంత సహనం వుంది. లేకపోతే యిటువంటి యాత్ర ఎవరు తలపెడతారు?

తాలుగింజలు గట్టిగిజలు:

నికరంగా యాత్రకు 7 నుంచి 13 ఏళ్ళ వయసు ఆడపిల్లలు 5 మంది, మొగపిల్లలు 7మంది, 14-18 మధ్య వయసు మగపిల్లలు 6 మంది, మొత్తం 20 మంది బాలబాలికలు తేలారు. సహాయకుల బృందంలోని కొండయ్య, పోతమ్మ దంపతులు కూడా చెంచులే. ఆ విధంగా ఈ యాత్రలొ 22మంది చెంచులు పాల్గొంటున్నారు. 13వ తారీకునాడే, పిల్లలను యేగించుకొని, హైదరాబాదులో డెకాథలాన్ షాప్ కువెళ్ళి, పిల్లల ఎత్తునుబట్టి, ఆర్గనైజర్లు బైసికిల్సు ఎంపికచేశారు. వంశీధర్ మిత్రులు పృథ్వి దగ్గర ఉండి, కొత్త సైకిళ్ళు కొనే ప్రక్రియ పూర్తిచేశారు. సైకిళ్ళకు, హెల్మెట్లకు కూడా రిఫ్లెక్టరులు ఉన్నాయి. అందరికి ధరించడానికి గ్లొవ్సు ఇచ్చారు. కొత్త సైకిళ్ళను చూచుకొని పిల్లలు మురిసిపొయారు. వారి ఉత్సాహం చెప్పనలవికాదు. ఆ బృందంలో ప్రతి ఒక్కరికి సైకిళ్ల రిపేర్లు అంతో ఇంతో తెలుసు. తగినన్ని స్పేర్ పార్టులు సమకూర్చుకొన్నారు. డెకాథలాన్ షాప్ 14 వతేది బైసికిళ్ళను డెలివరి చేసింది. ఒక్కో సైకిల్ ఖరీదు 6500/రూపాయలు.

నెక్లెస్ రోడ్డులో చెంచుబాలల యాత్ర ఆరంభం.

10 వ తారీకు సికింద్రాబాదు -హైదరాబాద్ ఎంపిగా పోటీచేసిన సతీష్ అగర్వాల్ సాహస యాత్రికులకు పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించారు. చెంచుపిల్లలు శాలువాలు చూసుకొని మురిసిపొయారు. ప్రయాణంలో వాటిని తువాళ్ళుగా ఉపయోగించుకొన్నారు. అగర్వాల్ గారు ఉదయం ఫలహారం, అరటిపళ్ళు యేర్పాటు చేశారు. 19 వ తేది యాత్రికుల బృందం హైదరాబాదులో బయలుదేరి, 60 కిలొమీటర్లు సైకిల్ తొక్కి రాత్రికి నాగపూర్ మార్గం NH 44 లొ కాళీమందిరంలో విశ్రమించింది. వంశీధర్ భార్య శ్రీమతి చి.సౌ. మాధవి, కుమారుడు చి.శ్రీరమణ, ఇతర బంధువులు వచ్చి కలిశారు. సుదీర్ఘ యాత్రకు వెళుతున్న సందర్భం- దిగులు, విచారం ఒకవైపు, సాహస యాత్రకు వెళుతున్నారన్న ఆనందం మరోవైపు. పిబ్రవరి 20 వ తారీకు మళ్ళీ సుదీర్ఘ ప్రయాణం కొనసాగింది. దారిలొ NH 44 కు పది కి.మి. దూరంలోని వివేకానంద స్కూల్ వారు ఉదయం ఫలహారం తయారుచేసి సిద్ధంగా ఉంచితే వ్యాన్ లో వెళ్ళి తెచ్చుకొన్నారు. ఆరాత్రి రోడ్డు ప్రక్కన సాయిబాబా గుడిలొ మకాము. ఈ యేర్పాట్లకు గోవిందు అనే సహృదయులు సహకరించారు. పిల్లలు బట్టలు ఉతుక్కొన్నారు, స్నానాలుచేశారు. మందిరంలో జరిగిన పూజల్లొ, భజనలొ చాలా కుతూహలంగా పాల్గొన్నారు. 21 తారీకు ఉదయం బయలుదేరి నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి ఖిల్లాలొ రామాలయ కల్యాణ మండపంలో రాత్రి విశ్రమించారు. వంశీధర్ కుమారుడు శ్రీరమణ శాండిల్య, తోడల్లుళ్ళ అబ్బాయిలు చిరంజీవులు చందు, మిక్కీ, శ్రీను మోటారు సైకిళ్ళలో వచ్చి యాత్రికుల బృందాన్ని కలిసి, ప్రోత్సహించి సెలవుతీసుకొన్నారు. రెండురొజులు యాత్రికులు అక్కడే సుఖంగా ఉన్నారు. బాలలు సుదీర్గ ప్రయాణానికి అలవాటు పడుతున్నారు. రొజుకు సరాసరి 70 నుంచి 80 కి.మి సైకిళ్లు తొక్కగలుగుతున్నారు. మోదట్లొ అత్యుత్సాహంతొ ఒక్కరొజే 120 కి.మి తొక్కిన సందర్భాలున్నాయి.

యాత్రికుల రొజువారీ కార్యక్రమం

ఈ బృందంలొ సభ్యులు రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి వంతులవారీగా పాత్రలు శుభ్రం చేసి, వంటలుచేస్తారు. దారిలో వారానికి సరిపడా కూరలు కొని వ్యాన్లొ సద్దుతారు. చవకగా దొరికితే దండిగా కొంటారు. కూరముక్కలువేసి పప్పు దండిగా చేస్తారు. చెంచులు నిద్రలేవగానే ఆహారం తింటారు. వారి పద్ధతిలొ ఈ ప్రయాణంలొను అహారం తీసుకొన్నారు. ఉదయం 10 గంటల సమయంలొ తినడానికి కొంత అహారం వెంటతీసుకొని పొతారు. మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ రహదారికి సమీపంలొ స్చూల్ భవనంలోనో, గుడిలోనో, చెట్టుక్రిందనో వెంటతెచుకొన్న భొజనంతిని కాసేపుపు విశ్రమిస్తారు. మరల రెండు గంటలకు ప్రయాణం కొనసాగిస్తారు. కొండయ్య వ్యాన్ ముందువెళుతుంది, వెనక రోడ్డుమార్గిన్ లొ చీమల బారులాగా ఒకరివెనక ఒకరు, చివరన వంశీధర్ వ్యాన్ వుంటుంది. వాహనాలరద్ది ఎక్కువగా ఉన్నచోట రోడ్డు దాటవలసి వస్తె, కూడలిలొ ట్రాఫిక్కును ఆపి, పిల్లలను దాటిస్తారు. అరుదుగా తప్ప గ్రామాలలొకి వెళ్ళరు. సాయంత్రం 5 గంటలకు అనువయిన ప్రదేశం చూచుకొని, హయివె ప్రక్కనె టెంట్లు వేసుకొని విశ్రమిస్తారు. లేదా, ఆలయాలు, ప్రభుత్వ పాఠశాలలలో మాత్రమే విశ్రమిస్తారు. పిల్లలు వంతులప్రకారం వంటలు చేస్తారు. రాత్రిళ్ళు కొండయ్య దంపతులతో ముగ్గురు బాలికలు విశ్రమిస్తారు. మిగిలిన ఇద్దరు బాలికలు వంశీధర్.తోపాటు అతని టెంట్లొ పడుకొంటారు. మగపిల్లలకు వేరేగా ఒక టెంట్. మంచినీళ్ళు కొనడమొ, దారిలో ప్రభుత్వం యేర్పాటు చెసిన త్రాగునీటి సౌకర్యం ఉంటె అక్కడ పట్టుకుంటారు. పిల్లలకు కాఫీ, టీ అలవాటు చేయలేదు. వంశీధర్, సూర్య, కొండమ్మ దంపతులు అరుదుగా టీచేసుకొని తాగిన సందర్భాలున్నవి. తొలి పదిరొజుల ప్రయాణంలోనే పిల్లలు బట్టలు, షూస్, అన్నంతినే పళ్ళేలు ఎక్కడ పడితె అక్కడ విడిచిపెట్టి వచ్చారు. వాళ్ళకు పొగొట్టుకొన్నామనె చింతేమీ ఉండదు. టూత్ బ్రష్, పేస్ట్, బట్టల సంగతి చెప్పనవసరం లేదు. వారు అహార సేకరణదశనుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. చిన్నపిల్లలు క్రమంగా క్రమశిక్షణ అలవరచుకొంటున్నారు. వీళ్ళను కడదాకా పట్టుకొని రావడానికి వీలవుతుందా? సాధ్యమవుతుందా?

తొలి మజిలీలు:

23 వ తారీకు ఉదయం సైకిలు యాత్రికులు ప్రయాణమయి, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట సమీపంలొని ఒక గ్రామం చేరారు. దత్తసాయి S.R.S. ట్రస్టు శ్రీ గోవిందు మహాదేవ్, శ్రీమతి స్వర్ణలత దంపతులు ఈ బృందానికి ఆతిథ్యం ఇచ్చారు. 25 తారీకు ఉదయం 'ఇచ్చొటు' గ్రామం షిర్దిసాయి మందిరంలొ విడిచేశారు. ఈ మందిరంలొ విస్తారిగారు ఆరాత్రి ఆతిథ్యం ఇచ్చారు. 25 ఉదయం 'ఇచ్చొటు' గ్రామంలో స్థానికులు స్వచ్ఛందంగా ఉదయం ఫలహారం ఏర్పాటు చేశారు. 25 వ తారీకు ఉదయం మరలా యాత్ర కొనసాగింది. ఆరొజు ఆదిలాబాద్ టౌన్ కు సమీపంలొ తిర్మల్ ఫంక్షన్ హాల్ ఎదుట క్యాంప్ వేసుకొన్నారు. 'స్వాస్' సంస్థ ఆతిథ్యం ఇచ్చింది. తరువాత మజిలీ మహారాష్త్రలో ఉంటుంది. మహారాష్ట్రలొ కరొనా విజృంభించి ఉందని, ఆ రాష్ట్రంగుండా సైకిల్ యాత్ర కొనసాగించవద్దని హైదరాబాదు నుంచి సలహాదారులు సూచించడంతో, మెదక్ సరిహాద్దుల్లొ అతికష్టంమీద లారీ మాట్లాడుకొని సైకిళ్ళు అందులొ వేసుకొని, పిల్లలను వ్యాన్లలొ ఎక్కించుకొని మహారాష్త్ర దాటి, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లొని ఖేతిగావ్ అనే చిన్న గోండ్ తండా గ్రామంలొ దిగారు. 220 కి.మి. ప్రయాణానికి, ఆరుగంటల సమయం పట్టింది. లారీ బాడుగ 22 వేలు.

ఖేతిగావ్ చేదు అనుభవాలు!

ఖేతిగావ్ చిన్న గోండు తండా గ్రామపంచాయతి ఆఫీసులో యత్రాబృందం రెండు రాత్రులు, ఒక పగలున్నారు. గోండు తండా పెద్దలు సాదరంగా ఆహ్వానించారు కానీ ఈ బృందంలో ఎదిగిన పిల్లలు అక్కడి యువతులతో అసభ్యంగా వ్యవహరించడంతో పెద్ద గొడవయింది. గోండు పెద్దల చొరవతో సమస్య సద్దుమణిగినా, హద్దులు దాటి ప్రవర్తించిన ముగ్గురు ఎదిగిన చెంచుపిల్లలను మొదటిసారి దండించవలసి వచ్చింది. చెంచు పిల్లలకు లంబాడాలు తప్ప మరొక ఆదివాసి ప్రజలనుగురించి తెలియదు. మొదటి పర్యాయం గోండు ప్రజతో పరిచయం, వారి ఆతిధ్యం గురించి తెలిసింది. కొత్త చోట్లకు వచ్చినపుడు నడచుకోవలసిన తీరు కొంచం తెలిసింది.

పిల్లలతో సమస్యలు:

28 వ తారీకు ఉదయం బయలుదేరి బండల్ సియొనీ జిల్లాలొ డెహరాడూన్ పబ్లిక్ స్కూలుకు ఎదురుగా టెంట్లు వేసుకొన్నారు. ఇక్కడ నాగన్న, అంజి, మరొక పిల్లవాడు కొట్లాడుకొన్నారు. ఎవరికి వారే జీవించడం, స్వార్థం చెంచుల ప్రవృత్తిలో భాగం. నాగన్న అనే పిల్లవాడు తనకు అన్నం పెట్టలేదని అన్నాడు. నిజమేమిటొ వంశీధర్ కు తెలియదు. మొత్తం యాత్రలొ ఈ అభియొగం, ఈ మాట తనను కలచివేసిందని వంశీధర్ భావించాడు. ఆంజనేయులు, మరికొందరు పిల్లలు చంద్రకళ అనె 7 సంవత్సరాల బాలికతొ అసభ్యంగా ప్రవర్తించి, వేధించారు. ఇటువంటి సందర్భాలలొ కఠినంగా నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. రోజులు గడిచేకొద్ది పిల్లలు క్రమంగా సద్దుకొని పోవడం అలవాటు చేసుకొంటున్నారు. బాలికలు, మగపిల్లల్లొ చిన్నవాళ్ళు త్వరగా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారగలుగుతున్నారు. 16 సంవత్సరాలు దాటిన పిల్లల్లో వ్యక్తిత్వం అభివ్యక్తమవుతూ, వాళ్ళలో మార్పు త్వరగా రాలేదు.

వేసవి ఎండల ప్రతాపం:

మార్చ్ 1 వ తారీకు ఉదయం ప్రయాణం సాగించారు. వేసవి ఎండల ప్రతాపం మొదలయింది. మధ్యాహ్నం 12 గంటలకు కాసేపు విశ్రాంతి కొసం ఆగి, జబల్పూరులొ గురుద్వారాలొ మకాము చేశారు. గురుద్వారా పెద్దలు చాలా సహాయం చేశారు. బాల సైకిల్ యాత్రికులు అక్కడ రెండురోజులు విశ్రాంతిగా ఉన్నారు.ఈ గురుద్వారాలోనే ఒక మహిళాకళాశాల N.S.S ఆఫీసరు డాక్టర్ అనూరాధ చెంచు పిల్లలకు కొన్ని విశేషాలు, వ్యక్తిత్వవికాసం గురించి చెప్పారు. ఆమె ఇంగ్షీషు మాటలను వంశీధర్ చెంచు పిల్లలకు వివరించి చెప్పాడు. చెంచు పిల్లలను కలుసుకోడం విద్యార్థినులకు కూడా సంతొషంగా అనిపించింది. ఇది సాహస యాత్రాబృందానికి కూడా మంచి అనుభవం. గురుద్వారావారే యాత్రా బృందానికి అన్ని వసతులు, భొజన సౌకర్యం ఏర్పాటు చేశారు. పిల్లలకు టాయిలెట్లు ఉపయోగించుకోడం అప్పటికే పరిచయం ఉన్నా, ఆంజనేయులు అనే పెద్ద పిల్లవాడు రోతచేసిపెట్టాడు. కావాలనే చేశాడేమో?

మణిదీప్ సింగ్ సహాయం!

4 వ తారీకు మధ్యాహ్నానికి సైకిల్ బృందం మధ్యప్రదేశ్ లొని గోశాల్.పూరు చేరింది. పొలీసులు, జైనపెద్దలు జైనమందిరంలో ఉండడానికి సహాయం చేశారు. గొశాల్పూరు వెళ్ళేదారిలొ తెలుగు పూజారి ఒకరు తారసపడి, సైకిల్ యాత్రికుల బ్రుందానికి మినరల్ వాటర్ బాటిళ్ళు కొనిపెట్టాడు. ఆయన విశాఖవాసి అట! హైవే నంబరు 34 కు సమీపంలో 'కట్ని'కి దగ్గరలో టోల్ ప్లాజా నిర్మాణం జరుగుతోన్న ప్రదేశం లోనే యాత్రికులు కేంపు వేసుకొన్నారు. ఆ సాయంత్రం కట్నిలొ అద్భుతమయిన అనుభవం- "రాబిన్ హూడ్ ఆర్మీ" స్వచ్ఛందసంస్థ సభ్యులు పిల్లలకు స్నాక్సు తెచ్చి యిచ్చారు. 5 వ తారీకు ఎన్ ఎన్.హెచ్. 34 లొ కట్నినుంచి మైహర్ వెళ్లేమార్గంలొ యు.పి వైపు ప్రయాణం కొనసాగించారు. ఆదినం పిల్లలు 80 కి.మి.సైకిల్ తొక్కారు. దారిలొ వెనుకనుంచి, రాంగ్.సైడ్ నుంచి ఒక ఆటొ, దాని వెనుక మోటారు సైకిల్ వచ్చి ఒక పిల్లవాణ్ణి గుద్దాయి. ఆటోవాణ్ణి మొటారు సైకిలు గుద్దింది. హైవేలొ ఎదుటినుంచి బండ్లు వస్తాయని ఆ పిల్లావాడు ఊహించలేదు. ఆ పిల్లావాడి మోకాలికి చిన్న దెబ్బ తగిలింది. రెండుగంటలు వ్యాన్.లొ ఎక్కించుకొని వెళ్ళారు. అందరూ సైకిలు తొక్కుతూంటే వాడూ సైకిలు ఎక్కాడు. 5 వ తారీకు ఉదయం ఎన్.హెచ్. 34లొ కట్నినుంచి యుపి దారిపట్టి మధ్యాహ్నం 'మిహిర్' అనేచోట విడిదిచేశారు. ఈరొజు పిల్లలు మొత్తం 80 కి.మి.సైకిలుతొక్కారు.

అదృష్టం పెనుప్రమాదం తప్పింది!

6 ఉదయం బయలుదేరి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతం బచోలిలొ కేంపు వేసుకొన్నారు. 8వ తారీకు హైరోడ్దుమీద వెళుతున్నపుడు వంశీధర్ వ్యాన్ టయిర్ రోడ్డు మీదినుంచి జారి, చాలా లోతుగా ఉన్న పొలాల్లోకి, పల్లంలోకి దిగిపొయింది. అదృష్టవశాత్తు కారు పొర్లికింతలు పెట్టకుండా, సరస్సుముందు ఆగింది.పెద్ద ప్రమాదం తప్పిపోయింది. పిల్లలు అగ్రగామిగా వెళుతున్న కొండయ్యకు ఫోనుచేసి చెప్పారు. అతను పిల్లలను ఒకచోట నిలబెట్టి, వెనక్కివచ్చి వ్యాన్ను రోడ్డుమీదికి తీసుకొనివచ్చేందుకు సహకరించాడు. ఈ యాత్రలొ ఇదొక మరచిపోలేని అనుభవం.

ప్రయాగ పుణ్య క్షేత్రంచేరారు!

9వ తారీకు అలహాబాదు చేరి, (ప్రయాగ్ రాజ్) మార్వాడీ అతిథిగృహంలో దిగి, రెందురోజులు అక్కడ గడిపారు. 11 ఉదయం వారణాసికి బయలుదేరారు. దారిలో 'నౌధన్' లొ ఆగారు. 12 వ తారీకు నౌధన్ నుంచి వారణాసి పొలిమేరల వరకు 91 కి.మి సైకిలు తొక్కారు. ఆ రాత్రి కేంపుకు అనువయిన స్థలం దొరక్క పిల్లలు అదనంగా గంట పయిగా సైకిలు తొక్కవలసి వచ్చింది. అక్కడ స్వర్ణమందిరం ఆలయ నిర్మాణం జరుగుతొన్నచోట క్యాంపు వేసుకొన్నారు. ఆలయ నిర్మాణశ్రామికులకు భొజనాలు ఏర్పాటు చేసినవారు సైకిలు యాత్రికులను కూడా భోజనానికి ఆహ్వానించారు.

వారణాసిలొ నాలుగు రాత్రులు!

13, 14 వ తారీకుల్లొ మార్గాయాసం తీరేవరకు పిల్లలు మహామందిర్ నిర్మాణం జరుగుతున్న చోటనె ఉండి, వారణాసి నగరమంతా తిరుగుతూ, రాత్రివేళ కేంపుకు వచ్చి కార్మికులతోపాటు భోజనాలు చేశారు. ఒకరొజు గంగానది తీరంలొని ఘాట్.లొ ఉండాలని తలపెట్టారు. ఆలయ పెద్దలే ఉండడానికి, భొజనాలకు ఏర్పాట్లు చేశారు. పిల్లలు గంగానదిలో స్నానాలు చేసి, విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణను దర్శించుకొన్నారు. పిల్లలు కాస్త ఓర్పు లేకుండా, మాటవినక గంగానదిలో నీళ్లుతాగారు. దాదాపు నెలా పదిహేనురోజులు సైకిలు యాత్రలో ఉన్నారుకదా, బెనారస్ నగరం వారికి ఆటవిడుపు! 15 వ తారీకు బెనారసు విశ్వవిద్యాలయం విద్యార్థులు చెంచుపిల్లల్తొ కొంసేపు గడిపి, నాలుగు మంచిమాటలు చెప్పారు.

అయోధ్యకు ప్రయాణం!

16 వ తారీకు యాత్రికులు అయోధ్యకు ప్రయాణమయ్యారు. ఆరోజు దాదాపు 118 కి.మి. సైకిలు తొక్కి రికార్డుసృష్టించారు. పూర్తిగా అలసిసొలసిన పిల్లలు రాత్రికి పాన్.గావ్ కాళీమందిరంలొ ఒళ్లుతెలియకుండా నిద్రపొయారు. తరచూ సాహసయాత్ర బృందం కాకతాళీయంగా కాళీమందిరాల్లొనే విశ్రమించారు. ఉత్తర భారతంలో ఆలయ పూజారులు, ఆలయ నిర్వాహకులు యాత్రికులకు సహాయపడి, యాత్రికులు విశ్రమించడానికి సౌకర్యాలు ఏర్పాటుచేస్తారు. పాస్గావ్.లో సైకిలు షాప్ పెట్టుకొని జీవిస్టున్న యాదవ కుటుంబం ఈ బృందాన్ని చాలా ప్రేమగా చూసింది. 17 రాత్రి వినోద కార్యక్రమాలు, పిల్లల పాటలతో సంతోషంగా గడిచింది. ఉదయం ఆ యాదవ కుటుంబం యాత్రికులకు జిలేబి, చెరకుపానకం ఫలహారంతో ఇచ్చారుకాని అలవాటు లేని పిల్లలు వాటిని ఇష్టంగా తినలేక పోయారు. 18వ తారీకు రాత్రి కూడా పాస్ గావ్ కాళీమందిర్ లోనే. 19 వ తారీకు ఉదయం మళ్ళీ సైకిళ్లు ఎక్కారు. రాత్రికి బాయిర్.గల్, రాంజానకీమార్గ్ లొ, పొలాల్లొ ఒక ఆఫీసు వెనకవేపు టెంట్లు వేసుకున్నారు. ఈరోజు ఈ బృందంలోని జయంతి సూర్య చాలా చిరాకుపడ్దాడు. వంశీధర్ సూర్యాను చాలా దూరం నడిపించుకొని వెళ్లి నచ్చజెప్పి సమధాన పరిచాడు. ఇల్లువిడిచి నెలన్నర కావచ్చింది. రొజూ ప్రయాణం, శ్రమ చాలా అధికం . తను ఎప్పుడూ ఇంతశ్రమ ఓర్చుకొన్నవాడు కాదు. మొత్తంమీద సమాధానపడ్డాడు. 20 వ తారీకు అయొధ్యలో సీతారాంధాంలో రాత్రి మకాం చేశారు.

ప్రయాణంలో రెండు అనుభవాలు!

ఈ యాత్రలో ఎక్కడికక్కడ దారిలో అవసరమయిన భోజన సామగ్రి కొనడమే. 21 వ తారీకు 'సెల్లరు' గ్రామంలొ కార్డుమీద చవక బియ్యం అమ్మేదుకాణంలొ బియ్యం కోసం ప్రయత్నిచారు. ఒక సాధారణ యువతి అప్పడే తాను కార్దుమీద తీసుకొన్న బియ్యం మొత్తం, 30 కే.జీలు ఇచ్చేసింది, కొన్న ధరకే. తనపేరు కుమారి సోని అట. ఈ యాత్రలొ తరచు ఇటువంటి అవ్యాజమైన ప్రేమను, సుహృద్భావాన్ని మన యాత్రికులు చవిచూశారు. ఇక్కడే హయిరోడ్డుమీద ఒకడు తాను మోటార్ వాహనాల ఇన్.స్పెక్టర్ నని, తనకు పెద్దమొత్తం లంచం ఇస్తేనేతప్ప రెండు మారుతీవ్యాన్లను సీజ్ చేస్తానని మొండిగా బెదిరించాడు. పేపర్లు అన్నీ సరిగానే ఉన్నా వాడు చాలా మొండిగా బెదిరించి, దవుర్జన్యం చేశాడు. దాదాపు అరగంట కాలయాపన జరిగింది. ఇంతలొ పొలిస్ అధికారి మోటార్ సైకిలు మీద అటువయిపు రావడం చూచి వాడు బండిమీద వెళ్ళిపోయాడు. పొలిస్ అధికారి వంశీధర్. ను తన బండిమీద తీసికొని వెళ్ళాడు. కొంత దూరంలొ వాడు టీ కొట్టువద్ద కూర్చొని కనిపించాడు. ఇంస్పెక్టర్ ఆ నకిలీ పొలీసును నిర్బంధించి తీసుకొని వెళ్ళాడు. మొత్తం మీద మన యాత్రికుల బృందం పెద్ద చిక్కునుంచి బయట పడింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ శయలేంద్రకుమార్ దేవుడులాగా ప్రత్య్క్షక్షమయి సహాయం చేశాడు.

సరయూ తీరంలొ!

ఎక్కడ పాలుట్ల! ఎక్కడ అయొధ్య! పిల్లలు ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండరు! 23 వ తారీకు నుంచి నాలుగు రోజులు అయొధ్యలొ సరయూ తీరంలొని సంత్ తులసి ఘాట్ లొ ఉన్నారు. నదిలో స్నానాలు చేశారు. పెద్ద పిల్లలు కొందరు నదిలొ ఈతలాడాలని మొండికేశారు కానీ వంశీధర్ వాళ్ళకు నచ్చజెప్పి వెనక్కి తీసుకొని వెళ్ళాడు. మరుసటిరొజు అక్కడే నదిలొ రెండు శవాలు తేలుతూ కనిపించాయి. ఈతకు వచ్చినవారని తెలిసింది. అయొధ్యలో రెండు అదనపు సైకళ్ళు భారం కావడంవల్ల వాటిని ట్రాన్స్పొర్ట్ లొ వేసి హైదరాబాద్ పంపించారు. అయొధ్య చిన్న టౌన్. చాలా అదంగా ఉంది, ఇక్కడ ఎన్నో గుళ్ళున్నాయి. చూడవలసిన ప్రదేశం, పిల్లలు సయికిళ్ళమీద పాత టౌన్, కొత్త టౌన్ తిరిగి చూశారు. ఈ నాలుగు రొజులూ పిల్లలు స్వయంపాకమే. 25వ తారీకు ఉదయం అయోధ్యలో బయలుదేరారు. 26వ తారీకు సాయంత్రానికి కమలాపురం సమీపంలోసత్యేంద్రసింగ్ ఎస్వి.వి.ఎం ఉన్నత పాఠశాల వద్ద, హయివె పక్కన టెంట్లు వేసుకొన్నారు. వాహనాల రద్దీని తప్పించుకోను లక్నో నగరంలోకి వెళ్లకుండా అవుటర్ రింగ్ రోడ్డులొ వెళుతున్నపుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈ బృందాన్ని కలిసి, ఫొటొలు తీసుకొని, మగ్లాగంజ్.లొ రాత్రికి ఉండి, నైమిశారణ్యంలో రెండురోజులు స్థిమితంగా ఉంటే, తాను అధికారులను కలిసి, ముఖ్యమంత్రిగారి వద్దకు ఈ బృందాన్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ బృందంఆంధ్రప్రదేశ్ నుంచి సయికళ్ళమీద ఇంతదూరం రావడం చూసి నిజంగానే అతను ఆశ్చర్యపొయాడు. మాగ్లాగంజ్ లొ ఒక డాబా ప్రాంగణంలొ టెంట్లు వేసుకొని ఆ రాత్రికి ఉన్నారు. అక్కడ వంశీధర్ అస్వస్థతకు గురయి విరేచనాలు కావడంతో మాగ్లాగంజ్ లొ అర్.యెం.పివద్ద వయిద్యం చేయించుకొని, సెలయిన్ పెట్టించుకొని, కాస్త నెమ్మదించాక, క్యాంప్ వద్దకు చేరాడు.

నైమిశారణ్యంలో నాలుగు రోజులు!

28వ తారీకు సాయంత్రానికి నైమిశారణ్యం చేరి, ఆంధ్రాశ్రమంలో దిగారు. నైమిమిశం చిన్న టౌన్, అక్కడ ఆశ్రమాలకు సమీపంలొనే గోమతీనది ప్రవహిస్తొంది. నది స్నానఘట్టంలో పిల్లలు స్నానంచేస్తూ నదిలొ యాత్రికులు వదలిన గుడ్డలు, దాదాపు ఒక టయిరు బండికి సరిపడా వెలికితీసి గట్టుమీద గుట్టలుగా వేశారు. స్థానిక పత్రికలు గోమతి ఘాట్లొ చెంచు పిల్లలు మురికినంతా తీసి, శుభ్రంచేసిన కథనం ఫొటోలతొ సహా వార్తలు ప్రచురించాయి. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కూడా. హొలీ కార్యక్రమాలలొ ముఖ్యమంత్రి గారు తీరిక లేకుండా ఉన్నారనీ, రెండురోజులు ఓపిక పడితే వారు పిలిపిస్తారనీ, కబురువచ్చింది. తమ ఆశ్రమంలొ అన్నిరొజులు ఉండేందుకు వీలుపడదని, ఖాళీచెయ్యమనీ అంధ్రాశ్రమంవారు వత్తిడిచేస్తే, సమీపంలోనే మాతాజీ ఆశ్రమంవారు ఆహ్వానించారు. ఇంతలొ యాత్రాబృందానికి రక్షణగా పొలీసు బందోబస్తు ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రి గారిని కలుసుకొనడం ఖాయమయినట్లు తెలిసింది.

యు. పి. ముఖ్యమంత్రి శ్రీ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారితొ 40 నిమిషాలు

ఏప్రిల్ 2 వ తారీకు ఉదయం జిల్లా కలెక్టర్ ఈ బృందాన్ని లక్నోకు తీసుకొని వెళ్ళడానికి ప్రత్యేకంగా ఏ.సి వాహనాన్ని పంపించారు. దారిలో పిల్లలకు టిఫిన్ పెట్టించి ఉదయం 9 కల్లా కాళిదాస్ మార్గ్ లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి నివాసానికి తీసుకొని వెళ్ళారు. సమావేశం పదినిమిషాలు ఉంటుందని, విధివిధానాలు పిల్లలకు వివరించమని అధికారులు వంశీధర్ ను కోరారు.అధికారులు సరిగ్గా ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి నివాససంలోకి తీసుకొని వెళ్ళారు. అందరు మాస్కులు ధరించి వారి సముఖానికి వెళ్ళారు. విశాలమయిన హాల్లో పిల్లలను కూర్చొబెట్టి ముందుగా వారికి ఎన్నో విశేషమైన తినుబండారాలు పెట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఈ యాత్ర తలపెట్టిన కారణం అడిగి తెలుసుకున్నారు. అడవులకు పరిమితమైన చెంచు పిల్లలకు భారతదేశంలోని వివిధ ప్రదేశాలను, ప్రజలను పరిచయం చేసే ఉద్దేశంతో తను ఈ యాత్రకు బయలుదేరినట్లు వంశీధర్ వివరించాడు.వారు ఆర్థిక సహాయం చెస్తామని చెప్పగా డబ్బు అక్కరలేదనీ, ఢిల్లి వెళ్ళినపుడు ప్రథానమంత్రిని కలుసుకొనే అవకాశం కలిగించమని వంశీధర్ కోరగా, వారు చూద్దామన్నారు. "మారాష్త్రంలో ఉన్నంత కాలం మీకు ఏ సహాయం అవసరమయినా చేస్తామని చెప్పి, పిల్లలను తమ చుట్టూతా నిలబెట్టుకొని ఫొటొలు తీసుకొన్నారు. ఈలొపే పిల్లలకుమంచి బట్టలు తెప్పించి ఇచ్చారు. తెప్పించినవి సరిపోకపొతే క్షణాల్లో మళ్లీతెప్పించి, బృందంలో ప్రతిఒక్కరికి బహూకరించారు. పదినిమిషాల ఇంటర్వు 40 నిమిషాలు కొనసాగింది. సమావేశం ముగినసిన తర్వాత అధికారులు ఈ యాత్రాబృందాన్ని నైమిశారణ్యానికి తీసుకొనిపోతూ దారిలో జిల్లా కేంద్రంలో మధ్యాహ్నభొజనం పెట్టించారు. అనుకొకుండా తమ బృందానికి గొప్పవరం లభించినట్లు వంశీధర్ భావించాడు.

 30 వ తారీకు ఉదయం సయికిల్  యాత్రికులు నైమిశం నుంచి ఉత్తరాఖండ్ ప్రయాణమయ్యే వరకు ఈ బ్రుందానికి పొలీసు బందోబస్తు కొనసాగింది. 

ఆంజనేయస్వామి ఆలయంలో

ఆ సాయాంత్రం జిల్లా పూర్వీఠానా బరేలీ టౌన్ కు 39 కి.మి. దూరంలో హయిరొడ్డుమీద ఉన్న ఆంజనేయస్వామి గుడి వెనక పొలంలొ టెంట్లు వేసుకొని, వంటలు చేసుకొని భొజనాలు చేశారు. జొషీమఠ్ కు వెళ్ళే హయివే భగవంతపూరు కుందాలొ పిల్లలకొసం మిఠాయి వంటి తినుబండారం "ఛ్హీఫ్ డా కట్టా మీఠా" 25 కే.జి.లు ఆర్డర్ చేస్తే, మరుసటిరోజు ఉదయం తయారుచేసి ఇచ్చారు. 5 వ తారీకు ఉదయం భవాన్.పూర్ నుంచి బయలుదేరి రాత్రి 9 వరకు, క్యాంపుకు అనువయినచొటు దొరక్క, పిల్లలు రాత్రి చాలా సమయం వరకు సైకిలు తొక్కక తప్పిందికాదు. రాత్రి 9 గంటలకు ఉత్తరాఖండ్ లోని మాతా ఆహ్లదు అనే ఊళ్ళొని గురుద్వారాలొ విశ్రమించారు. ఇది యు.పి, ఉత్తరాఖండ్ సరిహద్దులొ పర్యాటకుల తాకిడి ఎక్కువగా లేని ప్రదేశం.

ఓషొ ఆశ్రమంలో

7వ తారీకు భీంతల్ చేరి, ఓషొ అశ్రమంలో దిగారు. భీంతల్ సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తులో ఉంది. ఓషొ ఆశ్రమలో రెండు రోజులున్నారు. ఆశ్రమం చాలా అందంగా ఉంది. ఇంత ఎత్తయిన ప్రదేశానికి సయికిళ్ళు తొక్కుకొంటూ రావడమే ఈ చెంచు పిల్లల జీవితాల్లొ ఒక మహాద్భుతం. రెండు రొజులు భీంతల్లో తిరిగారు. దూరంగా, మంచుపర్వతాలు హిమాలయాలు, నిర్మలమయిన ఆకాశం, భీంతల్ సరస్సు అన్నీ పిల్లలకు అద్భుతంగా అనిపించాయి.

హాస్పిటల్లొ 18 రొజులు

భీం తల్లొనే సయికిల్ సాహస యాత్రికుల బృందంలో కొందరికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. ఆశ్రమ నిర్వాహకులు నయినిటాల్ వెళ్ళి వయిద్య పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు. భీంతల్ కు నయినిటాల్ కు నడుమ దూరం 22 కి.మి. మాత్రమే. రక్తపరీక్షల్లొ అందరికి కోవిడ్ సోకినట్లు తెలింది. ఈబృందంలొ శ్రీమతి పోలమ్మ, మరో ముగ్గురు పిల్లలకు మాత్రం నెగటివ్ వచ్చింది. పాజిటివ్ అని తెలిన వారిని అప్పుడే కొత్తగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ సెంటరుకు తరలించారు. వ్యాధి సొకనివారిని కూడా ఆ కేంద్రంలోనే విడిగా ఉంచారు. ఒక్క పేరా సిటమాల్ బిళ్లతో అందరికి రోగలక్షణాలు మాయమయ్యాయి. వంశీధర్ కు తీవ్రమయిన కరొన లక్షణాలు ఊన్నందువల్ల తనను ఉత్తరాఖండ్ వ్యాపారకేంద్రం హల్ద్వానీలొ ప్రభుత్వ వయిద్యకళాశాలకు అనుబంధంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. వంశీధర్ వెంట జయంతి సూర్య కుడా వెళ్ళాడు సహాయంగా. సుర్యాకు పాజిటివ్ అయినా రొగలక్షణాలు లేవు. మొత్తం 24 మందిలో వంశీధర్ ను ఒక్కడినె కరొనా చాలా తీవ్రంగా బాధించింది. ఆ బృందంలొ తను ఒక్కడె 50 ఏళ్ళవాడు.

కబురు హయదరాబాదుకు తెలిసింది. సయికిల్ యాత్రికులు కోవిడ్ వ్యాధి బారిన పడినట్లు స్థానిక వార్తాపత్రికలు, టి.వి. ఛానల్సు ప్రముఖంగా ప్రకటించడంతొ ఉభయ తెలుగు రాష్త్రాల పత్రికల్లో, టివిలొ వివరంగా వార్తలు ప్రసారమయ్యాయి. వంశీధర్ కు మెరుగయిన వయిద్యం అందించమని అంధ్రప్రదేశ్ అధికారులు, శ్రీమతి రూపా వెంకట్ గారి ద్వారా ఉపరాష్టపతి ఆపీసు నుంచి కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సమాచారం వెళ్ళింది. హయిదరాబాదు మిత్రులు హర్షవర్ధన్, మరికొందరు హల్ద్వానీలొ మంచి వయిద్యం అందేట్లు చూశారు. హాస్పిటల్ భొజనం సహించక పోవడంతో సుర్యా డాక్టరు అమ్మానాన్నలు తమ పలుకుబడితో ఉడిపి హొటల్ నుంచి రొజూ రెండుపూటలా సూర్యాకు, వంశీకి భొజనం ఏర్పాటు చేశారు. వంశీధర్ వయిద్యకళాశాల హాస్పిటల్లొ మార్చ్ 8 నుంచి 20 వరకు మొత్తం 18 రొజులుండి, స్వస్థత చేకూరిన తరవాత, డిశ్చార్జ్ ఆయినాడు. ఉడిపి భొజనం బిల్లు 13 వేలు అయినా మనభొజనం తినగలిగారు జ్వరం రోజుల్లొ. చెంచు పిల్లల్లొ రోగలక్షణాలే కనిపించలేదు.

యు. పి, మన ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు సహాయం అందించాయి.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం, హాల్డ్వాని స్వచ్చంద సంస్థలు సయికిల్ యాత్రికులను చాలా బాగా చూచుకొన్నాయి, ఒంటిమీద బట్టలతో హాస్పిటలుకు పంపినా, అందరికి మూడు జతల కొత్తబట్టలు, సోపులు, వంటి నిత్యావసరాలు, ప్రతి వస్తువుకు లొపం లే కుండా ప్రభుత్వ అధికారులు గమనించుకున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. పిల్లలు ఆడుకోను ఆటవస్తువులు, టివిలు ఏర్పాటు చెశారు. వాళ్ళసలు హొం సిక్ కాలేదు. మార్చ్ 29 న వంశీధర్, సూర్య హాస్పిటల్ నుంచి విడుదలయి, నయినిటాల్లొ చెంచు పిల్లలను కలుసుకొన్నారు. అంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహస యాత్రికుల బ్రుందం తిరిగి రావడానికి అవసరమయిన ఆర్థిక సహాయం చేయడంతొ ఒక వ్యాన్ను, ముగ్గురు డ్రయివర్లను మాట్లడుకొని, భీంతల్ లో సయికిళ్ళను ఎర్రగుంటకు పంపించారు. మార్చ్ 27 సాయంత్రం ఓషొ అశ్రమం ఖాళీచేసి, ఆశ్రమ నిర్వాహకుల వద్ద సెలవుపుచ్చుకొని తిరుగుప్రయాణమయ్యారు. 30 హయిదరబాదు, శ్రీశయిలం మీదుగా ఎర్రగుంటపాలెంలో చెంచుపిల్లలందరిని దింపి, కొండయ్య దంపతులను తోడిచ్చి పాలుట్ల పంపి, సూర్యాను హయిదరాబదులొ అమ్మానాన్నలకు అప్పగించి, వంశీధర్ మే 1 వ తారీకు ఉదయం హయిదరాబదులొ తన కుటుంబాన్ని కలుసుకొన్నాడు.

 పాపం!వంశీధర్  శ్రీమతి  అప్పటికే, కరొనాత ఇంట్లో అయిసొలేషన్.లొ ఉండి వయిద్యం చేయించుకొంటున్నది. వంశీధర్ కు  ఇప్పటికి కరొనా వల్ల పెరిగిన చక్కెర అదుపులోకి రాలేదు. 

అజేయుడు చిన్నారి హనుమంతు

తనవెంట యాత్రకు వచ్చిన చిన్నారుల్లో 11 సంవత్సరాల హనుమంతు యాత్ర కొసామొదలు మొత్తం దూరం సయికిల్ తొక్కాడు. మిగతావాళ్ళు గాయపడినపుడు, అలసిపోయినపుడు కాస్త దూరం అయినా వ్యాన్ లో ఎక్కారు, కొందరు పెద్దపిల్లలు ఆరోగ్యం బాగున్నా పంతానికి వ్యానులో కూర్చొంటామని పేచీలు పెట్టారు, కానీ ఈ బాలుడు మాత్రం ఒక్క పర్యాయం కూడా వ్యాన్ ఎక్కకుండా మొత్తం పాలుట్ల నుంచి భీంతల్ వరకు ౩౦౦౦ పైచిలుకు కి.మి. దూరం సయికిలు తొక్కాడు. అణకువ, సహనం, వినయం ఈ బాలుడి లక్షణాలు. పాలుట్లలో రొజూ పరుగు ప్రాక్టీస్.లో కూడా అందరికంటే మొనగాడుగా నిలిచేవాడు. టీం స్పిరిట్, నాయకత్వ లక్షణాలు అపరిమితంగా ఇతనిలో ఉన్నాయి. ప్రోత్శాహం ఉంటే గొప్ప క్రీడాకారుడు కాగలడని వంశీధర్ మెచ్చుకొన్నాడు.

చిన్నారి క్రీడాకారులు

మందల రాజేష్ అనే 7 సంవత్సరాల బాలుడు కూడా కఠిన పరిశ్రమ చేస్తాడని, నాయకత్వ లక్షణాలున్న బాలుడని వంశీధర్ అభిప్రాయం. ఈ బృందంలో సభ్యుడయిన కుడుముల చిన్న అంజి వ్యవసాయ కూలి, తండ్రి మద్యానికి బానిస అయి పిల్లలమీద శ్రద్ధ పెట్టలేదు. ఈ బాలుడికి దేన్నయినా వెంటనే నేర్చుకోగల ప్రతిభ ఉంది. 16 సంవత్సరాల ఆంజనేయులులో చాలా మార్పు వచ్చింది. లిజనింగ్ స్కిల్ల్స్ పెరిగాయి. 7 ఏళ్ళ చంద్రకళకు వంశీధర్ "పరుగులరాణి" అని పేరుపెట్టాడు. 2020 నుంచి మేరథాన్ పరుగు పందెంలో పాల్గొనడానికి ప్రాక్టీసు చేస్తోంది. ఆశయ సాధనకోసం దృఢంగా నిలబడగలశక్తి తనలో ఉంది. 7 ఏళ్ళ నిమ్మల ఆంజనేశ్వరిని యాత్రలొ అందరూ 'వంటలక్క' అని పిలిచేది. ఈ బాలిక గృహకృత్యాలలో ఆరితేరింది. ఇంట్లో అన్నీ అననుకూల పరిస్థితులే. అయినా నిబ్బరంగా ఉంటుంది. మరో 7 ఏళ్ళ బాలిక చెంచులక్ష్మి సరయిన పోషకాహారం లేకపోయినా మంచి దేహబలం కలిగిన బాలిక. మారథాన్ కు తయారయింది, కాని ఆమె తండ్రి ఆమె శిక్షణకు, చదువుకు ఒప్పుకోలేదు. వంశీధర్ చెంచు పెద్దలచేత చెప్పించి మారథాన్ పరుగు పందెంలో శిక్షణ ఇప్పించాడు. ఆ అమ్మాయిని నేస్తులు 'ఎలుగుబంటు' అని పిలుస్తారు. చెవుల అంజలి షుమారు 13 సంవత్సరాల బాలిక. దూకుడెక్కువ, పిలిచి తగాదా పెట్టుకొనే రకం. ఈ అమ్మాయికి కడుపులో ఏదోవ్యాధి అని తల్లిదండ్రులు ముద్రవేశారు. ఈ 83 రొజుల సయికిలు యాత్రలో ఒక్కసారి కూడా తనకు సుస్తి చేయలేదు. ఆఖరుగా దివ్యభారతి గురించి. 12 ఏళ్ళకే ఎన్నో కష్టసుఖాలనుభవించి వ్యవసాయ కూలీగా మారింది. ఈ యాత్రలో పాల్గోన్నతరువాత అమిత సాధుప్రవర్తన, దివ్యత్వం ఆమెలో ప్రస్పుటమయినాయని వంశీధర్ అంటాడు. యాత్రలో అందరు కొంచం హిందీ అర్థం చేసుకొనే స్థితికి వచ్చారు. వీరు, హైదరాబాదు, అయోధ్య, లక్నో, అలహాబాదు, వారణాసి మొదలయిన నగరాల గుండా ప్రయాణంచేశారు. భీమ్తల్, అలహాబాదు, నైమిశారణ్యం, అయోధ్య, లక్నొ, వారణాసి, జబల్పూర్ వంటి కొత్త ప్రదేశాలు చూశారు. ఉత్తరాఖండ్ లో పవిత్ర ప్రదేశాలు దర్శించారు. కృష్ణ, గోదావరి, యముమ, గంగ, గోమతి వంటి నదులను, ఆనకట్టలను చూశారు. గోండుల తండాలో రెండురోజులు గడిపారు. వీరి యాత్ర విశెషాలను ఉత్తర భారత దేశంలో పత్రికలు, టి.వి ప్రముఖంగా ఇచ్చాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలుసుకోడం ఒక అపూర్వ విషయం. ఈ చెంచు పిల్లలు, 8000 అడుగుల ఎత్తుకు, 3000 కి.మి.దూరం సయికళ్ళలో ప్రయాణించడం సామాన్యమయిన విషయం కాదు. సీతాపూర్ రోడ్డులో ఒక ముస్లిం సోదరుడు చెంచు పిల్లలకు 2లీటర్ల మంచినీటి బాటిళ్ళు, సోమాసాలు కొనిపెట్టాడు. కొన్నిసార్లు దారిన పోయేవాళ్ళు పిల్లలకు స్నాక్స్ కొనిపెట్టారు. అయోధ్యలో తెలుగు యాత్రికులు తారసపడి 1800 రూపాయలు ఇచ్చారు. వారణాసిలో లక్ష్మిపుష్ప అనే యువతి గంగ అవతలి తీరానికి వెళ్ళడానికి పడవవాణ్ణి పరిచయం చేసింది. అతను సంతోషంగా నదిని దాటించాడు. ఆ పడవవాడు అనేక భాషలు మాట్లాడుతాడు. హాల్ద్వాని అనే చోట ఒక చెంచు పిల్లవాడు పొరబాటుగా ఒక పుష్ కార్ట్ ను డీకొట్టి, పొరపాటు గ్రహించి అతని వస్తువులన్నీతీసి బండిమీద పెట్టాడు. పిల్లలు ఈ యాత్రలో నేర్చుకొన్న మంచి విషయం ఇది. హనుమాన్ గడ్.లో హనుమాన్ ఆలయంలో సన్నని ఇసుక, ధూళి చాలా ఇబ్బంది పెట్టింది. ఏప్రిల్ 6 న ఉద్డంపూరులో వాతావరణ కాలుష్యం దారుణంగా ఉన్నదని వంశీధర్ అన్నాడు. రాజేష్ అనే కుర్రాడు తరచు వేగంగావెళ్ళే వాహనాలను దాటుకొని పోవడంవల్ల పడిపోయేవాడు. చిన్నపిల్లల సయికళ్ళు చిన్నచిన్న రిపేర్లు తప్ప కొత్తవిగానే ఉన్నాయి, బ్రేక్ రబ్బర్లు వంటివి మార్చడం తప్ప. ఎదిగిన పిల్లలు గుంటమిట్ట చూడకుండా తోలడంవల్ల రిమ్ములు మార్చవలసి వచ్చింది. కొండయ్య భార్య పోతమ్మ ఈ యాత్రలో పర్సనల్ హైజిన్ చాలా నేర్చుకొన్నది. అయితే ఆమెకు అందరిని సమానంగా చూడండం తెలియదు. బంధువుల పిల్లలను ప్రతేకంగా చూసేది. ఉత్తర భారతంలో సామాన్య ప్రజలు దూరాభారాలకు కూడా సయికిలు వాడతారు. ఈ సయికిలు సాహస యాత్రలో తనకు గుర్తుండిపోయినవి భీమ్తల్ మౌంట్ వ్యూ అతిథి గృహం నుంచి చూచిన హిమాలయ అపూర్వ దృశ్యాలు, యు.పి సిఎంను కలుసుకోడం, పోలీసుల రక్షణ, గోమతి ఘాట్ ను పిల్లలు శుభ్రం చేయడం, వంటి దృశ్యాలని వంశీధర్ అన్నాడు. కరోనా వల్ల ఇబ్బందులు పడినా, క్షేమంగా ఇల్లు చేరడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజనశాఖ అధికారులు, మిత్రులు, కుటుంబ సభ్యలకు రుణపడ్డానని అన్నాడు. మొత్తంమీద అప్పుడప్పుడే కరోన తలెత్తుతున్న వేళ యాత్రకు బయలుదేరడం దుస్సాహసమే. అందుకే దీన్నొక ఎస్కెపేడ్ అనాలి. పాలుట్లలో చెంచు పిల్లలు కొత్త సయికళ్ళను తమ మిత్రులకు గర్వంగా ప్రదర్శిస్తూ, రొజూ అడవి దారుల్లో విహారాలు చేస్తున్నారు. కొండమ్మ, పోతమ్మ మా అబ్బాయికి సహాయంగా ఉంటూ చెంచుల సేవకు సమాయత్తమవుతున్నారు.

                                                       అయిపోయింది. 

(మా అబ్బాయి కాళిదాసు వంశీధర్ 2021లొ సైకిలు యాత్ర చేస్తున్న సమయంలో ప్రతిరోజు ఫోన్ చేసి యాత్ర వివరాలు తెలియజేశాడు. అలాగే ప్రతిరోజు phone short messages ద్వారా తన యాత్ర వివరాలు తెలియజేశాడు. ఫోన్లో మట్లాడినపుడు తను తెలియజేసిన వివరాలను నేను రాసుకొని గ్రంథస్థం చేశాను. ఆయా ప్రదేశాలలో తీసిన ఫొటోలు కూడా నాకు మా కుమారుడు వంశీధర్ పంపించాడు. తాను ఈ యాత్రను కొనసాగించిన సమయంలో ఫోనులో తనతో ప్రతిరోజు జరిపిన సంభాషణ ఆధారంగా ఈ యాత్రాచరిత్రను తయారుచేసి అచ్చు ప్రతిని పత్రికలకు, మిత్రులకు, బంధువులకు అందించాను. ఈ డాక్యుమెంటు సృష్టికర్తను నేనే. ఫొటోలను కాళిదాసు వంశీధర్ తీసినవి. ఇందులో చేర్చిన ఫొటోలు కొన్ని అప్పుడే హిందీ, తెలుగు, ఇంగ్లీషు దినపత్రికలలో ప్రచురించబడినవి.ఈ డాక్యుమెంటు హక్కులు అన్నీ నావే. వీటిని వికీపీడియాలో ఉంచడంద్వారా అందరూ వాడుకోడానికి వీలు కల్పించాను. మూలాలు: 1.అఖిల భారతదేశ దిన పత్రికలు ప్రచురించిన వార్తలు, 2. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం ప్రచురించిన యత్రాచరిత్ర పుస్తకం "సైకిలుపై సాహస యాత్ర, పాలుట్ల గిరిజన బిడ్డలు కార్గిల్ ప్రయణం" 2021 ప్రచుణ, ప్రచురణకర్త, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం.16/ 1179, కస్తూరిదేవినగర్, పొగతోట, నెల్లూరు. పిన్.కోడ్ 524 001. ఆంధ్రప్రదేశ్.