ఆపరేషన్ పైథాన్

1971 యద్ధం లో భాగంగా పాకిస్తాన్ పైన భారత దేశం చేపట్టిన సైనిక చర్య

ఆపరేషన్ ట్రైడెంట్‌కు కొనసాగింపుగా భారత నౌకాదళం, పాకిస్తాన్‌పై చేసిన దాడిని ఆపరేషన్ పైథాన్ అంటారు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ నౌకాదళ స్థావరం కరాచీపై ఈ దాడి చేసింది. ఆపరేషన్ ట్రైడెంట్ తరువాత, భారీ భారత యుద్ధ నౌకలను గమనించిన పాకిస్తాన్, భారత్ మరో దాడికి పాల్పడబోతోందని అనుమానించిన పాకిస్తాన్, తన గగనతల గస్తీని ముమ్మరం చేసింది. పాకిస్తానీ యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకలతో కలిసిపోయి, భారత నౌకాదళాన్ని కన్నుగప్పజూసాయి. ఈ ఎత్తులను చిత్తు చేసేందుకు భారత నౌకాదళం డిసెంబరు 8/9 తేదీల్లో ఆపరేషన్ పైథాన్‌ను చేపట్టింది. ఒక క్షిపణి పడవ, రెండు ఫ్రిగేట్లతో కూడిన బృందం, కరాచీ రేవుకు దగ్గరలో ఉన్న ఓడలపై దాడి చేసింది. పాకిస్తాన్ ఫ్లీట్ ట్యాంకరు డక్కా ధ్వంసమైంది. కెమారి ఇంధన నిల్వ స్థావరం నాశనమైంది. కరాచీ రేవులో లంగరు వేసి ఉన్న రెండు విదేశీ వాణిజ్య నౌకలు మునిగిపోయాయి. కాగా భారత్‌కు నష్టమేమీ కలగలేదు. 

ఆపరేషన్ పైథాన్
ప్రదేశం{{{place}}}
ఫలితంభారత నౌకాదళ విజయం, పాకిస్తాన్ నౌకా మార్గ దిగ్బంధనం
ప్రత్యర్థులు
 India పాకిస్తాన్
సేనాపతులు, నాయకులు
అడ్మిరల్ ఎస్.ఎం.నందా దాడిలో పాల్గొన్న నౌకల కమాండింగ్ ఆఫీసర్లురియర్ అడ్మిరల్ హసన్ అహ్మద్ దాడికి గురైన నౌకల కమాండింగ్ ఆఫీసర్లు
బలం
1 క్షిపణి పడవ 2 బహుళార్థక ఫ్రిగేట్లుకరాచీ రేవుకు దగ్గరలో మోహరించి ఉన్న నౌకలు
ప్రాణ నష్టం, నష్టాలు
లేవుఒక నౌక ధ్వంసమైంది

రెండు నౌకల ముంచివేత[lower-alpha 1]

ఇంధన నిల్వ ట్యాంకు ధ్వంసం

నేపథ్యం మార్చు

1971 లో పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయం కరాచీలో ఉండేది. పాకిస్తాన్ నౌకాదళం దాదాపు పూర్తిగా కరాచీ హార్బరులోనే ఉండేది. పాకిస్తాన్ నౌకావిపణికి కూడా కరాచీయే ప్రధాన స్థావరం. కరాచీ దిగ్బంధనం అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టే. కరాచీ హార్బరు సంరక్షణ పాకిస్తాన్ హైకమాండుకు అత్యంత ప్రధానం; వైమానిక, నౌకా దాడుల నుండి దానికి పటిష్ఠమైన భద్రత ఉండేది. ఈ ప్రాంతంలోని రెండు వైమానిక స్థావరాల లోని యుద్ధవిమానాల ద్వారా కూడా కరాచీకి రక్షణ కల్పించారు.

ఆపరేషన్ పైథాన్‌కు ముందు నాందిగా ఆపరేషన్ ట్రైడెంట్ జరిగింది. 1971 చివరికి వచ్చేసరికి భారత పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగసాగాయి. నవంబరు 23 న పాకిస్తాన్ అంతర్గత ఆత్యయిక పరిస్థితిని ప్రకటించాక, భారత నౌకాదళం కరాచీకి దగ్గరలోని ఓఖా వద్ద మూడు విద్యుత్ తరగతి క్షిపణి పడవలను నిఘా కోసం మోహరించింది. డిసెంబరు 3 న సరిహద్దు వెంబడి ఉన్న భారత వైమానిక క్షేత్రాలపై పాకిస్తాన్ దాడి చేసిన తరువాత భారత పాకిస్తాన్ యుద్ధం అధికారికంగా మొదలైంది.[1] ఈ యుద్ధంలో భాగంగా చేపట్టిన దాడియే ఆపరేషన్ ట్రైడెంట్.

ఆ ఆపరేషన్‌లో తలపెట్టిన లక్ష్యాలు దాదాపుగా అన్నీ పూర్తవగా, కరాచీ రేవులోని ఇంధన నిల్వల పేల్చివేత అసంపూర్ణంగా ఉండగానే ఆపరేషన్‌ను ముగించారు. అసంపూర్ణంగా మిగిలిపోయిన పనిని పూర్తి చేసేందుకు భారత నౌకాదళం మూడు రోజుల తరువాత ఆపరేషన్ పైథాన్‌ను సంకల్పించింది. 

పర్యవసానాలు మార్చు

పాకిస్తాన్ తరపున రక్షణ చర్యలు చేపట్టిన రియర్ అడ్మిరల్ ప్యాట్రిక్ సింప్సన్ నౌకాదళంలో మనోస్థైర్యం పెంచేందుకు కృషి చేసాడు.  ఇందుకుగాను ఆయనకు సితారా ఎ జూరత్ పురస్కారాన్ని బహూకరించారు. క్షిపణి పడవ వినాశ్ యొక్క కమాండింగ్ ఆఫీసరు, లెఫ్టి.కమాం. విజయ్ జేరథ్‌కు భారత్ వీరచక్రను బహూకరించింది.[2]

తమ నౌకలపై భారత్ దాడిచేస్తే పేలుడు తక్కువగా ఉండేందుకు గాను, నౌకల్లో మందుగుండు సామాగ్రి స్టాకును తక్కువగా ఉంచాలని పాకిస్తాన్ నౌకాదళం ఆదేశించింది. కచ్చితమైన ఆదేశాలుంటే తప్ప, రాత్రుళ్ళు సముద్రంలో తిరగరాదని కూడా ఆదేశించింది. ఈ రెండు ఆదేశాలు నౌకాదళ నావికుల మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

భారత నౌకాదళం దాడులకు వాణిజ్య నౌకలు కూడా మునిగిపోవడంతో, కరాచీ వెళ్ళే విదేశీ వాణిజ్య నౌకలు భారత నౌకాదళ అనుమతులు కోరడం మొదలుపెట్టాయి. క్రమేణా, విదేశీ వాణిజ్య నౌకలు కరాచీ రేవుకు వెళ్ళడం మానేసాయి. దీంతో భారత నౌకాదళం అన్యాపదేశంగా నౌకామార్గ దిగ్బంధనం చేసినట్లైంది.

నోట్స్ మార్చు

  1. Not Pakistani vessels, they were foreign merchant vessels stationed at Karachi.

మూలాలు మార్చు

  1. Commander Neil Gadihoke. "1971 War: The First Missile Attack on Karachi". Indian Defence Review. Retrieved 20 November 2016.
  2. Hiranandani 2000, p. 398.