అప్పగింతల పాటలు

అప్పగింతల పాటలు [1] స్త్రీల పాటల్లో ప్రముఖమైనవి. పూర్వం స్త్రీలు తమ కుమార్తెలను తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు నీతి, మంచి బుద్ధులు పాటల రూపంలో చెప్పేవారు. అప్పగింతలపాటల్లో స్త్రీ తన అత్తవారింట ఎలా మెలగాలి, మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, కాపురాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి వంటి విశేషాలు ఉంటాయి. వివాహం జరిగిన తర్వాత పెళ్ళికూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఆమె తరపు స్త్రీలు ఈ క్రింది పాటలు పాడేవారు.[2]

ప్రతీకాత్మక చిత్రం

పాట - 1

"అత్తగారింటికి అంపించవలె నిన్ను , అతిబుద్ధి గలిగుండు అంబరో నీవు

నీతి వాక్యములను నిర్మించి చెప్పెద, ఖ్యాతితో నుండుము నాతిరో నీవు

బిడ్డరో వినవమ్మ బిరుసు మాటలు నీవు అరయబల్కకు తల్లి అత్తవారింటిలో

ఓర్పు సిగ్గులు గల్గి ఒరుల ఇంటికిబోక, ఒప్పిదంబుగ నుండు ఓ బిడ్డ నీవు

తల్లిమారు అత్త తగ జూడవే బిడ్డ, జగడమాడకు తల్లి జవ్వనుల తోడ

తల్లిమారు మామ తనవలె వదినెలు, కనవలె ఈ రీతి కపటంబు లేక

మగువ కొడుకుల మారు మరదులను భావించి, కరుణగలిగుండవే కమలాక్షి నీవు

ఎవ్వరికీ ఎదురుగా బదులు మాట్లాడక, బెదరి ఉండుము తల్లి భేదంబు లేక

తత్తరంబది విడిచి అత్తగారీ మాట, చిత్తమున జేర్చుకో చిత్తారు బొమ్మ

తలకొంగు మరువకు తలెత్తి చూడకు, పడతులతో వాదు వలదు మాయమ్మ

పెద్దలు పిన్నలు వచ్చు మార్గము దెలిసి , గద్దె పై గూర్చున్న గ్రక్కున దిగవే

హరిపగిది నీ మొగుడు అరయ దేవుడంతడు, ధరణి యిద్దరు నీకు దైవసములమ్మ"

పాట - 2:

"సెలవిచ్చి మాయమ్మ సెలవిచ్చినాము, చెలగి మీ అత్తంట్ల బుద్ధిగలిగుండు[2]

ఎవ్వరేమాడిన ఎదురాడకమ్మా, వీధిలో నిలుచుండి కురులిప్పకమ్మా

పలుమారు పలుదెరచి నవ్వబోకమ్మా, పరమాత్మతో గూడి వెలుగు మాయమ్మా

వార్ని గాదని పూలు ముడువబోకమ్మా, పెద్దల గుర్తెరిగి నడువు మాయమ్మా

ఆకలి ఉంటేను అడుగబోకమ్మా, అత్తగారితో పోరు చేయబోకమ్మా

నాతోటి జేసినా మంకుపోరెల్ల, ఎరుగని అత్తింట్లో చేయబోకమ్మా"

పాట 3:

"అత్తా యింటికి బోయివత్తు మాయమ్మా, చిత్తమందున భీతి చెందాకు మాయమ్మా

పోయిరా మాయమ్మ భీతితో నుండే, మా యందరికి మంచి మాట తేవమ్మా

అత్తమామల మాటకడుగుదాటకుమా, చిత్తాము మెప్పించి చెలగుమోతల్లీ

బావలూ మరదలూ బంధు జనంబు, నీవారి యెడ మాట యేమిరా నీకు

పతిని దైవముగా భక్తితో నమ్మి, మతిమంతురాలవై మసులు మాయమ్మా"

పాట 4:

"పుట్టింటి సీతమ్మ అత్తంటికెళుతుంటె, బుద్ధులేమని చెప్పు భూదేవి తల్లి

పొద్దోయి పొరుగిళ్ళ కెళ్ళబోకమ్మ, సందలడి చాకింటి కెళ్ళబోకమ్మ

వీధిలో తల కురులు విప్పబోకమ్మ, పదుగురిలో పన్నెత్తి నవ్వబోకమ్మ

మందిలో కన్నెత్తి చూడబోకమ్మ, మరిది లక్ష్మన్నకు మడతలందియ్యి

మామ దశరధులకు మన్ననలు చెయ్యి, అత్త కౌశల్య పనులందముగ చెయ్యి"

పాట 5:

పోయిరావే తల్లి పోయిరావమ్మా, పోయి అత్తింటిలో బుద్ధి కలిగుండవమ్మా

అత్త మామల తోడ హర్షంబు కలిగి, అణకువతో నీవు సంచరించమ్మా

పతియే దైవము సుమ్మీ పడతులకెల్లా, పతి మాటలనెపుడు జవదాటకు మమ్మా

అంతరంగమునందు పతియన్న మాటలు, ఎంతైన హితుడు ఎరిగింపకమ్మా

అత్త యింటికి పొయి వత్తువా మాయమ్మా, చిత్తమందున భీతి చెందకు మాయమ్మా

అమ్మరో నిను పంపి ఎట్లుందు మామ్మా, కన్నీరు తుడుచుకో కనకంబు బొమ్మా[2]

నేటి స్థితి మార్చు

ప్రపంచీకరణ, పాశ్చాత్య పోకడలు, స్త్రీ విద్య - వారి ఉద్యోగాలు, ఆర్థిక స్వేచ్ఛ వలన అప్పగింతల పాటలు పాడే సంప్రదాయం పూర్తిగా అంతరించిపోయింది. అత్తవారింటికి పంపేముందు కుమార్తెలకు మంచి బుద్ధులు చెప్పే తల్లులే లేరు. ఫలితంగా అత్తాకోడళ్ళు మధ్య ఎన్నో గొడవలు చోటుచేసుకుంటున్నాయి, ఉమ్మడి కుటుంబాలు విచ్చినమైపోతున్నాయి.[2]

మూలాలు మార్చు

  1. పెద్దబాల శిక్ష - గాజుల సత్యనారాయణ , పేజీ 132, ప్రధమ భాగము, 72 వ ముద్రణ
  2. 2.0 2.1 2.2 2.3 న్యూస్, మై డిజిటల్ (2021-07-31). "అప్పగింతల పాటలు". మై డిజిటల్ న్యూస్. Retrieved 2021-07-31.