ఆండాళ్ వెంకటసుబ్బారావు

ఆండాళమ్మ, లేడీ ఆండాళ్గా ప్రజలచే పిలువబడే ఆండాళ్ వెంకటసుబ్బారావు ఒక ప్రముఖ సంఘ సేవకురాలు, విద్యావేత్త.

ఆండాళ్ వెంకటసుబ్బారావు
Lady andal.jpg
మద్రాస్ సేవా సదన్‌లో ఆండాళమ్మ విగ్రహం
జననం1894
మద్రాస్
మరణం1969
క్రియాశీలక సంవత్సరాలు1928-1969
ప్రసిద్ధిసంఘ సేవకురాలు
భార్య / భర్తముత్తా వెంకట సుబ్బారావు
పురస్కారములుపద్మభూషణ్ 1957

విశేషాలుసవరించు

ఈమె 1894లో మద్రాసు పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మద్రాసులోని సెయింట్ థామస్ కాన్వెంటులోను, హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయ్యర్ సెకండరీ స్కూలులోను, ప్రెసిడెన్సీ గర్స్ హైస్కూలులోను గడచింది. ఈ చదువు ఆమెకు సామాజిక స్పృహను కలిగించింది. బీదలకు, నిస్సహాయులకు, దురదృష్టవంతులకు ఏదో ఒకటి చేయాలనే తపనను కలిగించింది. ఈమె చిన్నవయసులోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారింది. ఆ కాలంలో బాలవితంతువులు ఎదుర్కొనే సాధకబాధకాలను స్వయంగా అనుభవించింది. మద్రాసు హైకోర్టు జడ్జి ముత్తా వెంకట సుబ్బారావు పరిచయం ఆమె జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. అతడు ఈమెను 1922లో ఆదర్శ వివాహం చేసుకున్నాడు. సమాజంలోని రుగ్మతలను తొలగించడానికి ఈమె తనకు సరియైన జోడీగా ఆయన నిర్ణయించుకున్నాడు. ఈ దంపతులిద్దరూ కలిసి వందలాది అభాగ్యుల జీవితాలలో వెలుగును నింపినారు[1].

సంఘసేవసవరించు

 
ఆండాళ్, ముత్తా దంపతులు

1928లో ఈ దంపతులు దిక్కులేని పిల్లలు, స్త్రీలకు, సమాజం నుండి వెలివేయబడిన వారికి ఆశ్రయమిచ్చి చదువు చెప్పించడం కోసం తమ స్వంత ధనం 10,000 రూపాయలు వెచ్చించి "మద్రాస్ సేవా సదన్" అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఆరంభంలో ఈ సంస్థలో 8 మంది అనాథలను చేర్చుకుని వారికి తిండి, దుస్తులు ఇచ్చి వారికి శిక్షణ యిచ్చి వారు సమాజంలో నిలదొక్కుకునేలా చేశారు. 8 మందితో ప్రారంభమైన మద్రాసు సేవా సదన్‌లోని సభ్యుల సంఖ్య 30 యేళ్లలో 3000కు పెరిగింది. ఈమె ఈ సంస్థలోని పిల్లల పట్ల పత్యేక శ్రద్ధ కనబరచేది. వారికి స్వయంగా భోజనం తినిపించేది. సాయంకాలాలు తన కారులో బీచికి వ్యాహ్యాళికి తీసుకు వెళ్లేది. ఆ పిల్లలకు యుక్త వయసు వచ్చేవరకు పెళ్ళి జరగకుండా జాగ్రత్త వహించి, మంచి వారికి ఇచ్చి పెళ్ళిళ్లు చేసేది. వారికి నగలు, దుస్తులు స్వయంగా తన డబ్బుతో కొనిపెట్టేది. ఈ సంస్థలో జాతి, కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికీ చోటు కల్పించింది. ఈ సంస్థకు అనుబంధంగా లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు హయ్యర్ సెకండరీ స్కూలును, సర్ ముత్తా వెంకట సుబ్బారావు సంగీత సభను ప్రారంభించింది[2]. 1960లో తన భర్త మరణం ఈమెను విపరీతంగా కృంగదీసింది. అయినా ఆమె ధైర్యంగా ఆయన లేని లోటును కనిపించనీయకుండా చిరునవ్వుతో సేవా సదన్ కార్యక్రమాలను నిర్వహించింది.

పురస్కారాలుసవరించు

ఈమె సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈమెకు కింగ్ జార్జ్ మెడల్, కైసర్ - ఇ - హింద్ వంటి పలు పురస్కారాలు వరించాయి. 1957లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.

మరణంసవరించు

ఈమె 1969లో తన 75వ యేట మరణించింది.

మూలాలుసవరించు

  1. "లేడీ ఆండాళ్ గురించి". Archived from the original on 2017-08-12. Retrieved 2017-04-24.
  2. The Lady Andal story