ఆకాశం సాంతం అనే నవల హిందీలో రాజేంద్ర యాదవ్ రచించిన సాంఘిక నవలకు అనువాదం. 1960ల్లో భారతీయ ఉమ్మడి కుటుంబాల స్థితి, సాంఘిక స్థితిగతులు వంటివాటిని చర్చిస్తూనే మంచి వివాహానంతర ప్రేమకథను అందించిన నవల ఇది.

రచన నేపథ్యం

మార్చు

నవల తొలిగా హిందీ భాషలో 1951లో “ప్రేత్ బోల్తే హై” (దయ్యాలు మాట్లాడుతాయి) పేరిట రాజేంద్ర యాదవ్ వ్రాసి ప్రచురించారు. 1960లో “సారా ఆకాశ్” పేరిట పునర్ ప్రచురించారు. ఈ పేరు మీదనే విస్తృత ప్రజాదరణ పొందింది. నిఖిలేశ్వర్ అనువదించగా అంతర భారతీయ గ్రంథమాల కింద నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు “ఆకాశం సాంతం”గా ప్రచురించారు.

ఇతివృత్తం

మార్చు

ఒక దిగువ మధ్యతరగతికి చెందిన ఉమ్మడి కుటుంబంలో బి.ఎ. చదువుతూ, నిరుద్యోగిగా ఉన్న సమర్ అనే యువకునికి పెళ్ళి జరిగింది. అతని దాంపత్యం ప్రేమగా ఫలించే సుదీర్ఘ పయనమే ఈ నవల ఇతివృత్తం అని చెప్పుకోవచ్చు. సమర్ భార్యగా ప్రభ అత్తారింటికి వస్తుంది. ఆ దాంపత్య ప్రేమకు మొదట నాటి యువకులలో ఉండే బ్రహ్మచారిగా జీవితం గడపాలన్న ఆదర్శం అడ్డుతగులుతుంది. ఆర్.ఎస్.ఎస్.లో చురుకుగా వుండే కార్యకర్త కావడంతో సమర్ లో పునాదులు లేని భవనాల్లా దేశానికి సేవ చెయ్యాలనే భావన, అందుకు బ్రహ్మచారిగా ఉండటమే మార్గమన్న అపోహ ఏర్పడివుంటాయి. ఆపై అడ్డుగోడ అతని వదినె (అన్న గారి భార్య) నిర్మిస్తుంది. సమర భార్య ప్రభకు గర్వం అని, దాన్ని అతనే అణచాలని పురిగొల్పి సమర్ ఆమెను అకారణంగా కొట్టి హింసించేలా చేస్తుంది. ఆపై కుటుంబంలో విపరీతంగా జరిగే అవమానాలు, వంటింటి శ్రమ ప్రభను కుంగదీస్తాయి. ఇలా నిరాశాజనకంగా సాగే కథలో ఓ రాత్రి ప్రభలోని మౌనమనే హిమాలయం కరిగి సమర్ ను ఆ కన్నీళ్ళలో కొట్టుకుపోయేలా చేస్తుంది. ఆ రాత్రి ఒకటైన ఆ జంట ప్రేమ ఫలించేందుకు సమష్టి కుటుంబం అంతూ దరీ లేని కయ్యలా అడ్డుపడుతుంది. రిటైర్ కాగా నెలకు పాతికరూపాయలు పెన్షన్ పొందే తండ్రి, తల్లి, క్లర్కుగా పనిచేస్తున్న అన్న, వదిన, వాళ్ళ పిల్లలు, భర్త వల్ల పీడితురాలైన చెల్లెలు మున్ని.. అదీ కుటుంబం. ఇందులో మున్ని తప్ప ఇంకెవరూ ఆ జంట కలిసేందుకు మనస్ఫూర్తిగా స్పందించరు. ఈ స్థితిలో వారి ప్రేమ ఎలా ఫలించింది? వారి స్వప్నాలు ఎలా నిజమైనాయి? అన్నది ఎవరికీ వారు చదువుకోవాల్సిన భాగం.

ప్రాచుర్యం

మార్చు

సారా ఆకాశ్ నవలను ప్రముఖ హిందీ సినిమా దర్శకుడు బాసూ ఛటర్జీ సినిమాగా రూపొందించారు. పియా కా ఘర్, రజనీగంధ, చిత్‌చోర్ వంటి చిత్రాలతో ప్రఖ్యాతి గాంచిన బాసు ఛటర్జీ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం అది. భారతీయ సినిమాలో సమాంతర ఉద్యమానికి తెర తీసిన చిత్రాలుగా 1969లో వచ్చిన సారా ఆకాశ్, భువన్‌షోమ్ (మృణాళ్‌సేన్ చిత్రం) చిత్రాలను చెప్పుకుంటారు. నవలగానూ, సినిమాగానూ కూడా సారా ఆకాశ్ ప్రాచుర్యం పొందింది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
  • ఆకాశం సాంతం నవల గురించి పుస్తకం.నెట్‌లో వ్యాసం
  • రాజేంద్ర యాదవ్. ఆకాశం సాంతం. ISBN 81-237-2565-5. Retrieved 2020-07-10.

మూలాలు

మార్చు