ఆర్య జాతి అన్నది దక్షిణాసియా, పశ్చిమ ఆసియా, ఐరోపా ప్రజల పూర్వ సంస్కృతిని గురించి వివరించేందుకు 19వ శతాబ్ది తొలిభాగం నుంచి 20వ శతాబ్ది అర్థభాగం వరకూ ఉపయోగించిన జాతిపరమైన విభాగం.[1]

ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే పూర్వీకులు, ఆధునిక యుగం వరకూ కల వారి వారసులు ఒక స్పష్టమైన జాతి వారనీ, లేదా కనీసం కాకేషియన్ జాతిలో వీరంతా ఒక ఉపజాతి వారన్న ఆలోచన నుంచి ఆర్యజాతి భావన పుట్టింది.[2]

పదవ్యుత్పత్తి

మార్చు
 
"ఆర్యుడు" అన్న పదానికి క్రీ.పూ.6వ శతాబ్దిలో బెహిస్తున్ శాసనం అత్యంత ప్రాచీనంగా లభిస్తున్న శాసనాధారం, ఈ శాసనంలో శాసనాన్ని ఆర్య భాష లేక లిపిలో రాసినదని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఆర్యభాష అంటే ఇరానియన్ భాష.[3]
 
1507లో వాల్డ్‌సీ ముల్లర్ చిత్రించిన ఆరియ ప్రాంతం.

ఆర్య అన్న పదబంధం సాధారణంగా ఇండో-ఇరానియన్ భాషల మూలభాషను సూచించేందుకు ఉపయోగిస్తారు. సంస్కృతంలో దానికి సమానమైన పదమైన ఆర్య (దేవనాగరి: आर्य) అన్న పదం సంస్కృత భాషలో తమను తాము సంబోధించుకుందుకు వాడే జాతివాచకం., ప్రాచీన సంస్కృతంలో దాని అర్థం "గౌరవింపదగ్గవారు, ఉన్నతులు".[4][5] ప్రాచీన పర్షియన్ భాషలో సమానమైన రూపం ఆరియ (ప్రాచీన పర్షియన్: 𐎠𐎼𐎡𐎹) అన్నది ఆధునికమైన ఇరాన్ అన్న పేరుకు పూర్వపదం, అలాగే ఇరానియన్ ప్రజలకు జాతివాచకం.[6]

జాతిపరంగా ప్రయోగం

మార్చు

18వ శతాబ్దంలో ఇండో-యూరోపియన్ భాషల్లో అప్పటికి తెలిసిన అత్యంత ప్రాచీన భాషలు ఇండో-ఇరానియన్ భాషలే. దానితో ఆర్యన్అన్న పదంతో కేవలం ఇండో-ఇరానియన్ ప్రజలనే కాక రోమన్లు, గ్రీకులు, జర్మన్లు సహా మొత్తం స్థానిక ఇండో-యూరోపియన్ భాషా వ్యవహర్తలు అందరినీ సూచించసాగారు. బాల్ట్, సెల్ట్, సెల్విక్ భాషలు కూడా అదే విభాగానికి చెందినవని కొద్దికాలానికే గుర్తించారు. యూరోపియన్లు, ఇరానియన్లు, ఇండో-ఆర్యన్ ప్రజలకు పూర్వీకులని భావించిన ప్రాచీన కాలపు ప్రజలు మాట్లాడిన ఓ మూల భాష (ప్రస్తుతం ప్రోటో-ఇండో-యూరోపియన్ అంటున్నారు) ఉండేదనీ, దాని నుంచీ ఈ భాషలన్నీ పుట్టాయనీ వాదించారు.

ఈ పద ప్రయోగం 19వ శతాబ్ది చివరిభాగం, 20వ శతాబ్ది తొలినాళ్ళ నాటి విజ్ఞానవంతులైన రచయితల్లో సర్వసాధారణం. ఉదాహరణకు 1920ల నాళ్ళలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది, బాగా అమ్ముడుపోయిన హెచ్. జి. వెల్స్ రచన ద ఔట్‌లైన్ ఆఫ్ హిస్టరీలో చూడొచ్చు.[7] ఆ ప్రభావశీలమైన పుస్తకంలో వెల్స్ బహువచనంలో (ద ఆర్యన్ పీపుల్స్: ఆర్యన్ ప్రజలు) వాడాడు. అయితే పూర్వరచయితలైన హూస్టన్ స్టీవర్ట్ ఛాంబర్లేన్ వంటివారు జాతివివక్షాపూరితంగా, రాజకీయంగా దురుద్దేశాలతో ఆర్యన్ పదాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రయోగించిన ఏకవచనాన్ని (ద ఆర్యన్ పీపుల్) అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. 1922లో ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ అన్న పుస్తకంలో వెల్స్ అత్యంత వైవిధ్యభరితమైన వివిధ ఆర్యన్ ప్రజలను చిత్రీకరించారు. వెల్స్ చిత్రీకరణలో వారు.., స్థిరమైన నాగరికతలకు, దాడులు చేసే సంచార తెగలకూ మధ్యనున్న విస్తృతమైన సంఘర్షణను ఒకదానికొకటి సమన్వయం లేని వివిధ చలనాల ద్వారా సాగిస్తూ నాగరికతా పద్ధతులను నేర్చుకున్నారు. వెల్స్ దృష్టిలోని ఇదే- తిరిగి రూపభేదంతో, ఆలోచనలోనూ, విధానాల్లోనూ ఏ తేడా లేకుండా ఏజియన్, మంగోల్ ప్రజల నడుమా చూడవచ్చు. అలానే మొత్తం ప్రాచీన ప్రపంచంలో సెమిటిక్, ఏజియన్, ఈజిప్షియన్ నాగరికతల్లో ప్రాచీన ప్రపంచమంతటా ఇదే చూడవచ్చని అతని ఉద్దేశం.[8]

కానీ జాతివివక్షను పెట్టుబడిదారీ పద్ధతులకు తగ్గట్టుగా మార్చుకుని తెచ్చుకుంటున్న అప్పటి సంధియుగంలో ఈ సూక్ష్మమైన భేదాలను నిలుపుకుని కొనసాగించడం కష్టమని నిరూపణ అయింది. 1888లో "ఆర్యన్ జాతి, ఆర్యన్ రక్తం, ఆర్యన్ కళ్ళు, జుట్టు గురించి మాట్లాడే మానవ విజ్ఞాన శాస్త్రవేత్త, పొడుగైన కపాలం ఉన్నవారి నిఘంటువు, చిన్నకపాలాలు ఉన్నవారి వ్యాకరణం అంటూ మాట్లాడే భాషాశాస్త్రవేత్తకు తగిలేంత పాపాన్ని మూటకట్టుకుంటాడు.",[9] అన్న భాషావేత్త మాక్స్‌ముల్లర్ కూడా అప్పుడప్పుడు "ఆర్య జాతి" అన్న పదాన్ని వాడినవాడే.[10] కాబట్టి చరిత్రకారుల్లో కొందరు వ్యతిరేకిస్తూన్నా ఆర్యజాతి అన్న భావన ప్రధాన స్రవంతి ఆలోచనలో చోటుచేసుకోసాగింది.

1944 నాటి ర్యాండ్ మెక్‌నల్లీ వరల్డ్ అట్లాస్‌లో ఆర్య జాతి ముఖ్యమైన పది మానవుల జాతి విభజనల్లో ఒకటిగా చూపించారు.[11] పాల్ ఆండర్సన్ అనే సైన్స్ ఫిక్షన్ రచయిత స్కాండివేనియన్ పూర్వీకుల వంశంలో జన్మించినవాడు, జాతి వివక్ష వ్యతిరేకి. అతను తన రచనల్లో ఇండో-యూరోపియన్లకు సమానార్థకంగా ఆర్యన్ అన్న పదాన్ని స్థిరంగా వాడాడు.[12]

చారిత్రక రచనల్లోనూ అప్పుడప్పుడు ఆర్య అన్న పదం ఇండో-యూరోపియన్‌కి సమానార్థకంగా వాడారు. 1989 నాటి సైంటిఫిక్ అమెరికన్ అన్న వ్యాసంలో ఆర్య పదం ఇండో-యూరోపియన్‌కి సమానార్థకంగా వాడారు.[13]

సంస్కృతం, హిందీ-ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, రోమానీ, కాశ్మీరీ, సింహళీ, మరాఠీ వంటి ఇండో-ఆర్యన్ భాషల్లోని ఇండిక్ భాషల గురించి చెప్పాల్సివస్తే సాధారణంగా ఇండో-ఆర్యన్ అన్న పదాన్నే ఉపయోగిస్తారు.[14]

మూలాలు

మార్చు
 1. "Devdutt Pattanaik: Leveraging the Aryans".
 2. Mish, Frederic C., Editor in Chief Webster's Tenth New Collegiate Dictionary Springfield, Massachusetts, U.S.A.:1994--Merriam-Webster See original definition (definition #1) of "Aryan" in English--Page 66
 3. cf. Gershevitch, Ilya (1968). "Old Iranian Literature". Handbuch der Orientalistik, Literatur I. Leiden: Brill. pp. 1–31., p. 2.
 4. Monier-Williams (1899).
 5. "Monier Williams Sanskrit-English Dictionary (2008 revision)". UNIVERSITÄT ZU KÖLN. Retrieved July 25, 2010.
 6. Bailey, H.W. "Arya". Encyclopædia Iranica. Archived from the original on 2016-03-03. Retrieved April 21, 2018.
 7. Wells, H.G. The Outline of History, 3rd ed. (New York: Macmillan, 1921), Ch. 20 ("The Aryan-Speaking Peoples in Prehistoric Times"), pp. 236-51.
 8. "H.G. Wells in 1922 on the early history of "the Aryan peoples" (Proto-Indo Europeans)". bartleby.com. Retrieved August 16, 2015.
 9. F. Max Müller, Biographies of Words and the Home of the Aryas (1888), Kessinger Publishing reprint, 2004, p. 120; Dorothy Matilda Figueira, Aryans, Jews, Brahmins: Theorizing Authority Through Myths of Identity (SUNY Press, 2002), p. 45.
 10. Romila Thapar, "The Theory of Aryan Race and India: History and Politics," Social Scientist 24.1/3 (Jan.–Mar. 1996), 6. Thapar cites an 1883 lecture in which Mueller spoke of someone as "belonging to the south-eastern branch of the Aryan race."
 11. Rand McNally (1944) "Races of Mankind" (map)Rand McNally's World Atlas International Edition Chicago: Rand McNally. pp.278–79 –.
 12. See, for example, the Poul Anderson short stories in the 1964 collection Time and Stars and the Polesotechnic League stories featuring Nicholas van Rijn
 13. Renfrew, Colin. (1989). The Origins of Indo-European Languages. /Scientific American/, 261(4), 82-90.
 14. Fortson, Benjamin W. Indo-European Language and Culture: An Introduction. 2nd ed., Wiley-Blackwell, 2010, paras. 10.28 and 10.58.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్య_జాతి&oldid=3129061" నుండి వెలికితీశారు