ఇడ్లీ
ఇడ్లీ (ఆంగ్లం: Idli or Idly) దక్షిణ భారత దేశంలో విరివిహగా తినే అల్పాహార వంటకం. ఇడ్లీలు గుండ్రంగా, రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. మినప పప్పు, బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి ఆవిరితో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని మాంసకృత్తులూ, బియ్యంలోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి చట్నీ లేదా సాంబారు లేదా కారంపొడిగానీ, పచ్చడితో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు ప్రపంచంలోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.[1]
పుట్టు పూర్వోత్తరాలు
మార్చుదోశకు, వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉంది. ఆ తరువాత 1130లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి మూడవ సోమేశ్వరుడు రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాసలో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడింది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పుతో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.
తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.
చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (7వ శతాబ్దము) రచనల వలన భారత దేశములో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు. అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉంది. 800 - 1200 మధ్య కాలములో ఇండోనేషియాకు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులూ, అవిరిపెట్టే పద్ధతులతో పాటు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ కచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
ఇడ్డెన అని తెలుగు దేశ్యపదం ఉన్నది. ఇప్పటికీ పల్లెటూరివాళ్ళు ఇడ్డెన, ఇడ్డెన్లు, ఇడ్నీలు అంటుంటారు. పల్లెటూరి వాడుక ప్రకారం ఇడ్నీ క్రమంగా ఇడ్లీ అయి ఉండవచ్చును. నలారానికి లకారం వాడుకలో ఉన్నది. తెనుగు;తెలుగు, మునగ;ములగ, లంజ;నంజ, చాలా;చానా ఇట్లాంటివి కొన్ని చూపవచ్చును. ఈ పద్దతిలో ఇడ్లీ ఏర్పడి ఉండాలి. ఇంతకీ ఇడ్డెన ఎలా ఏర్పడినది అన్న ప్రశ్నకి దువ్వెన, ఈర్చెన, నిచ్చెన, బచ్చెన వంటి పదాలతో ఇడ్డెనకు సామ్యం చూపవచ్చును. దువ్వు+ఎన దువ్వుటకు ఉపయుక్తమైన సాధనమని శబ్దరత్నాకరం అర్థం ఉన్నది. ఉబ్బు=ఉప్పు, ఉప్పు+ఎన= ఉప్పెన, దువ్వు+ఎన=దువ్వెన, వడ్డించు=వడ్డెన, వడ్డి+ఎన=వడ్డెన. కావున ధాతువుల ప్రకారం "ఎన" అనే కృత్ ప్రత్యయం వచ్చి కృదంతరూపం ఏర్పడుతుంది. దువ్వు అనే మాట క్రియ. దువ్వడం అనే పనిని తెలుపుతుంది. దీని మీద సదరు ప్రత్యయం వచ్చి దువ్వెన అయింది. దువ్వే సాధనము అని అర్ధం ఏర్పడింది. ఇట్లానే ఇడ్డెన ఏర్పడుతుంది? ఇడ్డెన అంటే వాసెన కుడుము అని అర్ధం. అనగా ఆవిరి కుడుము ఆని అర్ధమన్నమాట. సారాంశ మేమిటంటే ఇడ్లీ అనేది ఆవిరి గుడ్డమీద పెట్టి (ఇడి) ఉడికించిన పదార్ధం అన్నమాట.
ఇడు అంటే ఉంచు, పెట్టు అన్న అర్ధం. ఇడ్లీ పెట్టారు అంటాము. పెట్టడం (ఇడుట) ఇక్కడ ముఖ్యమన్నమాట. ఆవిరి గుడ్డపై పెడ్డనడినది (ఇడ్డ-) కాబట్టి ఇడు+ఎన అయివుంటుందని భావించవచ్చును. ఊతకోసం ఇడు డకారానికి ద్విత్వం చెప్పుకోవాలి. అప్పుడు ఇడ్డు+ఎన=ఇడ్డెన ఏర్పడుతుంది.
తయారీ
మార్చుఇడ్లీలు ఉడకబెట్టేందుకు ప్రస్తుతం ప్రత్యేక పళ్ళేలు లభ్యమవుతున్నాయి. గతంలో వీటిని ఆవిరిపోకుండా గుడ్డతో మూత కట్టిన పాత్రల్లో (వాసెన) ఉడికించే వారు. పాత్రలో సగం వరకూ నీరు పోసి దాని అంచుకు గట్టిగా ఓ బట్ట కట్టి అందులో ఒకటే ఇడ్లీ పోసి ఉడికించే వారు. తరువాత దానిని ముక్కలుగా కోసి తినేవారు. తమిళనాడులో ఇప్పటికీ చాలామంది పిండిని నేరుగా ప్లేటులో కాకుండా దాని మీద బట్ట వేసి పిండి మిశ్రమాన్ని వేసి ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లి తీసేస్తారు. ఇలా చేయడం వల్ల ప్లేట్లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాల్సిన అవసరం ఉండదు.
పోషక విలువలు
మార్చుఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారం. మధ్యరకం సైజు ఇడ్లీ నుండి సుమారు 50 క్యాలరీలు లభిస్తాయి. ఇందులో 0.2 గ్రా కొవ్వులు, 1.43 గ్రా మాంసకృతులు, 11.48 గ్రా పిండి పదార్థాలు, 1.1 గ్రా పీచు పదార్థాలు, 279 మి.గ్రా సోడియం, 9 మి.గ్రా పొటాషియం, 1 మి.గ్రా ఇనుము లభిస్తాయి. ఇందులో రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలన్నీ దాదాపుగా లభిస్తాయి.
విశేషాలు
మార్చుకంచి దేవరాజ స్వామి ఆలయంలో ఒకటిన్నర కిలో బరువున్న ఇడ్లీ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందుకోసం బియ్యం, మిరియాలు, కొత్తిమీర, అల్లం, ఇంగువ, జీలకర్ర, తగినంత పెరుగు కలిపి మెత్తగా రుబ్బి ఓ పెద్ద ఇడ్లీగా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని రామస్సెరి అనే గ్రామం ఇడ్లీలకు పెట్టింది పేరు. స్పాంజిలా మృదువుగా ఉండే ఈ ఇడ్లీ ఒకటో శతాబ్దం నుంచీ ఒక కుటుంబం ఈ విధానాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికీ కట్టెలపొయ్య మీద బట్ట కట్టిన మట్టి పాత్రలోనే ఇడ్లీని వండుతారు.[2]
ఇవి కూడా చూడండి
మార్చుమూలములు
మార్చు- ↑ http://completewellbeing.com/article/the-light-list/
- ↑ ఈనాడు ఆదివారం, 14 జులై, 2013, పుట 16
- ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)
నోట్సు
మార్చు- K. T. Achaya (May 12, 1994). * Devi, Yamuna (1987). Lord Indian Food: A Historical Companion. Oxford University Press, USA. ISBN 978-0-19-563448-8.Krishna's Cuisine: The Art of Indian Vegetarian Cooking, Dutton. ISBN 0-525-24564-2.
- Farnworth, Edward R. (2003). Handbook of Fermented Functional Foods. CRC Press. ISBN 978-0-8493-1372-1.
- Jaffrey, Madhur (1988). A Taste of India, Atheneum. ISBN 0-689-70726-6.
- Rau, Santha Rama (1969). The Cooking of India, Time-Life Books.
చిత్రమాలిక
మార్చు-
ఇడ్లీలు - (నెయ్యి, కొత్త ఆవకాయ)
-
ఇడ్లీలు - (నెయ్యి, కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి)
-
ఇడ్లీలు - (నెయ్యి,ఇడ్లీ పొడి, అల్లం పచ్చడి)
-
ఇడ్లీ - (నెయ్యి, కొత్త మాగాయ)