వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 49వ వారం

బి.నాగిరెడ్డి

బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - ఫిబ్రవరి 25, 2004) తెలుగు సినీనిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.ఈయన డిసెంబర్ 2, 1912న కడప జిల్లా ‌పొట్టింపాడు గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. ఆ పల్లెటూరి వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతంలాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పది, పన్నెండేళ్ళు వచ్చేనాటికే పురాణేతిహాసాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకోగలిగాడు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత ఆయన మద్రాసు (ఈనాటి చెన్నై) నగరాన్ని చేరుకుని కొన్నేళ్ళపాటు పాఠశాల విద్య అభ్యసించాడు. పాఠశాల విద్య పూర్తి కాకుండానే ఆయన తన కుటుంబం నడుపుతున్న ఎగుమతి వ్యాపార బాధ్యతలు చేపట్టవలసివచ్చింది.యువకుడుగా ఆయన స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఖాదీ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ వ్యాపార నిమిత్తం బర్మా వెళ్ళవలసి వచ్చింది. అయితే రెండవ ప్రపంచయుద్ధసమయంలో వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. ఆయన మళ్ళీ జీవితం కొత్తగా ప్రారంభించవలసివచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించాడు. క్రమంగా ప్రచురణ రంగప్రవేశానికి అదే దోహదం చేసింది. (ఇంకా…)