శీర్షిక

బైబులు బోధలు -వేమన నీతులు

ఒక తులనాత్మక పరిశోధన

a comparative study of teachings of bible and vemana

అను శీర్షిక

ఇది యేసుక్రీస్తు తదిరతర నూతన,పూర్వ నిబంధనల జ్ఞాన బొధకుల, 16వ శతాబ్ది తెలుగు యోగి వేమన ఉపదేశాలకు మధ్యగల నైతిక,సామాజిక, సాంస్కృతిక,తాత్త్విక సారూప్యాల,తాత్త్విక చింతనల విశ్లేషణాత్మక అవలోకనం.

ఉపోద్ఘాతము ఆసియా ఖండంలో అవతరించిన మతాలన్నిటి ఆలోచనా విధానాలలో భావసారూప్యత ఉన్నదని విశ్వసించవచ్చు. వీరిలో యూదు, క్రైస్తవ తత్త్వాల వ్యవస్ధాపకులు మోషే,క్రీస్తులది ఒక విలక్షణ మార్గం. బైబిల్లో నిక్షిప్తమైయున్న వీరి తాత్త్విక చింతనలో ధర్మశాస్త్రమున్నది,సామాజిక న్యామున్నద.తత్త్వశాస్త్ర సూత్రీకరణ ఉన్నది, మత నియమానాలున్నాయి.వేమన ప్రబోధాలలో కూడా తరచి చూస్తే అనేక దృక్కోణాలున్నాయి.

బైబిలు ప్రబోధాల సంగతి చూసే అనేకానేక ప్రజాభాషల్లోకి అనువాదాలు జరిగిన కారణాన,బైబిలుపై దైవజ్ఞులు వ్రాసిన భాష్యాలు, వ్యాఖానాలు జనప్రియం అయిన కారణాన బైబిలు భావజాలమంతా ప్రపంచ జనసామాన్యానికి కరతలామలకమే. అలానే తెలుగువారి పాలిట వేమన ఒక విలక్షణ మూర్తి. అతని ప్రబోధాలను ఎవరూ గ్రంథస్ధం చెయలేదు. ఒక సీమలో ఒక పద్యం అశువుగా వినిపించి కదిలి వెళ్ళిపోతే అది ఆ ప్రజల హృదయాంతరంగంలోను, నాలుక మీదా అలా నర్తిస్తూనే ఉండేది. భావం సుస్పష్టం. ఎవరూ టీకా తాత్పర్యాలు వ్రాయనవసరంలేదు. బ్రౌను తదితర ఆధునికులు వేమన పద్యాలు సేకరించి ప్రామాణీకరించారు.

ఇకపొతే యేసుక్రీస్తు, వేమన సమకాలీనులు కాకపోయినా బోధనాశైలిలో సారూప్యత ఉన్నది. క్రీస్తు చిన్న చిన్న కథల ద్వారా నీతిపాఠాలు నేర్పించాడు. వేమన ఆటవెలది ఎంచుకున్నాడు. ఇద్దరూ సర్వసంగ పరిత్యాగులే; సంచారా బోధకులే. సమకాలీన మత సమాజంలోని కల్మషాన్ని అధిక్షేపించినవారే. నైతికతనూ, నిజమైన ఆధ్యాత్మికతనూ బోధించి సమాజాన్ని మేల్కొల్పబూనుకున్న వైతాళికులే. వేమన భోగిగా జీవించి యోగి అయినాడన్నది పరిశోధకుల ఏకాభిప్రాయం. క్రీస్తు బ్రహ్మచారి. బాబాలను, అమ్మ తల్లులను దేవతామూర్తులుగా ఎంచి కొలిచే తెలుగు సమాజంలో వేమనకు దైవత్వం ఆపాదించిన దాఖాలాలు మచ్చుకైనా లేవు. తాను దేవుడనని ఒక మనిషి చెప్పుకుంటే మరణశిక్ష విధించే యూదు సమాజంలో క్రీస్తు జీవిత కాలంలోనె ఆయన్ను దేవుడుగా ఎంచి పూజించిన వారున్నారు. ఆ తరువాతి సంగతి చెప్పనవసరం లేదు.

క్రీస్తు దైవత్వపు పొరలు ఒలిచి ఆయన్నొక నీతిబొధకునిగా ఆరాధించినవారు మహాత్మాగాంధీతో సహా చరిత్రలో అనేకులు. క్రీస్తు ఉపదేశమణులు పొదిగిన బంగారు పొది ప్రాచీన యూదు జ్ఞాన సాహిత్యం. మొత్తంగా బైబిల్లోని ప్రాచీన, నవ నిబంధన గ్రంథాల ఆలోచనామృత మంతనీటి పరిగణలోనికి తీసుకుంటూ, మరొకవైపు వేమన అచ్చతెలుగు ఉపదేశభారను క్రమానుగతంగా పోల్చగలిగితే ఎన్నెన్నో విజ్ఞాన సిరులు పండిచవచ్చన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే క్రీస్తు, వేమన ఇద్దరిలోనూ సమకాలీన సమాజపు పోకడల విషయంలో ప్రగాఢమైన విషాదాత్మకమైన సానుభూతి, కోపం, ఆక్షేపణ ఉన్నాయి. ఈ భావాల నుండే వీరిద్దరి బోధనలు ఆవిర్భవించాయి. ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఈ ఇద్దరినీ సమాకాలీనులు తిరస్కరించారు.

బైబిల్లో యేసుక్రీస్తు గాక పాత నిబంధన యూదు చక్రవర్తి సాలోమోను మాహాజ్ఞానిగా ప్రసిద్దికెక్కాడు. ఇతని జీవిత విధానం, వ్రాతలు, వేమనకు మరింత దగ్గరగా ఉన్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముందున్నట్టు ఇతడు భోగలాలసుడై విషయ వాంఛలలో మునిగితేలాడు. చరమాంకంలో సుఖభోగాలకు ముఖంమొత్తి 'సమస్తం వ్యర్ధం' వ్యర్ధమంటూ వైరాగ్యం అలవరచుకున్నాడు. అతడు వ్రాసిన కీర్తనలు, సామెతల సంకలనం, జ్ఞాన సాహిత్యం బైబుల్లో లభ్యమవుతున్నాయి. ఈ విధంగా బైబిలు తాత్త్విక, నైతిక, సామాజిక దృష్టినీ, వేమన్న వేదంలోని ప్రతిపాదనలనూ తులనాత్మకంగా విశ్లేషించి రెంటిలోనూ కనిపించే భావసారూప్యతను క్రోడీకరించడం ఈ పరిశోధన లక్ష్యం.

origin of the problem

పరిశోధన విషయం పుట్టుపోర్వోత్తరాలు

ప్రస్తుత పరిశోధకుడు తన పి.హెచ్.డి పట్టా కోసమైన పరిశోధానాంశంగా బైబిల్లోని సామెతలకు, వాడుకలోనున్న తెలుగు సామెతలకు మధ్య గల భావసారూప్యతను విశ్లేషిస్తూ తులనాత్మక అధ్యయనం చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి పరిశోధనా వ్యాసం సమర్పించాడు. పరిశోధన సమయంలో అనేక తెలుగు సామెతలకు పుట్టినిల్లుగా, దగ్గర చుట్టాలుగా వేమన పద్యాలను ప్రస్తావించే సందర్భాలు అనేకం తటస్థించాయి. ఈ 16 వ శాతాబ్ది యోగిపుంగవుడు, నీతిబొధకుడు పలికిన ప్రబోధాలు బైబిలు ఉపదేశాలను పోలి ఉన్నాయన్నది ఆ పరిశోధనా వ్యాసం స్పష్టం చేసింది. దానికి కొనసాగింపుగా వేమన వాక్కులు ప్రధానాంశంగా తీసుకొని ఈసారి బైబిలు సామెతలే గాక యేసుక్రీస్తు తదితర బైబిలు మహానీయులు ఉపదేశాలతో తులనాత్మక అధ్యనం చేఅయాలన్నాఆలోచన మొగ్గ తొడిగింది.

ఇటు వేమన పద్యాలు, వాటి వివరణ విశ్లేషణలు, అటు బైబిలు వ్యాఖ్యాన వాజ్మయం పుంఖానుపుంఖాలుగా వెలువడినా ఇలా తులనాత్మక అధ్యయనం ఈ రెండు జ్ఞానవిధుల మధ్య అంతగా జరగలేదనే చెప్పాలి. అసలు తెలుగు సాహిత్య విమర్శలకు పరిష్కర్తలకు వేమన పద్యాలేవో, ప్రక్షిప్తాలేవో నిర్ణయించడానికే సాధ్యపడడం లేదు. కొందరైతే టీకా తాత్పర్యాలు, అర్థ వివరణతోనే సర్రిపెట్టుకుంటున్నారు. అది న్యాయం కూడా. అయితే పరిశీలనను తాత్త్విక దృగ్విషయాల స్థాయికి విస్తరించి విశ్వవిఖ్యాత మత గ్రంథం బైబిలుతో జోడించి చూస్తే లభించగల జ్ఞాన రహస్యాలనేకం.

పైన ప్రస్తావించిన ప్.హెచ్.డి పరిశోధనను పురస్కరించుకుని సేకరించిన మూలగ్రంథాలు, ప్రోదిచేసిన ఆలోచనలు, అవగతమైన పరిశోధనాంశాలు, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని బైబిలు- వేమన తులనాత్మక పరిశీలన అనేది గత పరిశోధనకు ఒక తర్కసహితమైన విస్తృతి.

బైబిలు ప్రబోధాల గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన విషయంలో అందుబాటులో ఉన్నప్పటికీ అందులోని ముఖ్య విషయాలు తెలుగువారికి అపరిచితాలుగానే మిగిలిపోయాయి. ఇక వేమన స్థూలంగా తెలుగు బాలలు ఆపేక్షగా కంఠస్థం చేసే పద్యాలు చెప్పిన కవిగానే ఉండిపోయాడు తప్ప ప్రపంచ తాత్త్వికులలో వేమనకు సముచిత స్థానం కలిగించడమనే బృహత్కార్యం అలానే ఉండిపోయింది. ఈ స్వంద్వ లక్ష్యాలు ఈ పరిశోధన ఆవశ్వకతకు ప్రాణం.

ఈ పరిశోధన ప్రపంచ తత్త్వవేతల ప్రబోధాల మధ్య విసృతమైన తులనాత్మక అధ్యయనాలకు తెరదీస్తుంది. బెట్రండు రస్సెల్-జిడ్డు కృష్ణమూర్తి; గాంధీ మహాత్ముడు- మార్టిన్ లూథర్ కింగ్; సోక్రటీసు- వర్థమాన మహావీరుడు. ఇలా ఎన్నెన్నో ఆధ్యాత్మిక, తాత్త్విక చింతనలను ఒకదాని ప్రక్కన ఒకటి ఉంచి అన్ని కోణాల్లో విశ్లేషించవలసిన అవసరం ఉంది. అటువంటి ఒరవడి సృష్టించాలనే అభిలాష ఈ పరిశోధనకు ప్రేరణ, మూలం.

inter disciplinary relevence అంతర్విద్యా విభాగ ఔచిత్యము

ఈ పరిశోధనకు పూనుకొనేందుకు ఈ పరిశోధకుని పురిగొల్పిన ముఖ్యాంశం దీనిలోని అంతర్విద్యా విభాగత(inter disciplinary nature)

  • తత్త్వ శాస్త్రము(philosophy)

వాస్తవికత (reality), ఉనికి(existence) ఎరుక(knowledge), విలువలు(values), హేతువు(reasons), బుద్ధి(mind), భాష(language), తదితర రంగాలకు చెందిన సమస్యలు అనెక శతాబ్దాలుగా బుద్దిజీవులను సవాలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని నాగరికతలలోనూ ఈ విషయాల గురించిన మేధోమథనాలు జరుగుతూనే వచ్చాయి. మానవ బుద్ధికుశలత ఈ సవాళ్ళను స్వీకరించి ఎన్నెన్నో సైద్దాంతిక సంచయాలను ఆవిష్కరించింది. తత్ఫలితంగా అమూర్త భావాత్మక శాస్త్రము(metaphysics), మీమాంస దర్శన శాస్త్రము(epistemology), తర్క శాస్త్రము(logic), నైతిక శాస్త్రము(ethics), సౌందర్య పరిశీలనా శాస్త్రము(aesthetics) తదితర రంగాలతో తత్త్వశాస్త్రమనే(philosophy), ఒక నూతన శాఖ రూపుదిద్దుకున్నది. ప్రస్తుత పరిశోధనలో బైబిలు, వేమన వచనాలను పైన పేర్కొన్న కోణాలన్నిటిలో విశ్లేషించడం జరుగుతుంది. ఇది తాత్త్విక పరిశీలన.

  • భాషా శాస్త్రము(linguistics)

భాషాపరంగా చూస్తే బైబిలు ప్రాచీన హీబ్రూ గ్రీకు భాషల్లో విరచితమైన ప్రస్తుతం అనేక ప్రపంచ భాషలోతో సహా తెలుగులో మూడు నాలుగు అనువాదాలుగా లభ్యమవుతున్నది. ఇక వేమన్న కైతలు గుండ్లకమ్మవాగులో పరుగులెత్తే స్వచ్ఛమైన నీటివలె పదహారణాల తెలుగు పదమాలికలు. బైబిలు అనువాదాలను మూలభాషతో కొంతవరకు సరిచూస్తూ ఆయా అనువాదకులు వినియోగించిన పదవైవిధ్యాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించే అవకాశం ఉంది. ఒక్కొక్క భావ వ్యక్తీకరణకై ఎన్నుకొన్న పదజాలాన్ని విశ్లేషించడం ద్వారా అనువాద సాహిత్య పోకడలను ఆకళింపు చెసుకునే అదను ఉంది. ఇక వేమన ఆటవెలదుల సరళత, భావ శబలత, శిల్పం, శయ్య, జాతీయాలు మొదలైన భాషా సొబగులను ఎత్తి చూపించడానికి పుష్కలంగా ఆస్కారం ఉంది.

  • సారస్వతము(literature)

బైబిలు వైనంలో గానీ, వేమన పద్యాలలో గానీ కనిపించే సాహిత్యాన్ని విలువలు తలుచుకుంటే నోరూరిస్తాయి. అలంకారాలు, ఊనిక, కథనాలు, శైలి ఈ పరిశోధనలో కీలకమైన అంతర్భాగాలు. బైబిలులో జ్ఞాన సాహిత్యం (వీటినే కావ్య గ్రంథాలు అంటారు), చరిత్ర, ఔపదేశిక విభాగం, వంటి వివిధ ప్రక్రియలున్నాయి. కథాకథనం రసవత్తంగా ఉంటుంది. చరిత్ర నేపథ్యాలనుకనుగుణంగా బైబిలు సరసత్వం ఉనికిలోకి వచ్చింది. ఇకపోతే వేమన ప్రబోధాలలో సందర్భానుసారంగా వచ్చే పురాణేతిహాస ఘట్టాల ప్రస్తావనలు రసరమ్యమై అలరారుతుంటాయి. ఈ పరిశోధనలో బైబిలు, వేమన సార్వస్వత సౌరభాలు విడదీయరాని అంతర్భాగాలు.

  • సమాజిక, చారిత్రక విశ్లేషణ(social analys)

పరిశోధనకై పరతిపాదించిన రెండు సాహితీ విభాగాలూ నాటి సమాజంలో నుండి పుట్టినవే. ఈ రెండు సాహిత్యాలు స్రష్టలు తమ దేశ కాల పరిస్థితుల ఉత్పాదనలే. ఆ కారణంగానే సొలొమోను అయినా క్రీస్తు అయినా, వేమన అయినా తాము సంచరిస్తున్న, వీక్షిస్తున్న సమాజంపైనే తమ దృస్టి నిశితంగా కెంద్రీకరించారు.

స్త్రీల స్థితిగతులు, వివిధ సామాజిక సంస్ధల రూపురేఖలు, వాటి సంభవాల కార్యకారణ దృష్టి, సమర్ధవంతంగా నిర్వచించి నిర్వహిండానికి బైబిలు వేమన పద్యాలు బహు ఉపయుక్తం. క్రీస్తుకు పూర్వమూ, క్రీస్తు జీవితకాలంలోనూ పాలస్తీనా ప్రాంతీయుల జీవన సరళి,16 వ శతాబ్దంలో వేమన సంచరించరించిన దక్షిణాంధ్ర సీమ తీరుతెన్నులు ఈ రెండు వాజ్మయ సమూహాలలో సాక్షాత్కరిస్తాయి. తమ సమకాలీన సమాజాన్ని ఈ బోధకులు ఏ దృస్టితో చూశారు, గోచరించిన రుగ్మతలకు ఎటువంటి ఔషధాన్ని ఇవ్వజూపారు, ఎలా తెగనాడారు అనే అంశాలు పరిశీలించడం లాభదాయకంగా ఉంటుంది. వేమన విష్యంలోనైతే వేమన కాల నిర్ణయ చర్చలో నాటి ఆంధ్రదేశపు చరిత్రపు కూడా ఆవిష్కృతమవుతుంది.

  • నైతిక ప్రబోధం(ethical teaching)

నీతిశాస్త్రం ఇంతకుముందు ఉదాహరించిన తత్త్వశాస్త్రంలో ఒక శాఖ అయినప్పటికీ విశ్లేషణకై దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం సమంజసం. ఎందుకంటే బైబిలు, వేమన ఉపదేశాలు రెండూ ప్రధానంగా నీతిప్రతిపాదకాలు. ఆ కాలాల్లో అవినీతిని ఎలా నిర్వచించారు, గుర్తించారు అన్నది ఒక విషయమైతే, ఎలాటి నీతులు ఈ ప్రబొధాలలో నుండి పుట్టుకొచ్చాయి. వాటి ప్రాచీనత, సంప్రదాయికత పరిలేని అన్నది ఆసక్తికరమైన పరిశోధన.