వేణుముద్దల నరసింహారెడ్డి

డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి (1939, జూన్ 9 - 1973, జనవరి 27) తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి. తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా వచ్చన చేతనావర్త కవిత్వాన్ని రాసిన కవులలో నరసింహారెడ్డి సుప్రసిద్ధుడు. ఉస్మానియా తెలుగుశాఖ అధ్యాపకుడిగా పనిచేశాడు.[1]

వేణుముద్దల నరసింహారెడ్డి
వేణుముద్దల నరసింహారెడ్డి
జననం(1939-06-09)1939 జూన్ 9
మరణం1973 జనవరి 27(1973-01-27) (వయసు 33)
వృత్తితెలుగు అధ్యాపకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి
జీవిత భాగస్వామిసుధేష్ణ
పిల్లలుఇద్దరు కుమార్తెలు (మాధవి, రాధిక)
తల్లిదండ్రులు
  • వెంకటరెడ్డి (తండ్రి)
  • మధురమ్మ (తల్లి)

జననం, విద్య మార్చు

నరసింహారెడ్డి 1939, జూన్ 9న వెంకటరెడ్డి - మధురమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగాం జిల్లా, చిల్పూర్‌ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో జన్మించాడు. నరసింహారెడ్డి పుట్టిన పద్దెనిమిదవ రోజుకే తల్లి బాలింత రోగంతో మరణించింది. తరువాత మల్లారంలోని పెద్దమ్మ (మధురమ్మ అక్క) దగ్గర, ఉప్పరపల్లిలోని మేనమామల దగ్గర పెరిగాడు. ఆ తరువాత హనుమకొండ, నక్కలగుట్టలోని నానమ్మ తాతయ్య దగ్గర ఉంటూ కుమారుపల్లి, లష్కర్‌ బజార్లలోని మర్కజి పాఠశాలలో చేరాడు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ పూర్తిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం మార్చు

నరసింహారెడ్డికి 1963లో సుధేష్ణతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (మాధవి, రాధిక).

ఉద్యోగ జీవితం మార్చు

ప్రారంభంలో 1962లో నిజాం కళాశాలలో ఒక సంవత్సరంపాటు లెక్చరరుగా పనిచేసిన నరసింహారెడ్డి, తర్వాత 1963 నుండి 1973 వరకు హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 250 రూపాయల జీతానికి అధ్యాపకుడిగా పనిచేశాడు.

సాహిత్య ప్రస్థనం మార్చు

నరసింహారెడ్డి తన ఇంటినే సాహిత్య వేదికగా మార్చి, అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఉన్నత చదువులకోసం హన్మకొండకు వచ్చేవారు అతని ఇంట్లోనే ఆశ్రయం పొందేవారు.

కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి వందలాది తాళపత్ర గ్రంథాలను తెచ్చుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘పాలకురికి సోమనాథుని కృతులు- పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేశాడు. 2200 పేజీల చేతి ప్రతుల సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించాడు. అతని మరణానంతరం 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ పట్టాను ప్రకటించింది.

1967లో చేతనావర్త కవులు వరంగల్లు వేదికగా ప్రచురించిన ‘చేతనా వర్తం’ అనే కవితా సంకలనంలో నరసింహారెడ్డి కవిత్వం ప్రచురించబడింది.

1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగిన సందర్భంలో తన సంపాదకత్వంలో దేశకీర్తిపై ‘సమర గీత’, 1966తో పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో ‘సమర భారతి’, 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటం సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని నింపుతూ ‘సమర పథే బంగ్లా’ అనే కవితా సంకలనాలను వెలువరించాడు.[1]

రచనలు మార్చు

  1. పాలకురికి సోమనాథుని కృతులు-పరిశీలన (సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్లు): ఈ పుస్తకాన్ని 2021, డిసెంబరు 27న హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ లో తెలంగాణ జాగృతి అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్‌, జూలూరు గౌరిశంకర్‌, గిరిజా మనోహర్‌బాబు, అంపశయ్య నవీన్‌, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[3]
  2. సవిత (కవితా సంకలనం, సాందీపని పబ్లికేషన్స్‌ సంస్థ)
  3. అంగుళి మాల (కథ, జనధర్మ పత్రిక)

గౌరవాలు మార్చు

  • అతడు చేసిన సాహిత్య సేవకు గుర్తుగా పాలకుర్తి ‘సోమనాథ కళా పీఠం’ నుండి 1998లో భార్య సుధేష్ణకు అవార్డు
  • ఆధునిక కవిత్వంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎంఏ విద్యార్థులకు నరసింహారెడ్డి పేరుమీదుగా ప్రతి సంవత్సరం గోల్డ్‌ మెడల్‌ ప్రదానం[2]

మరణం మార్చు

నరసింహారెడ్డి తన 34 ఏళ్ళ వయస్సులో గుండె సంబంధిత సమస్యతో 1973, జనవరి 27న మరణించాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 జీడి, రమేష్‌ (2023-05-22). "ఈ చేతనావర్త కవి ఓ మానవతా మూర్తి". Andhrajyothy Telugu News. Retrieved 2023-05-22.
  2. 2.0 2.1 ఈ చేతనావర్త కవి ఓ మానవతా మూర్తి, జీడి రమేష్‌, ఆంధ్రజ్యోతి సంపాదకీయం, తెలంగాణ ఎడిషన్, 2023 మే 22.
  3. telugu, NT News (2021-12-26). "అరుణ్‌సాగర్‌ విశిష్ట పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 2021-12-26. Retrieved 2023-05-22.