వీరపుత్రుడు 1962, నవంబర్ 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఎం.ఎ.తిరుముగం దర్శకత్వంలో దేవర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించబడిన తాయై కత్త తనయన్ అనే తమిళ సినిమా దీనికి మాతృక. తెలుగులో ఈ చిత్రాన్ని ఇ.ఆర్.రాధాకృష్ణ అపరాజిత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

వీరపుత్రుడు
(1962 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎ.తిరుముగం
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
బి.సరోజా దేవి,
కన్నాంబ
గీతరచన అనిసెట్టి
సంభాషణలు అనిసెట్టి
నిర్మాణ సంస్థ అపరాజిత ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఎం.ఎ.తిరుముగం
  • మాటలు, పాటలు: అనిసెట్టి సుబ్బారావు
  • ఛాయాగ్రహణం: సి.వి.మూర్తి
  • సంగీతం: కె.వి.మహదేవన్, పామర్తి
  • నృత్యాలు: ఎస్.ఎం.రాజకుమార్
  • కూర్పు: ఎం.ఎ.తిరుముగం, ఎం.జి.బాలూరావు
  • కళ: సి.రాఘవన్
  • స్టంట్స్: ఎం.ఎ.మారియప్పన్
  • నిర్మాత: ఇ.ఆర్.రాధాకృష్ణ

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను అనిసెట్టి వ్రాయగా కె.వి.మహదేవన్ బాణీలు కట్టాడు.[2]

పాటల వివరాలు
క్రమ సంఖ్య పాట గాయనీ గాయకులు
1 చల్లగాలి ఊయలలే అడవిని ఊచే నాకు దివ్యకాంత ఈ వనరాణీ స్వాగతమిచ్చే పి.సుశీల
2 కన్నులందు వెన్నెలలూగు కదిలినంత నాట్యముసాగు కలికి నాలో కవ్వించేను విరహములే ఘంటసాల
3 ముద్దులొలుకు రమణి కండ్లు ప్రేమ చిందెను ప్రియురాలి కొంగు జారి ఔనౌనన్నది ఘంటసాల, సుశీల
4 అయ్యా చూడు ఆట చూడు అయ్యా చూడు ఆట చూడు ఇవి సవాలు గుర్రాలు మూడు సుశీల
5 తావులనే చిందించే సుకుమారీ పూవుంది ప్రేమించే మదికొరకు ప్రీతితోడ వేచుంది సుశీల,ఘంటసాల
6 పేరున పిలిచేమా? నాథుని పేరున పిలిచేమా? స్వర్గవిహారం సౌఖ్యవిలాసం వనితకు నాథుడె ఇలలో దైవం సుశీల
7 సాధ్యమన్నద సాధ్యమగూ అసాధ్యమన్నది సాధ్యమగూ సత్యమన్నద సత్యమగూ అసత్యమన్నది సత్యమగూ మాధవపెద్ది సత్యం

కథాసంగ్రహం మార్చు

జమీందారు కొడుకైన శేఖర్‌కు వేట అంటే మహా సరదా. ఒకసారి వేటకై అడవికి వెళ్ళి ఒక ఎద్దును చంపబోతున్న పెద్దపులిని తుపాకీతో కాల్చుతాడు. అది గురితప్పి పారిపోతుంది. ఆ పులి పగబడుతుందనీ, తన తండ్రిని కూడా పెద్దపులి చంపివేసిందనీ, వేటను మానుకొమ్మనీ తల్లి ఎంత వేడుకున్నా ప్రజల శ్రేయస్సుకోసం ఆ పులిని చంపడానికే నిశ్చయించుకుంటాడు శేఖర్. ఆ ఊరిలో భూషయ్య అనే కామందు టీకొట్టు రంగడి చెల్లెలు పంకజాన్ని పెండ్లి చేసుకోమని బలవంతపెడుతూ ఉంటే శేఖర్ అడ్డుకుంటాడు. అంతే కాకుండా ఊరిలో జరిగిన కర్రసాము పోటీలలో అతని సహచరుడు బుచ్చయ్యను ఓడిస్తాడు. దాంతో భూషయ్యకు శేఖర్ బద్ధశత్రువుగా తయారవుతాడు. కొన్నాళ్ళ తరువాత పగబట్టిన పులి పొంచి ఉండి శేఖర్‌పై దాడి చేయబోతే పంకజం అతనికి సహాయం చేసి, ఇంటికి తీసుకుపోయి, కాలికి తగిలిన గాయానికి మూలికలతో కట్టుకట్టి పరిచర్య చేస్తుంది. ఇలా ఆపదలో ఒకరికొకరు సహాయం చేసుకోవడంతో వారిద్దరి మధ్యా పరిచయం ప్రణయంగా మారుతుంది. అది గ్రహించిన భూషయ్య శేఖర్ తల్లికి చాడీలు చెబితే ఆమె పంకజాన్ని అపార్థం చేసుకుని నిందించినా తరువాత ఆమె సహృదయాన్ని అర్థం చేసుకుని నిరుపేద అయినా శేఖర్‌కు ఇచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరిస్తుంది. భూషయ్య రంగడి వద్దకు పోయి శేఖర్ పంకజాన్ని మోసం చేస్తున్నాడని అభాండాలు వేస్తే రంగడు శేఖర్‌ని దుర్భాషలాడి ఆ పెండ్లి జరగదని చెప్పేస్తాడు. కొడుకు విచారాన్ని అర్థం చేసుకున్న శేఖర్ తల్లి రంగడిని ఒప్పించడానికి స్వయంగా అతని ఇంటికి వెళుతుంది. తీరా చూస్తే రంగడు ఎవరో కాదు. ఒకప్పుడు రంగడి తండ్రి జమీందారు వద్ద పనిచేసే నౌకరు. ఒకసారి రంగడి పెండ్లి కోసం వెయ్యి రూపాయలు ఇస్తానని మాటయిచ్చి, ఆఖరికి పెండ్లి నిశ్చయమైన తరువాత ఇవ్వనంటాడు శేఖర్ తండ్రి. దానితో రంగడి పెళ్ళి ఆగిపోయి, అతని తండ్రి దిగులుతో మరణిస్తాడు. శేఖర్ తండ్రి తను మరణించేటప్పుడు తన తప్పిదానికి పశ్చాత్తాపపడుతూ, రంగడు ఎక్కడున్నాడో వెదికి అతనికి తన ఆస్తిలో సగభాగం ఇమ్మని భార్యను కోరతాడు. చాలాకాలం తరువాత కనిపించిన రంగడు, శేఖర్ తల్లి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. శేఖర్‌తో తన చెల్లి పంకజం పెళ్ళికి అంగీకరిస్తాడు. ఆటంకాలన్నీ తొలగి పోవడంతో శేఖర్ తల్లి కొడుకు పెండ్లికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుని ప్రదానం కోసం రంగడి ఇంటికి వస్తుంది. అయితే రంగడు హటాత్తుగా మారిపోయి ఆమెను అవమానిస్తాడు. తన పెండ్లి చెడగొట్టినందుకు ప్రతీకారంగా శేఖర్ పెండ్లి చెడగొడతానని చెబుతాడు. పైగా పంకజాన్ని భూషయ్యకు ఇచ్చి పెళ్ళి చేస్తానని ప్రకటిస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యకు పాల్పడితే శేఖర్ ఆమెను కాపాడుతాడు. శేఖర్ పంకజాల ప్రేమ ఫలించి, పగబట్టిన పెద్దపులిని శేఖర్ ఏవిధంగా మట్టుపెడతాడు అనేది మిగిలిన కథ. [2]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Veera Puthrudu (M.A. Thirumugham) 1962". ఇండియన్ సినిమా. Retrieved 19 December 2022.
  2. 2.0 2.1 అనిసెట్టి, సుబ్బారావు (15 November 1962). Veera Puthrudu (1962)-Song_Booklet (1 ed.). విజయవాడ: అపరాజిత ప్రొడక్షన్స్. p. 12. Retrieved 19 December 2022.