అయ్యలసోమయాజుల లలిత

అయ్యలసోమయాజుల లలిత (ఎ లలిత) (27 ఆగస్ట్ 1919 – 12 అక్టోబర్ 1979) భారతదేశపు మొదటి మహిళా ఇంజనీర్. [1]

అయ్యలసోమయాజుల లలిత
భారతదేశపు మొదటి మహిళా ఇంజనీర్.
అయ్యలసోమయాజుల లలిత, 1964 న్యూ యార్క్ సిటి.
జననం27 ఆగష్టు 1919
మరణం1979
జాతీయతభారతదేశం
వృత్తిఇంజినీర్

జీవిత విశేషాలు మార్చు

అయ్యలసోమయాజుల లలిత 1919 ఆగష్టు 27 న మద్రాసులో (నేటి చెన్నై) తెలుగు ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. [2] [3] ఆమెకన్నా పెద్దవారు నలుగురు, చిన్నవారు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. ఆనాటి సమాజ పద్ధతుల ప్రకారం ఇంకా స్కూల్లో చదువుకుంటుండగానే, 15 ఏళ్ల వయసుకే 1934 లో లలితకు పెళ్లి చేసారు. ఆ తర్వాత కూడా కొన్నాళ్లు పాఠశాల విద్య కొనసాగినా పదో తరగతి తర్వాత ఆమె చదువు ఆపేసింది.

1937లో ఆమె కుమార్తె శ్యామలకి జన్మనిచ్చింది. [4] శ్యామల పుట్టిన నాలుగు నెలలకే భర్త చనిపోయాడు. తండ్రి పప్పు సుబ్బారావు, సోదరుల ప్రోత్సాహంతో ముందుగా క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఆ తర్వాత కుటుంబసభ్యులు పనిచేస్తున్న కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (CEG) లో 1940లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చేరింది. తండ్రి సిఫార్సుతో ఆమెకు అక్కడ సీటు దొరకడం తేలికైంది.[4] [5] కాలేజీలో లలిత, ఇతర మహిళా ఇంజనీర్లు పి కె. థ్రెస్సియా, లీలమ్మ కోషీ (నీ జార్జ్) తో కలిసి చదువుకుంది. [5] అప్పటికి ఆరేడేళ్ల వయసులో ఉన్న శ్యామలను ఆమె బంధువుల దగ్గర ఉంచారు. కుటుంబ సహకారం ఉండడంతో లలిత తన ఇంజనీరింగ్ కోర్సు నిరాటంకంగా పూర్తి చేయగలిగింది.

కళాశాలలో లలితకు యాజమాన్యం, ఇతర విద్యార్థుల మద్దతు లభించిందని ఆమె కుమార్తె చెప్పింది. "ప్రజలు అనుకునేదానికి దానికి విరుద్ధంగా, అమ్మకు కళాశాలలో విద్యార్థులు చాలా మద్దతుగా నిలిచారు. వందలాది మంది అబ్బాయిలు ఉన్న కాలేజీలో ఆమె ఒక్కతే అమ్మాయి. కానీ ఎవరూ ఆమెకు అసౌకర్యం కలిగించలేదు. దీనికి మనం గర్వ పడాలి అని అధికారులు ఆమెకు ప్రత్యేక హాస్టల్‌ను కూడా ఏర్పాటు చేసింది. అమ్మ కాలేజీలో చదువుతున్నపుడు నేను మామయ్య దగ్గర ఉండేదాన్ని. ఆమె ప్రతి వారాంతంలో నన్ను చూడడానికి వచ్చేది." [6] లలిత 1943లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజనీర్. [5] ఆమె జమాల్‌పూర్ రైల్వే వర్క్‌షాప్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్‌తో తన ప్రాక్టికల్ శిక్షణను పూర్తి చేసింది. ఇది ఒక ప్రధానమైన మరమ్మతుల సమగ్ర సదుపాయం. [4]

ఇంజినీరింగ్ కెరీర్ మార్చు

గ్రాడ్యుయేషన్ తర్వాత లలిత, సిమ్లా లోని సెంట్రల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషనులో పని చేసింది. ఆమె పొగలేని ఓవెన్లు, జెలెక్ట్రోమోనియం (ఎలక్ట్రికల్ సంగీత వాయిద్యం) పరిశోధనలో తండ్రికి సహాయం చేసింది. [ఆధారం చూపాలి]

ఆమె భారత ప్రభుత్వ ఎలక్ట్రికల్ కమీషనర్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ కావడానికి ముందు ఈస్ట్ ఇండియన్ రైల్వేస్‌లోని ఎలక్ట్రికల్ విభాగంలో ఒక సంవత్సరం ప్రాక్టికల్ శిక్షణ పొందింది. [7] ఆ తరువాత 1948లో లలిత, కలకత్తాలోని బ్రిటిష్ సంస్థ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (AEI)లో చేరింది. భారతదేశంలో అతిపెద్ద డ్యాం అయిన భాక్రా నంగల్ డ్యామ్, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్‌స్టేషన్ లేఅవుట్‌ల రూపకల్పనలో పనిచేసింది. [5] [4] [7] 1977 లో [5] దాదాపు ముప్పై సంవత్సరాలు AEI (తరువాత జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ స్వాధీనం చేసుకుంది) లో పనిచేసి, పదవీ విరమణ చేసింది.

ఆమె 1953లో ఇన్‍స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ (IEE), లండన్ కౌన్సిల్‌లో అసోసియేట్ మెంబర్‍గా ఆ తరువాత 1966లో పూర్తి స్థాయి సభ్యురాలిగా ఎన్నికైంది. 1964లో న్యూయార్క్‌లో జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు, శాస్త్రవేత్తల (ICWES) సదస్సుకు హాజరైంది. ఆ సదస్సుకు భారతదేశం నుండి హాజరైన మహిళా ఇంజనీరు లలిత ఒక్కరే. [5] [3]

ఆ సమావేశంలో 35 దేశాల నుంచి 500 మంది మహిళా ఇంజనీర్లు పాల్గొన్నారు. అక్కడనుంచి తిరిగి వస్తూ బ్రిటన్‌లో AEI కంపెనీని సందర్శించింది. ప్రముఖ వార్తాపత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎలెక్ట్రికల్ న్యూస్‍, ఫెమీనా, ఈవ్స్ వీక్లీలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. స్త్రీలు సాంకేతిక విద్య నేర్చుకోవడం లోని ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. 'బ్రిటీష్ ఫ్యాక్టరీలు సందర్శించిన భారతీయ తొలి మహిళా ఇంజనీర్' అని అప్పట్లో వార్తాకథనాలు వెలువడ్డాయి. [ఆధారం చూపాలి]

1967లో జరిగిన రెండో అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి మరో ఐదుగురు భారతీయ మహిళలు హాజరయ్యేట్టు ఏర్పాట్లు చేసింది.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం మార్చు

భర్త చనిపోయిన తర్వాత లలిత మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన కుమార్తె శ్యామలను పెంచడానికి సహాయం చేసిన తన వదినతోనే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం గడిపింది. [5] లలిత అరవై ఏళ్ళ వయసులో, రిటైరైన రెండేళ్ళకే, 1979 అక్టోబర్ 12న బ్రెయిన్ ఎన్యూరిజంకి గురై మరణించింది.

మూలాలు మార్చు

  1. Archive, The Telugu (2019-07-24). "India's first female engineer: Lalitha Ayyalasomayajula". Medium. Archived from the original on 2019-09-21. Retrieved 2019-09-21.
  2. Sen Gupta, Nandini. "Women who engineered a pioneering path | Chennai News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-11-14.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 Mohan, Shantha. (24 May 2017). "The First Woman Engineer in India" SWE All Together.
  4. 4.0 4.1 4.2 4.3 "76: Ayyalasomayajula Lalitha". Magnificent Women. Retrieved 2019-09-21.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 Mohan, Shantha R., 1948- (2018). Roots and wings : inspiring stories of Indian women in engineering. Notion Press. ISBN 9781644291320. OCLC 1054198087.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)
  6. "Women in STEM – Ayyalasomayajula Lalitha Rao – The Electric Flame". whastic.com. Archived from the original on 26 ఫిబ్రవరి 2021. Retrieved 13 September 2020.
  7. 7.0 7.1 Gooday, Graeme (2020-07-02). "International conviviality: recovering women in engineering from Africa and Asia in 'The Woman Engineer'". Electrifying Women (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-08-21.{{cite web}}: CS1 maint: url-status (link)