అధర్వణుడు

(అధర్వణాచార్యుడు నుండి దారిమార్పు చెందింది)

అధర్వణుడు తొలి తరం తెలుగు కవి. ఇతడు నన్నయ యుగానికి లేదా తరువాతి యుగానికి (శివకవి యుగానికి) చెందినవాడు కావచ్చును.

అధర్వణుడు భారతమును ఆంధ్రీకరించెనని ఒక ప్రతీతి ఉంది. కాని అది ఇప్పుడు లభించడంలేదు. అధర్వుని భారతాన్ని అసూయతో నన్నయ తగులబెట్టించాడని ఒక పుక్కిటి పురాణ కథ ఉన్నది గాని "ఈ పాపపు కథ కల్పించిన వానికి వచ్చిన పుణ్యమెట్టిదో అతనికే యెరుక" అని పింగళి లక్ష్మీకాంతం వ్యాఖ్యానించాడు.[1]

సర్వ లక్షణ సార సంగ్రహము, కవి చింతామణి, అప్ప కవీయము వంటి లక్షణ గ్రంథాల రచయితలు అధర్వణుని భారతం నుండి కొన్ని పద్యాలు ఉదహరించారు. ఆ పద్యాలను పరిశీలించిన వీరేశలింగం పంతులు అవి విరాటోద్యోగ భీష్మ పర్వాలకు చెందినవని తేల్చాడు. ఇతని రచన మిక్కిలి ప్రౌఢంగా ఉంది. తిక్కన లాగానే అధర్వణుడు కూడా నన్నయ శేష భారతాన్ని తెలిగించి ఉండవచ్చును కాని అది సంపూర్ణముగా నుండి విస్మరింపబడిందని విమర్శకుల ఊహ. "మ"గణం, "ర"గణం వినియోగం విధానాన్ని గురించి ఒక లక్షణ గ్రంధంలో ఉదాహరింపబడిన పద్యం ప్రకారం ఇతడు నన్నెచోడుని తరువాతివాడు కావచ్చును.[1]

ఇతని రచనలుగా పేర్కొనబడిన లక్షణ గ్రంథాలు -
  • "అధర్వణ కారికావళి" అనే తెలుగు వ్యాకరణం సంస్కృత శ్లోక రూపంగా రచించాడు.
  • త్రిలింగ శబ్దానుశాసనము అనే చిన్న వ్యాకరణం కూడా రచించాడు
  • వికృతి వివేకము

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర

వనరులు

మార్చు