అన్ననాళంలో అతుకు మచ్చలు

అన్నవాహిక (అన్ననాళం) లోనికి జీర్ణాశయం నుండి ఆమ్లం తిరోగమించి తాపం కలిగించడం వైద్యులు తరచు చూస్తారు. అంతర్దర్శినితో పరీక్షించినపుడు ఈ తాప లక్షణాలు సాధారణంగా అన్ననాళం క్రింద భాగంలో కనిపిస్తాయి. వీటికి విరుద్ధంగా కొందఱిలో అన్ననాళం తొలిభాగంలో మచ్చలు అతికించినట్లు కనిపిస్తాయి. ఈ మచ్చలు అన్నవాహిక కణజాలానికి బదులు జీర్ణాశయ కణజాలం కలిగి ఉంటాయి. చాల అరుదుగా వీటి వలన లక్షణాలు కాని ఉపద్రవాలు కాని కలుగుతాయి.

అన్ననాళం తొలిభాగంలో అతుకుమచ్చ

అన్ననాళం తొలిభాగంలో మచ్చలు

మార్చు

సుమారు 1 నుంచి 12 శాతం ప్రజలలో అన్ననాళం తొలిభాగపు శ్లేష్మపుపొరలో ఈ మచ్చలు ‘ఎఱ్ఱని ముకమలు’ వలె సమతలంగా, అతుకులు చేర్చినట్లు (ఇన్ లెట్ పాచెస్) ఉంటాయి[1]. వీటి వలన చాలా మందిలో ఏ లక్షణాలు కాని, ఇబ్బందులు కాని ఉండవు. ఇతర కారణాల వలన అంతర్దర్శిని పరీక్ష (ఎండోస్కొపీ) చేసినపుడు ఈ మచ్చలు కనిపిస్తాయి. వీటితో పాటు కొందఱిలో అన్ననాళంలో పలుచని పొరలు కవాటాలులా ఉండవచ్చు.

కారణాలు

మార్చు

గర్భంలో పిండం వృద్ధి చెందుచున్నప్పుడు కంఠభాగంలో ఉండే జీర్ణాశయపు శ్లేష్మపుపొరలో కొన్ని భాగాలు  అన్ననాళంలో అవశేషాలుగా మిగిలిపోయి పరస్థానం చెందడం వలన ఈ మచ్చలు పుట్టుకతో ఉండవచ్చు[2]. కొందఱిలో జీర్ణాశయంలోని ఆమ్లము తిరోగమనం చెందడం వలన అన్ననాళపు శ్లేష్మపు పొర కణజాలం జీర్ణాశయపు కణజాలంగా మార్పు చెందడం చేత ఈ మచ్చలు కలుగవచ్చు.

లక్షణాలు

మార్చు

పెద్దశాతం మందిలో ఈ మచ్చల వలన ఏ లక్షణాలు ఉండవు[2]. ఏ ఇబ్బంది ఉండదు. ఏ ఉపద్రవాలు కలుగవు. చాలా అరుదుగా కొందఱిలో గొంతుకలో అడ్డున్నట్లు, నిండుతనం, అసౌకర్యం కలుగవచ్చు. కొందఱిలో మింగుటలో ఇబ్బంది కలుగవచ్చు. దగ్గు రావచ్చు. చాలా అరుదుగా ఈ మచ్చలలో కర్కట వ్రణాలు (కేన్సర్లు) కలిగే అవకాశం ఉంది[3].

నిర్ణయం

మార్చు

ఇతర లక్షణాలకు అంతర్దర్శిని (ఎండోస్కొపీ) పరీక్ష చేసినపుడు అన్ననాళం తొలిభాగంలో సమతలంగా ఎఱ్ఱని ముకములు మచ్చ కనిపిస్తుంది. అనుభవజ్ఞులైన వైద్యులు ఈ మచ్చలను చూచి పోల్చుకోగలరు. ఈ మచ్చల నుంచి చిన్న ముక్కలు సేకరించి కణపరీక్షకు పంపవచ్చు. కణపరీక్షలో పొలుసుల అన్ననాళ కణాలకు బదులు స్తంభాకారపు జీర్ణాశయ కణాలు కనిపిస్తాయి. జఠర మూలంలో వలె వీటిలో శ్లేష్మం స్రవించు గ్రంథులుండవచ్చు, లేక జీర్ణాశయపు మధ్యభాగంలో వలె ఆమ్లం స్రవించే గ్రంథులుండవచ్చు[1]. వీరిచే బేరియం మ్రింగించి ఎక్స్- రే చిత్రం తీసినపుడు అన్ననాళంలో నొక్కులు కనిపించవచ్చు[4].

చికిత్స

మార్చు

పెక్కుశాతం మందిలో ఈ మచ్చలకు చికిత్స అనవసరం[2].ఈ మచ్చలలో ఆమ్లము స్రవించే గ్రంథులుండి గుండెమంట, మింగుటలో ఇబ్బంది, దగ్గు ఉంటే ఒమిప్రజాల్ వంటి ప్రోటాన్ యంత్ర అవరోధకాలు వాడవచ్చు. అన్ననాళంలో సంకోచాలు ఉన్నా, పొరల కవాటాలు ఉన్నా వ్యాకోచ చికిత్సలు చెయ్యాలి[4]. శ్లేష్మగ్రంథులు ఉండి గొంతుకలో అడ్డుపడినట్లు, నిండుతనం, అసౌకర్యం ఉన్నవారిలో విద్యుద్దహన చికిత్సతో కాని, ఆర్గాన్ వాయువుతో నిర్మూలన చికిత్సతో కాని, రేడియో తరంగాలతో కాని ఈ మచ్చలను తొలగించవచ్చు[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 https://www.giejournal.org/article/S0016-5107(16)30479-5/fulltext. {{cite journal}}: Cite journal requires |journal= (help); Missing or empty |title= (help)
  2. 2.0 2.1 2.2 2.3 https://www.uclahealth.org/medical-services/gastro/esophageal-health/diseases-we-treat/inlet-patch. {{cite web}}: Missing or empty |title= (help)
  3. Dziadkowiec + 5, Karolina+5 (July 19, 2020). "Adenocarcinoma Arising From a Cervical Esophageal Inlet Patch: The Malignant Potential of a Small Lesion". Cureus (ISSN #2168-8184). {{cite journal}}: |issue= has extra text (help)CS1 maint: numeric names: authors list (link)
  4. 4.0 4.1 Behrens, C.; Yen, Peggy P. W. (2011). "Esophageal inlet patch". Radiology Research and Practice. 2011: 460890. doi:10.1155/2011/460890. ISSN 2090-195X. PMC 3197178. PMID 22091379.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)