ఆమె లేఖలు
ఆమె లేఖలు(Letters from Madras by ALaady (Julia Thomas) 1836-1839) ఆరేడు వేలఏళ్ల కిందటి ఈజిప్షియన్లు ఏం తిన్నారో, ఏం మాట్లాడుకున్నారో చెప్పే ఆధారాలు బోలెడున్నాయి. మనకు మొన్న జరిగినవే సరిగ్గా తెలియదు. ‘ఆమె లేఖలు’ ఆ లోటును కొంత భర్తీ చేస్తాయి. ఈ పుస్తకంలో రెండు వందల ఏళ్లకిందటి తెలుగు జీవితాలు ఉన్నాయి. ఆనాటి మనుషులు ఎంత పేదగా, అమాయకంగా, మొరటుగా, బండగా, ఆడంబరంగా బతికారో ఈ లేఖలు వివరిస్తాయి. లేఖల రచయిత్రి జూలియా థామస్ ‘వైట్ ఉమన్’ బర్డెన్‌తో తెలుగోళ్లను ఎలా చూసిందో కళ్లకు కట్టినట్టు తెలుసుకోవచ్చు.
దాదాపు 180 ఏళ్ల కిందట అచ్చయిన ‘లెటర్స్ ఫ్రమ్ మద్రాస్’కు అనువాదం ఇది. పెన్నేపల్లి గోపాలకృష్ణ చాలా లేఖలను అనువాదం చేసి వెళ్లిపోగా, కాళిదాసు పురుషోత్తం మిగిలినవి పూర్తి చేసి పాఠకుల ముందుకు తీసుకొచ్చారు. జూలియా భర్త జేమ్స్ థామస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో, రాజముండ్రిలో జడ్జి. గర్భవతి అయిన జూలియా 1836లో ఇంగ్లండ్ నుంచి ఓడలో ఒంటరిగా బయల్దేరి మద్రాస్ రేవులో కాలుపెట్టింది, మద్రాసులో ప్రసవం అయినతర్వాత, బిడ్డను తీసుకొని రాజముండ్రి వెళ్ళి, తెలుగువాళ్ల మధ్య నాలుగేళ్లపాటు జీవించి ఇక్కడి విశేషాలను వర్ణిస్తూ బంధుమిత్రులకు రాసిన లేఖలు ఇవి. ఇవి తూర్పు, పడమరల ఘర్షణకు అద్దం పడతాయి. మన తాతముత్తాలు ఎలా బతికారో వివరంగా, సరదాగా మొట్టికాయలువేసి చెబుతాయి.
ధనికులు, దొంగలు, బ్రాహ్మణులు, అంటరానివాళ్లు, తెల్లదొరలు, కోర్టుపక్షులు, పటాటోపం ప్రదర్శించే జమిందార్లు, డోలీలూ, బోయీలు, ఆయాలు, గుళ్లు, బళ్లు, క్రైస్తవ మతప్రచారం, హిందూ క్రైస్తవ ధర్మాల వాదోపవాదాలు, భీకర తుపాను, కర్నూలు నవాబు తిరుగుబాటు..సకలం ఇందులో కనిపిస్తాయి. 1836 నుంచి 1839 వరకు రాజమండ్రిలో ఉన్న జూలియా మన తలకిందుల సమాజాన్ని చూసి ఒ మానవిగా బాధపడుతుంది. ఒక ఆధిపత్యజాతి మహిళగా, క్రైస్తవురాలిగా అసహ్యించుకుంటుంది, ఎగతాళి చేస్తుంది. మనకు నాలుగు అక్షరమ్ముక్కలు నేర్పడానికి రాజమండ్రిలో ‘జెంటూ’ బడి, రీడింగ్ రూమ్ పెడుతుంది. మద్రాస్ నుంచి తెలుగు పత్రికలు, పుస్తకాలు తెప్పిస్తుంది. మాలపిల్లలు స్కూలుకొస్తే తమ పిల్లల్ని పంపమని ఇతర కులాలవాళ్ళు చెబితే, ‘ఎక్కువమందికి చదువు చెప్పడానికి’ జడ్జి దంపతులు సరేనంటారు.
అప్పటికీ, ఇప్పటికీ మన సమాజం ఏం మారిందని ఈ పుస్తకం చదువుతున్నప్పుడల్లా అనిపించింది. రూపాలు మారినా, అదే పేదరికం, అదే కులవివక్ష, ఆధికారోన్మాదం, ఆత్మవంచన, బానిసకొక బానిస బతుకు. జూలియా భర్త జడ్జి కనుక మన పెద్దమనుషులు పని ఉన్నా లేకపోయినా ఆయన పంచలో చేతులు కట్టుకుని కాపుగాసి ‘ఊరికే మిమ్మల్ని చూసిపోదామని వచ్చామ’నడాన్నీ, అందులోని హాస్యాన్ని జూలియా మాటల్లోనే చదువుకోవాలి. అమ్మవారి రథోత్సవానికి 30 ఎద్దులు సరిపోవని బ్రాహ్మణులు తెల్ల కలెక్టరుకు మొరపెట్టుకుంటే, అతడు ‘ఆమె దురాశాపరురాలు’ అంటూ విగ్రహాన్ని ముక్కలు చేయించిన కథా ఇందులో ఉంది. జూలియా గర్భవతి అయి లండన్ బయలుదేరుతుంది. జడ్జ్ థామస్.కి సుస్తీ చేయడంతో అతను కూడ ఆమెతో మద్రాసులో ఓడెక్కి లండన్ చేరి, అనారోగ్యంతో చనిపోతాడు. తర్వాత 1842లో జూలియ Maitland అనే మత ప్రచారకుణ్ణి పునర్వివాహం చేసుకొంటుంది. 1844 లో, ఆమె ఇంగ్లాండ్ లో తనవారికి రాసిన 27 లేఖలను రచయిత్రి పేరు లేకుండా, అనానముస్.గా ప్రచురించింది. ఇటీవల రచయిత్రి జూలియా అని ప్రపంచానికి తెలిసింది. ఆమె లేకలు, ఆమె రచించిన బాల సాహిత్యం, ఆమె చిత్రించిన ఆయిల్ paintings న్యూయార్క్ మ్యూజియం లో భద్రపరచారు.
అరుదైన పుస్తకమిది. కాశీయాత్రా చరిత్రలా మనల్ని ఆ రోజుల్లోకి లాక్కెళ్తుంది. మద్రాస్ కంటే రాజమండ్రి బాగుందని అంటుంది జూలియా. గొట్టు చరిత్ర పుస్తకాలంటే ‘ఆమె లేఖలు’ ఎంతో బాగున్నాయి. ఊర్లు, సంవత్సరాలు, సంఘటనలకు మించిన జీవితాలున్నాయి, అవి మన జీవితాలు. మారుతూ ఉన్నట్టు కనిపిస్తున్న అవే జీవితాలు!
మూలాలు: 1. ఆమె లేఖలు, పల్లవి ప్రచురణలు, విజయవాడ. 2. శ్రీ పి.మోహన్ ఫేస్ బుక్ వాల్ మీది వ్రాత. 3. LETTERS FROM M A D R A S, DURING THE YEARS 1836-1839.BY A LADY .LONDON: JOHN MURRAY, ALBEMARLE STREET. 1846. 4.అమ్మ నుడి తెలుగు మాసపత్రిక 2019-20 సంచికలలో 14 ఉత్తరాల అనువాదం ప్రచురితం అయింది.
2 షేర్‌లను వీక్షించండి