అన్వేషణ (నవల)
అన్వేషణ నవలా రచయిత ప్రసిద్ధ కథానికా రచయిత శిరంశెట్టి కాంతారావు. అన్వేషణ నవల 1990లలో తెలంగాణలో ఒక గ్రామంలో గాజుల వ్యాపారంలో నైపుణ్యం కలిగిన మోనయ్య తన గ్రామంలో గాజుల వ్యాపారం నిర్వహించడం సాగక, హైదరాబాదు వెళ్లి, పాతబస్తీలోని చూడీ బజారులో గాజుల దుకాణంలో పని ప్రారంభిస్తాడు. హస్తకళల వృత్తి కార్మికులు సొంత ఊళ్ళు వదిలి పట్టణాలకు వలసలు వెళ్లడాన్ని ఎంతో వాస్తవికంగా ఈ నవలలో రచయిత చిత్రీకరించారు. ఈ నవలలో గాజుల తయారీ, అమ్మకం గురించిన వివరాలున్నాయి. హృదయాన్ని హత్తుకునే మానవ సంబంధాలు, పేదల జీవితాలలోని కష్టాలు, చిన్న చిన్న ఆనందాలను ఈ నవల సహజంగా వర్ణిస్తుంది. గాజుల తయారీ కర్మాగారాలు, కార్మికుల జీవితాల గురించిన వివరాలు, గాజుల తయారీలో కీలకమైన లక్కను సేకరించే ప్రక్రియను కూడా ఈ నవల వివరిస్తుంది. గాజుల తయారీ పరిశ్రమ గురించి ఇది ఉపయోగకరమైన భోగట్టా అందిస్తుంది. ఒక్కో కులం మతం తెగల మహిళలకు సంప్రదాయం, కట్టుబాట్లు వేరువేరుగా ఉన్నా, గాజులు మాత్రం అందరికి ముఖ్యమే. గాజులగురించి, గాజుల వ్యాపారం మీద ఆధారపడ్డ జీవనాలగురించే ఈ నవల. సూర్యాపేట ఫణిగిరిలో సామాన్య వ్యక్తి, గాజులమ్మే మోనయ్య, అతని కుటుంబగాథే ఇది. మోనయ్య గాజులమ్మి లాభపడ్డప్పుడు ఆ పైసలేవో తమకొచ్చినట్టు సంతోషిస్తారు పాఠకులు, మోనయ్య కుటుంబం ఊరు విడిచి వెళ్ళేదృశ్యం కన్నీళ్లు పెట్టిస్తుంది. ఫణిగిరి నుండి హైదరాబాద్ చార్మినార్ "లాడ్ బజార్లో" పనికి వచ్చిన మోనయ్య కుటుంబ సుఖదుఖాలు రచయిత ఆసక్తి కరంగా చిత్రించారు. గాజుల గురించి, వాటి తయారీ, వాటిలో రకాలు, ఏ రకాలు ఎక్కడనుండి వస్తాయి వంటి అంశాలు కథలో సందర్భానుసారంగా చెప్పారు.హైదరాబాద్ లాడ్ బజార్ గాజుల వ్యాపారంమీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ జీవనపోరాటం గురించి రాశారు. కష్టేఫలే నానుడికి నిదర్శనంగా నిలిచింది ఈ నవల. పండుగలు, శుభకార్యాలకు చిట్టి చిట్టి చేతుల బాలికలనుండి ముడతలు తేలిన చేతుల దాకా ముందుగా ఇష్టంగా వేసుకునే గాజుల కథలు, గాజులు కొనుక్కోమని అన్నలు, తమ్ములు డబ్బులిస్తే ఆనందం, తిరునాళ్లలో ఇష్టపడ్డ అబ్బాయిచేత గాజులు కొనిపించుకుని మురిసిపోయే మైమరపు వరకు అన్ని సందర్భాలలో మహిళల గాజుల గాథలను, వాటిని అందించే జీవితాలను తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి.
మూలాలు: శిరంశెట్టి కాంతారావు నవల అన్వేషణ, అన్వీక్షికి ప్రచురణ, హయిదరాబాదు. Venkat Sid is with Akhila Author గార్లు ముఖపుస్తకంలో రాసిన పరిచయం. (కృతగ్జతలతో)