అన్నవరం ప్రసాదం

అన్నవరం ప్రసాదం అన్నది అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి నివేదన చేసి దేవస్థానంలో అమ్మే గోధుమనూకతో తయారుచేసే తియ్యని ఆహార పదార్థం. ఈ అన్నవరం ప్రసాదం రుచి భక్తులను, ఆహార ప్రియులను ఎంతగానో ఆకట్టుకుని పేరు గడించింది. ఈ ప్రసాదం స్వామివారికి ఎప్పటి నుంచి నివేదిస్తున్నారు అన్నదానిపై ఖచ్చితమైన వివరాలు లేవు. ఉత్తరాది కూలీల ఆహార సంస్కృతి నుంచి ఇది అలవడి ఉంటుందని కొందరు పేర్కొంటుండగా, ఇది తరతరాలుగా వస్తున్నదని దేవాలయ అధికారులు, అర్చకులు పేర్కొంటున్నారు. ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకుల పొడి మాత్రమే దీని తయారీలో వినియోగిస్తారు. సాధారణ రోజుల్లో 100 కళాయిల్లోనూ, రద్దీ ఎక్కువ ఉండే ప్రత్యేక దినాల్లో 250 కళాయిల్లోనూ దీన్ని తయారుచేస్తారు. కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. మొత్తం ఏడాదిలో దాదాపు కోటీ 50 లక్షల ప్యాకెట్ల ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వ్రతం చేసుకున్న జంటలకు ఉచితంగా పంపిణీ, కొనదలుచుకున్న భక్తులకు కొండ మీద, కింద, నేషనల్ హైవేలోనూ కౌంటర్ల ద్వారా దేవస్థానం అమ్ముతోంది. తిరుపతి లడ్డు లాంటి ప్రసాదాలతోనూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటి స్వీట్లతోనూ అన్నవరం ప్రసాదాన్ని పోల్చుతూ ఉంటారు.

అన్నవరం దేవస్థానం

చరిత్ర

మార్చు

గోధుమనూకతో తయారుచేసే అన్నవరం ప్రసాదం ఎప్పుడు ప్రారంభం అయింది అన్న విషయంపై దేవస్థానం అధికారుల వద్ద కూడా ఖచ్చితమైన వివరాలు లేవు. గోధుమలతోనే ఈ ప్రసాదం తయారుచేయడం వెనుక ఉత్తరాది వారి ప్రభావం ఉంది అని అన్నవరం ప్రాంతంలో ప్రచారం ఉంది. 19వ శతాబ్దిలో కలకత్తా (నేటి కోల్‌కాతా) నుంచి మద్రాసు (నేటి చెన్నై) వరకూ వేసిన రైల్వేలైను అన్నవరం మీదుగా వెళ్ళిందనీ, ఆ రైలుకట్ట నిర్మించేందుకు వచ్చిన ఉత్తరాది వారి ఆహారంలోని గోధుమలు స్థానికుల ఆహారంపై ప్రభావం పడివుంటుందనీ, ఆ ఉత్తరాది కూలీలు చేసుకునే గోధుమల వంటకాన్ని చూసి నేర్చుకుని దాన్ని స్థానికులు స్వామివారికి నివేదించడం వల్ల ఈ ప్రసాదం ప్రారంభమై ఉంటుందని ఈ కథనం చెప్తోంది.[1] ఈ వాదనను దేవస్థాన అర్చకులు తిరస్కరిస్తున్నారు. స్కంధ పురాణాంతర్గతంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఉందనీ, స్వామి వారికి అరటిపళ్ళు, పాలు, నెయ్యి, గోధుమలు ఇష్టమనీ చెప్తున్నారు. తరతరాలుగా ఇదే ప్రసాదంగా ఉందని దేవస్థాన అధికారులు పేర్కొంటున్నారు.[2]

తయారీ

మార్చు

అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకులపొడితో తయారుచేస్తారు.[3] ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.[4][5] దూరప్రాంతాలకు తీసుకువెళ్ళేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగానూ (గట్టి ప్రసాదం) తయారుచేస్తూంటారు.[6] అయితే, భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు.[2]

ప్రసాదాన్ని తయారుచేసే భవనానికి భూతాది అని పేరు.[1] వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పాడు.[2] ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 150 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.[2]

2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. మూడు వేర్వేరు గొట్టాల ద్వారా వేడి నీరు, గోధుమ నూక, రెండు విడతలుగా పంచదార కళాయిలో పడేలా ఈ యంత్రంలో ఏర్పాటుచేస్తుంది. ఉడికిన తర్వాత నెయ్యి కలిపి, యాలకుల పొడి చల్లడం వంటవారు చేయాల్సి ఉంటుంది. కళాయికి రెండువైపులా ఉన్న చక్రాలను తిప్పితే పూర్తైన ప్రసాదం ప్యాకింగ్ కోసం తీసుకువెళ్ళేందుకు మరో తొట్టిలో పడుంతుంది. 45 నిమిషాల్లో కళాయి ప్రసాదాన్ని వండేందుకు ఈ కొత్త ప్రక్రియ వీలు కల్పిస్తోంది.[7][3]

పంపిణీ

మార్చు

అన్నవరం ప్రసాదాన్ని దేవస్థానం వారు 2021 నాటికి ఏటా కోటీ 50 లక్షల పైచిలుకు ప్యాకెట్లు అమ్ముతున్నారు.[2] దేవస్థానంలో అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతం చేసుకునే జంటలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాకా ప్రసాదాన్ని తినకపోతే వ్రత ఫలితం దక్కకపోగా అనర్థం జరుగుతుందన్న విశ్వాసం కూడా ఉంది. భక్తులు కొనుక్కోదలిస్తే దేవస్థానంలోని కౌంటర్లలో 100 గ్రాములు 20 రూపాయల చొప్పున అమ్ముతారు.[7] వీటితో పాటుగా ఈ ప్రసాదానికి డిమాండ్ బాగా పెరగడంతో కొండ కింద కూడా వివిధ ప్రదేశాల్లో దేవస్థానమే కౌంటర్లు నడుపుతోంది. మెట్ల మార్గాన్ని ఆనుకుని కొండ కింద ఉన్న కౌంటర్లో సుదీర్ఘ కాలంగా అమ్మకాలు సాగుతున్నాయి. దానితో పాటుగా నేషనల్ హైవే 16 మీద అన్నవరం మీదుగా వెళ్ళేవాళ్ళకు కూడా కొనుక్కుని వెళ్ళగలిగేలా ఒక కౌంటర్ ఏర్పాటుచేసి అమ్ముతున్నారు.[2]

ప్రాచుర్యం, విశ్వాసాలు

మార్చు

ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. పవిత్రత, భక్తి వంటివాటితో పాటుగా ప్రత్యేకించి దీని రుచికి కూడా ఎంతో పేరుపొందింది.[2][8] భక్తులు అన్నవరం నుంచి తిరిగివెళ్ళేప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువమొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు.[4] తాము వెళ్ళకపోయినా వెళ్ళేవాళ్ళతో ప్రత్యేకంగా తెప్పించుకోవడం కూడా పరిపాటి.[7] కేవలం దేవుని ప్రసాదంగానే కాక ఒక స్వీటుగా కూడా దీనికి ప్రత్యేకమైన పేరుంది. కాకినాడ గొట్టంకాజా, ఆత్రేయపురం పూతరేకులు వంటి ఇతర స్వీట్లతో కలిపి ఈ ప్రసాదాన్ని గురించి గొప్పగా చెప్తారు ఆహార ప్రియులు.[9] రుచికి పేరుపడ్డ ప్రసాదాల విషయంలో అన్నవరం ప్రసాదాన్ని తిరుపతి లడ్డులో పోలుస్తారు.[7] ఇవే దినుసులతో, ఇదే పద్ధతిలో మరెక్కడైనా వండినా ఈ రుచి రాదని, ఈ క్షేత్రమహాత్మ్యం వల్లనే ఈ రుచి వస్తోందనీ భక్తులతో పాటుగా ఈ ప్రసాదం వండే వంటవారు కూడా విశ్వసిస్తారు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "అన్నవరం ప్రసాదం కథ ఏమిటి? అంత రుచి ఎలా వస్తుంది? - వీడియో". BBC News తెలుగు. 2021-12-31. Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 వడిశెట్టి, శంకర్ (2022-01-01). "అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?". BBC News తెలుగు. Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 "సత్యదేవుడి ప్రసాదం ముప్పావుగంటలో సిద్ధం". Sakshi. 2021-08-04. Retrieved 2022-01-01.
  4. 4.0 4.1 telugu, 10tv (2021-08-10). "Annavaram : వరాల దేవుడు... అన్నవరం సత్యదేవుడు |God of weeks ... Annavaram is the God of truth". 10TV (in telugu). Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. "తీర్థయాత్ర పర్యాటక రంగం | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2022-01-01.
  6. రాజా చంద్ర. "తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల వివరాలు". హిందూ టెంపుల్స్ గైడ్. Retrieved 2022-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. 7.0 7.1 7.2 7.3 "Annavaram Temple: అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్... 45 నిముషాల్లోనే సత్యదేవుని ప్రసాదం." News18 Telugu. Retrieved 2022-01-01.
  8. "దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకు అంత మధురం?". Telugu News International - TNILIVE (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-07-23. Retrieved 2022-01-01.
  9. Nallam, Pavan Satish (2020-10-21). "The East Godavari Sweets You Should Never Miss". Paper and Poster (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-01. Retrieved 2022-01-01.