వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 43వ వారం

గుండు సుదర్శన్

డాక్టర్ గుండు సుదర్శన్ (సూరంపూడి సుదర్శన్) ఒక ప్రముఖ హాస్య నటుడు, రచయిత. సుమారు 350 పైగా సినిమాలలో నటించాడు. పది సంవత్సరాల వయసు నుండే నాటకాలలో నటించిన అనుభవం ఉంది. 1993 లో బాపు దర్శకత్వంలో వచ్చిన మిష్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆయన సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ, హైదరాబాదులోని జె.ఎన్.టి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్.డీ చేశాడు. మనస్తత్వ శాస్త్రంలో కూడా పట్టా సంపాదించాడు. సినిమాలలో పూర్తి స్థాయి నటుడు కాక మునుపు తన స్వస్థలమైన భీమవరం లోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేశాడు. నటన పై మక్కువతో తెలుగు సినిమాలలో హాస్యనటుడిగా రాణిస్తున్నాడు. ఖాళీ సమయాలలో విద్యార్థులకు, ఉద్యోగులకు స్ఫూర్తి దాయక ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఆయన పుట్టి పెరిగింది అంతా భీమవరంలోనే. తల్లిదండ్రులు సుబ్బారావు, కనకలత. తండ్రి సుబ్బారావు న్యాయవాదిగా పనిచేసేవాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి ఊర్లో జరిగే పౌరాణిక నాటకాలు అన్నీ చూసే అలవాటు ఉండేది. ఏడో తరగతి దాకా తాతగారి ఊరైన మంచిలి లో చదివాడు. పదేళ్ళ వయసు నుంచి నాటకాల్లో నటించడం ప్రారంభించాడు.

(ఇంకా…)