నాంది మార్చు

అష్టా చెమ్మా అనేది ఇద్దరు, ముగ్గురు, లేక నలుగురు వ్యక్తులు ఆడే ఆట. చిన్నా-పెద్దా, ఆడా-మగా వ్యత్యాసం లేకుండా ఎవ్వరైనా ఆడే ఆట ఇది. కాని సర్వ సాధారణంగా ఇది ఆడ పిల్లలు ఎక్కువగా ఆడే ఆట. గ్రామాల్లో ఇంటి అరుగుపై ఈ దిగువ చూపిన బొమ్మని సుద్ద ముక్కతోటో, బొగ్గుతోటో గీసి ఆడడం పరిపాటి.

 

నలుగురితో ఆడే పద్ధతి మార్చు

నలుగురు ఆటగత్తెలు ఉన్నారనుకుందాం. వారికి దక్షిణం (A), తూర్పు (B), ఉత్తరం (C), పడమర (D) అని పేర్లు పెడదాం. ఒకొక్క ఆటగత్తె వద్ద నాలుగేసి పావులు (లేదా పిక్కలు) ఉంటాయి. ఎవ్వరి పావులు ఏవో తెలియడానికి ఈ పావులు నాలుగు వివిధమైన రంగులలోనైనా ఉండొచ్చు, ఆకారాలలోనైనా ఉండొచ్చు. ప్రతి ఆటగత్తె, మొదట్లో తన పావులని తన "ఇంట్లో" పెట్టుకుంటుంది. బొమ్మలో ఈ నాలుగు ఇళ్లు A, B, C, D అనే అక్షరాలతో చూపించడం జరిగింది.

ఆట ఆడడానికి నాలుగు గవ్వలు వాడడం (విసరడం) పరిపాటి. (గవ్వలు లేకపోతే అరగదీసిన నాలుగు చింతపిక్కలని వాడవచ్చు.) ఇలా గవ్వలు విసరినప్పుడు కొన్ని బోర్లా పడతాయి, కొన్ని వెల్లకిలా పడతాయి. నాలుగు గవ్వలూ బోర్లా పడితే దానిని "అష్టా" అంటారు; అష్టా విలువ 8. నాలుగు గవ్వలూ వెల్లకిలా పడితే దానిని "చెమ్మా" అంటారు; చెమ్మా విలువ 4. ఈ రెండూ కాని పక్షంలో ఎన్ని వెల్లకిలా పడితే ఆ "విసురు" విలువ అంత. కనుక అష్టా-చెమ్మా ఆటలో గవ్వలు నేల మీదకి విసిరినప్పుడు ఆ "విసురు" విలువ 1, 2, 3, 4 లేక 8.

దక్షిణం దిక్కున కూర్చున్న వ్యక్తి (A) తో ఆట మొదలయి, అవకాశం కుడి పక్కకి జరుగుతూ (ప్రతిఘడి దిశలో జరుగుతూ) వెళుతుంది. ఆట దక్షిణంతో మొదలయిందనుకుందాం. దక్షిణం గవ్వలు విసిరినప్పుడు 3 పడిందనుకుందాం. అప్పుడు దక్షిణం తన పిక్కని 3 గదులు ప్రతిఘడి దిశలో జరుపుతుంది. ఇంతటితో ఈమె అవకాశం అయిపోయింది కనుక అవకాశం కుడి పక్కన ఉన్న తూర్పు (B) కి వెళుతుంది. ఇలా ఆట చుట్ట్లు తిరుగుతూ ఉంటుంది.

ఆటగత్తెల పిక్కలు "ఇంటు" (x) గుర్తు ఉన్న గదులలో ఉన్నంత సేపూ వాటిని ప్రత్యర్థుల పిక్కలు చంప లేవు. ఒక పిక్క మరే గదిలో ఉన్నా ప్రత్యర్థి పిక్క అదే గదిలో "దిగడం" సంభవిస్తే రెండవ పిక్క మొదటి పిక్కని "చంపు"తుంది. ఇలా చచ్చిన పిక్క ఎవరు చంపేరో వారి అధీనంలో ఉంటుంది. ఆ పిక్కకి తిరిగి ప్రాణం పోసి బతికించుకోవాలంటే ఆ పిక్క హక్కుదారు అష్టా కాని చెమ్మా కాని వేసి విడిపించుకోవాలి. అలా విడిపించుకున్న పిక్క మళ్లా "ఇంట్లో" కి చేరుతుంది. ఒక పిక్క ఉన్న గది "గుండా" ప్రత్యర్థి పిక్క ప్రయాణం చెయ్యవచ్చు; అలా ప్రయాణం చేసినప్పుడు ఒకరిని మరొకరు చంపుకో కూడదు.

చావుని తప్పించుకుని ఒక పిక్క పూర్తిగా ఒక ఆవృత్తి పూర్తి చేసి తన ఇంటి వెనక ఉన్న T అనే గది వరకు వచ్చిన తరువాత ఆ పిక్క "లోపలికి" వెళుతుంది. లోపల ఉన్న దారిలో పిక్కలు అనుఘడి దిశలో ప్రయాణం చేస్తాయి. అలా అనుఘడి దిశలో ఒక ప్రదక్షిణం పూర్తి అయి నడిమధ్యలో ఉన్న గది చేరుకుంటే ఆ పిక్క "పండి" పోయింది అంటారు. ఇంక దానిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.

ప్రతి ఆటగత్తె తన నాలుగు పిక్కలని ఇంటి నుండి పంట కి చేర్చాలి. ఒక ఆటగత్తె ఒకే సమయంలో తన పిక్కలని ఎన్నింటినైనా ఆటలోకి తీసుకు రావచ్చు.