అంకియ నాట్ (Ankia Naat) -అస్సాంలో వైష్ణవ మత ప్రచారానికి, 16వ శతాబ్దిలో వేసిన నాటకాలు. ప్రచార సమయాల్లో, పర్వదినాల్లో, భక్తిప్రేరక కావ్యాలనూ శాస్త్రాలనూ సమూహాల్లో గానం చెయడం, 15వ శతాబ్దంలో వైష్ణవ మతప్రచారకులు ముఖ్యసాధనంగా పెట్టుకున్నారు.అలా గానం చేయడం, వ్యాఖ్యానించి రానురాను అంకియ నాట్ గా నాటకరూపం లోనికి దిగింది.

శంకరదేవుడు మార్చు

శంకరదేవుడు అనే వైష్ణవభక్తుడు (1449-1569) ఇలాగానంచేయడంకోసం కొన్ని కావ్యాలను రచించి, రానురాను నాటకాల రచనకు పోనుకున్నాడు.ఈతడు ప్రస్తుత నౌగాంగ్ పట్టణానికి 16మైళ్ళదూరంలో ఉన్న అలిపుఖారి అనేగ్రామంలో ఒక భూయాక్ వంశంలో పుట్టాడు.భూయాక్ కులం ఆరోజుల్లో చాల శ్రేష్ఠమైనదేగాక, ఆకులంలో చాలామంది భాగ్యవంతులు కూడా.వారిలో శంకరదేవుడు వంశంచాలా ప్రముఖమైనది.అందువల్ల వారిని శిరోమణిభూయాన్లు అనేవారు.శంకరదేవుడు చిన్నవాడు బాగా చదువుకున్నాడు.పెద్దవాడైన తరువాత సంస్కృతంలో స్వతంత్రంగా వ్రాయడమేగాక, అనేక సంస్కృతకావ్యాలను అస్సాం భాషలోనికి అనువదించాడు.భక్తిరత్నాకరముఅనే వైష్ణవతత్వ గ్రంథాన్ని కూడా రచించాడు.చదువు 22వఏటనే ముగిసింది.సూర్యావతి అనే కాయస్థ బాలికను పెళ్ళిచేసుకున్నాడు.సూర్యావతి అనే కాయస్థ బాలికను పెళ్ళిచేసుకున్నాడు.ఆమె ఒకపిల్లని కని నాలుగేళ్ళతరువాత మరణించింది.కూతురుపెళ్ళి చేసి 1541లో దేశం తిరగడానికి ఉపక్రమించాడు.17మంది శిష్యులేగాక ఆయనగురువు మహేంద్రకందళి కూడా ఆయనతో యాత్రకు బయలుదేరారు.హయ, పూరి, భువనేశ్వర్, బృందావనం, మధుర, ద్వారక, కాశీ, ప్రయాగ, అయోధ్య, బదిరికాశ్రమం, మొ.క్షేత్రాలన్నీ తిరిగి అక్కడ మతప్రచారం ఎలా చేస్తున్నారో చూసి తెలుసుకొని 12ఏళ్ళ తరువాత అస్సాం తిరిగివచ్చాడు.అప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకొన్నాడు! బార్దోవా అనేగ్రామంలో నివాసం ఏర్పరుచుకొని, అక్కడ ఒక సత్రం కట్టించాడు.అందరికీ భజనలు, సంకీర్తనలు చేసుకొనుటకు నాంఘర్ (భజన మందిరం) నిర్మించాడు.ఈకాలక్షేపాలను నామకీర్తన్ అనేవారు.కొన్నాళ్ళకు శంకరదేవుడుమరొక గ్రామం వెళ్ళిపోవలసి వచ్చింది.అక్కడ మాధవదేవ అనే శాక్తేయుడు శంకరదేవుడుకి శిష్యుడైనాడు.తరువాత తరువాత ఈ మాధవదేవుడు కూడా నాటకాలు రచించెడివాడు.శంకరదేవుడుకి శాక్తేయులతో, బ్రాహ్మణులతో వైరం వచ్చింది.కాని శంకరదేవుడుతో వారు వాదించి ఓడినారు.మళ్ళీ తన 97వ ఏట వందమంది శిష్యులతో తీర్ధయాత్రలు సాగించాడు.పూరీలో చైతన్యదేవుని కలుసుకున్నాడు.తిరిగి వచ్చి మళ్ళా వైష్ణవ ప్రచారం ఇనుమడించాడు.కూచి బేహార్ లో మరణించాడు.శంకరదేవుడు 6 నాటకాలతో సహా మొత్తం 30 గ్రంథాలు రచించాడు. భాగవత పురాణం లోని కధలను నాటకాలుగా కూర్చి ప్రదర్శనలు ఇచ్చేవాడు.

శంకరదేవుడు కాలంలో అస్సాంలో కొన్ని రకాల రూపకాలను తరుచు ప్రదర్సిస్తూ ఉండేవారు- ఓజపాళి (బుర్రకధ లాంటిది.ఓజ-ముఖ్యగాయకుడు, పాళి- అటుఇటు తిరుగుతు పాడేవాడు.ఇందులో కొంచెం నాట్యం కూడా వుంటుంది. ఇవన్నీ చూసి శంకరదేవుడు నాటకాలు వ్రాశాడు. నాటకాన్ని యాత్ర, వృత్త, అంక, భావన అని కూడా పిలిచేవారు. మాధవదేవుడు వ్రాసిన నాటకాన్ని ఝుమురా అనేవారు. మొత్తం మీద అంకియ నాట్ అనేది నలుగురూ వాడేపదం అయింది.అంటే ఒకవిధంగా వైష్ణవ ఏకాంకిక నాటకాలు అని అర్ధం చేసుకోవచ్చును.

శంకరదేవుడు కాళీయమదన్, కేళీగోపాల లేక రాసక్రీడ, పత్నీప్రసాద్, పారిజాత్ హరణ్, రామవిజయ, రుక్మిణీ హరణ్ అనే 6 నాటకాలు వ్రాసాడు.

అంకియ నాట్ మార్చు

అంకియ నాట్ లో సంస్కృత నాటకాల్లో లాగానే నాంది ప్రస్తావన లుంటాయి.అయితే సూత్రధారుడు మాత్రం చివరిదాకా ఒక నటుడే. సూత్రధారుడే నాటక దర్శకుడు, వ్యాఖ్యాత కలిసి నాట్యం చేస్తాడు-ప్రవేశాలను నిష్క్రమణలను ప్రకటిస్తాడు- ఇవి విద్యావంతులను అవిద్యావంతులను రంజింపజేసేవి. వైష్ణవ వికాశం కలుగజేసేవి.సూత్రధారులకి గురువులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

అంకియ నాట్ ఒక రకంగా గేయనాటకం కూడాను, వర్ణనలన్నీ శ్లోకాలు, గేయాలు.సూత్రధారుడే పాడుతాడు.ఏపాత్ర మనస్సులో ఏఆలోచన పాకులాడుతున్నదో కూడా సూత్రధారుడు గానరూపంలో తెలియజేస్తాడు.మధ్య మధ్య బార్ గీత్ అనే పేరుగల భక్తికీర్తనలను పాడుతాడు.

నాందీశ్లోకాలలో ప్రార్థనేకాక, కధాసారం సూత్రధారుడు వివరిస్తాడు.తరువాత గోపాలదేవుడు తన నాటకాలలో శ్లోకాలకు మారుగా నాందిలో అస్సామీస్ గీతాలనే ప్రవేశపెట్టాడు.నాంది తరువాత భాతిమా అనే పెద్దగీతాన్ని గానం చేస్తారు- నాందిలో వచ్చే మరొకపాత్ర సంగి సూత్రధారుడు తానేదో దివ్యవాణిని వింటునట్లు నటించి, సంగితో నాందితర్వాత కధాప్రాముఖ్యాన్ని చర్చిస్తాడు.నటుల మచ్చట్లు చెప్తాడు. వీరుకాకా నాటకంలో దూత అనేఒక పాత్ర, బహువా అనే ఇంకొకపాత్ర (రంగంమీదకు నటులు ఆలస్యమైనప్పుడు) కొంత హాస్యంకలుగజేస్తారు, నటుల కధలు జెప్పి రంజింపజేస్తారు.

చివరకు సూత్రధారుడు ముందుగా ప్రార్థనాగానం చేసినట్లే, ముక్తిమంగళ భాతిమా (గీతం) పాడుతాడు, ఏవైనా తప్పులు తటస్థిస్తే క్షమించాలని దేవుని వేడుకుంటూ.ఆగీతంలోనే ఆకధ నీతి కూడాచెబుతాడు.మంగళగీతాన్ని చివరికి ప్రేక్షకులు కూడా పాడుతారు.

ఈనాటకాలను శంకరదేవుడు నిర్మించిన నాంఘర్ లో వేసేవారు.ఒక్కొక్కప్పుడు నాటక ప్రదర్శన కొరకు పాకలు, పందిళ్ళుకూడా వేసేవారు.మాధవదేవుడు బార్పేటలో ఒక నాటకశాలను నిర్మించాడు.ఈనాటకశాలను బారుఘరా అనీ రంగీయాల్ ఘరా అని పిలిచేవారు. వీటిని నాట్యశాస్త్రంలో చెప్పినట్లు వికృస్త పద్ధతిలో కట్టేవారు.50 అడుగుల పొడవు ఉంటుంది. 2 అంతస్తులుగా నిర్మిస్తారు.ఒక చివరన, మణికూట్ అనేచిన్న గృహం కట్టి దానిలో సింహాసనం పై పవిత్రగ్రంధాలను ఉంచేవారు. అదేకాక ప్రేక్షకులు కిందనే కూర్చోవాలి.ఆతరువాత రంగభూమి. ఇది ఎత్తైనది వేదిక లాంటిది కాదు.కాకపోతే రంగభూమికి ఇటు అటు నటులు, గంగుదార్లూ వాద్యగాళ్ళూ కూర్చునేవారు.రంగభూమికి ముందు భాగంలో తెల్లటితెర ఉంటుంది.నటులు వేషాలు వేసుకొనే చోఘరా వెనుకవైపు ఉంటుంది.

నటులకు భారియా అని అస్సాంలో పేరు.నటన వృత్తికలవారు ఆరోజుల్లో లేరు.ఆసక్తి భక్తి ఉన్న యువకులు గురువుమాట ప్రకారం ఈవేషాలు వేసేవారు.స్త్రీలు వేషాలు వేసేవారు కారు.అందరూ చదువుకున్నవారూ-గురువు ఆజ్ఞను పాలించి, చక్కగా శిక్షణ పొంది నటించేవారు.వారు ఎవ్వరూ నిషిద్ధులుకారు.నాటకానికి ఊరిలో ప్రముఖుడు అధ్యక్షత వహించడం పరిపాటి.ఆయనకు అప్పుడు అందరూ విధేయులే.ఆయనను అధికారి, సభాపతి అనేవారు.

నటులకు, నాటకానికి కావలిసిన సరంజామాను తయారుచేసే వృత్తి కొందరికి ఏర్పడింది.వాళ్ళు ఖానికార్ లు.బొమ్మలువేయడం కావలసిన కలపవస్తువులు, విగ్రహాలు, ముసుగులు, రకరకాల దుస్తులు, యుద్ధపరికరాలు, అలంకరణ, కూర్పు ఖానికార్లు చేసేవారు.

సూత్రధారులు మోకాళ్ళ కిందదాకావచ్చే జరీ జిలుగు ఉన్న అంగరఖా (ఝూరీ) ధరిస్తాడు, చేతులులేని ఒక కూర్పాసం (వేస్ట్ కట్) ఒక రంగురంగుల కమ్మరి బంద్, ఒక తట్టతలపాగా కుడా ధరిస్తాడు.గాయకలు చక్కని అంచుగల ధోవతులు ధరిస్తారు. స్త్రీల పాత్రల అలంకరణలో ముఖ్యం మేఖల లేక ఒక వడ్డాణంలాంటిది.

ఆరోజుల్లో మైధిలి భాష బాగా పుష్టిచెంది ఉంది.విద్యాపతి అనే పండితుడు అనేక వైష్ణవగీతాలు ఇందులో రచించాడు.పలు అస్సామీలు కూడా మైధిలీ భాషని నేర్చుకొని రచనలు చేసేవారు. మైధిలితో కలిపి వ్రాయడం ఒక సంప్రదాయం, ఒక నాజూకు అయినది.ఈ మిశ్రమభాషను బ్రజబూలి అనేవారు. అస్సాం. బెంగాల్ లో దీనిని విస్త్రృతంగా వాడేవారు. శంకరదేవుడు, మాధవదేవుడు కూడా వాడేరు.

మూలం మార్చు

  • 1957 భారతి పత్రిక.