వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 01వ వారం

వేదనారాయణస్వామి ఆలయం

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురంలో ఉంది. ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు, శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్థల పురాణంగా చెప్పబడుతుంది. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని ఈ ఆలయ ఉత్తర కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియుచున్నది. ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత.

(ఇంకా…)