అద్దంకి గంగాధర కవి

(అద్దంకి గంగాధరుడు నుండి దారిమార్పు చెందింది)

అద్దంకి గంగాధర కవి (సా.శ.1550 - 1580) గోల్కొండ రాజ్యానికి (నేటి తెలంగాణ ప్రాంతం) చెందిన తెలుగు కవి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. భారతంలోని తపతీ సంవరణుల కథను స్వీకరించి తపతీ సంవరణోపాఖ్యానం అనే ప్రబంధం రచించి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ప్రబంధ శైలిలో అష్టాదశ వర్ణనలతో రాసిన ఇతని కావ్యంపై వసుచరిత్ర ప్రభావం ఉందని సాహిత్య చరిత్ర కారిణి ముదిగంటి సుజాతారెడ్డి పేర్కొంది.

జీవిత విశేషాలు

మార్చు

మల్కిభరాముడు అన్న పేరుతో తెలుగు కవులు కీర్తించిన గోల్కొండ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో గంగాధరుడు కవి. గంగాధరుడు మహాభారతంలోని ఆదిపర్వంలో వచ్చే తపతీ సంవరణుల కథను ఇతివృత్తంగా తీసుకుని, విస్తరించి తపతీ సంవరణోపాఖ్యానం పేరిట రాశాడు. దాన్ని ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. నిజానికి భారతంలోని తపతీ సంవరణుల కథ చాలా చిన్నది. అలాంటి చిన్న కథను తీసుకుని విస్తరించి శృంగారభరితమైన ప్రబంధంగా రాశాడు. ధారాళమైన శైలి, రమ్యమైన కల్పనలు, చక్కని శబ్దాలంకారాలు వాడి రాశాడని ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొంది. తపతీ సంవరణోపాఖ్యానంలో గంగాధరుడు ప్రబంధ లక్షణాలుగా పేర్కొనే అష్టాదశ వర్ణనలు చేశాడు.[1]

ఇతని శైలి రామరాజభూషణుడి వసు చరిత్ర శైలిలో ఉంటుందని, చాలాచోట్ల వసుచరిత్రను గంగాధరుడు అనుకరించాడని ముదిగంటి సుజాతారెడ్డి భావించింది. వసుచరిత్ర కన్నా ఇది రెండేళ్ళ ముందే రాశారని కొందరు సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. అయితే, వసుచరిత్ర రచించిన కాలం, దాన్ని అంకితమిచ్చిన కాలం ఒకటి కాదనీ, కాబట్టి అది ఇబ్రహీం కులీ కుతుబ్ షా విజయనగరంలో అళియ రామ రాయల దగ్గర ఉన్నప్పుడే రామరాజభూషణుడు రాశాడనీ కాబట్టి వసుచరిత్ర దీనకన్నా పూర్వగ్రంథమని సుజాతారెడ్డి పేర్కొంది. ఇబ్రహీం కుతుబ్ షాతో పాటుగా గంగాధరుడు విజయనగరంలో నివసించి ఉంటాడనీ, ఆ సమయంలో వసు చరిత్ర చదివి ఆకళింపు చేసుకుని ఆ పద్ధతిలో తన కావ్యాన్ని రాశాడనీ ఆమె అభిప్రాయం.[1]

కసిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ పద్యకావ్యాల అధ్యయనం గురించి రాస్తూ - తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఐదు పద్యకావ్యాలను పంచ పద్యకావ్యాలుగా పరిగణించవచ్చన్న ప్రతిపాదన చేస్తూ వాటిలో అద్దంకి గంగాధరుని తపతీ సంవరణోపాఖ్యాన్ని కూడా ఒకటిగా స్వీకరించి పరిశీలించవచ్చని ప్రతిపాదించాడు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ముదిగంటి, సుజాతా రెడ్డి (2015). తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర. హైదరాబాద్: తెలంగాణ సాహిత్య పరిషత్తు. p. 94.
  2. కసిరెడ్డి, వెంకటరెడ్డి (2013). "తెలంగాణలో తెలుగు పద్యకవితా వికాసం". In సి., నారాయణరెడ్డి; జె, చెన్నయ్య (eds.). తెలంగాణలో సాహిత్య వికాసం. హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్తు. p. 14.