అష్టమేఘాలు అనగా ఎనిమిది రకాల మేఘాలు. మేఘమాలికా శాస్త్రములో, మేఘాలను ఎనిమిది రకాలుగా నిర్ణయించినట్లు ఉంది.

రకాలుసవరించు

  1. పుష్కలావరక మేఘాలు: యెక్కువగానూ, మిక్కిలి వింతగాను వర్షిస్తాయి. కుంభవృష్టి (కుండలతో దిమ్మరించే విధముగా వాన కురవటం)ని కురిపించే మేఘాలివే.
  2. మధుమేఘాలు: తేనె రంగు కలిగి ఉంటాయి. పదిహేను ఆమడల పొడవు వ్యాపించి నాలుగు తూముల వర్షం కురిపిస్తాయని చెబుతారు.
  3. వాయు మేఘాలు లేదా వాయుమండల మేఘాలు: ఈ మేఘాలు గోరోచనపు రంగులో ఉంటాయి. ఇత్తడి రంగుగా కనబడతాయి. ఇవి కనిపిస్తే వర్షం కురవదంటారు. దీనినే జానపదులు పులిచారల మబ్బు అంటారు. అవి పన్నెండు ఆమడల పొడవు వ్యాపించుననియూ, గాలి యొక్కువగా ప్రకోపించి, ప్రధానంగా ఉంటే స్వల్పవర్షం కురుస్తుందని చెబుత్తున్నారు.
  4. రాజమేఘాలు: నల్లని, తెల్లని మబ్బులలో రాగి వలెను, దాసాని పువ్వు వలెను మెరుపులు కనిపిస్తే, ఆ మబ్బులో రాజమేఘాలున్నాయని అనుకోవచ్చు. ఈ మేఘాలు ముఖ్యంగా వింధ్యకు ఉత్తర ప్రాంతాలలో గంగా తీర సీమలలో వర్షిస్తాయి.
  5. బ్రాహ్మణజాతి మేఘాలు: కమలముల వన్నె కలిగి ఉంటాయి. ఇవి గాలిపాటును బట్టి వర్షిస్తాయని చెబుతారు.
  6. క్షత్రియజాతి మేఘాలు: ఎర్రని రంగు కలిగి, గంభీరాకారముతో ఉంటాయి.
  7. శూద్ర జాతి మేఘాలు: నల్లని రంగు కలిగి ప్రశాంతముగా ఉంటాయి.
  8. నీలిమేఘాలు: ఇంద్ర నీలమును పోలిన రంగు కలిగి, నిప్పురంగు మెరుపులు ఈ మేఘముల నుండే కలుగుతాయని అంటారు. ఇవి వింధ్యా పర్వతాలకు దక్షిణ ప్రాంతములలో, గోదావరీ నది సముద్రములో కలిసే ప్రదేశములలో వర్షిస్తాయని ప్రతీతి.

మూలాలుసవరించు

  • మిన్నేరు (జానపదగేయరత్నావళి) - నేదునూరి గంగాధరం పేజీ.343, 344 ప్రాచీన గ్రంధావళి, రాజమహేంద్రవరం (1968)