ఇస్కా చెంచయ్య
ఇస్కా చెంచయ్య (జ. 1896-మరణం1969) నెల్లూరు జిల్లా, రాపూరుకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు.
జీవితం
మార్చుచెంచయ్య నెల్లూరు జిల్లా, రాపూరులో 1896లో జన్మించాడు. మూడు సంవత్సరములు నిండకముందే తల్లిదండ్రులు చనిపోయారు. మేనమామ సంరక్షణలో గుడూరు చేరి అభ్రకం పనిలో బాలకార్మికుడు అయినాడు. ప్రాథమిక పాఠశాలలో చదువుతూ కుట్టుపని నేర్చుకొని, జీవిక సాగించాడు. దువ్వూరు రామిరెడ్డితో స్నేహం, మద్రాసులో రామకృష్ణ మఠం స్వాములతో పరిచయంవల్ల ఆధ్యాత్మిక జీవనంమీద దృష్టి మరలింది. 1914లో నెల్లూరు సి.ఎ.ఎం. ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తర్వాత బందరు జాతీయ కళాశాలలో చదివాడు. అప్పుడే అనీ బిసెంట్ హోం రూల్ ఉద్యమం మీద ఆసక్తి కలిగింది. స్కౌట్ ఉద్యమంలో తర్ఫీదు పొందాడు. పిఠాపురం రాజాగారి సంస్కరణ భావాలు తనమీద ప్రభావం చూపాయి.
1920లో నాగపూర్ కాంగ్రెస్ సభలకు హాజరయాడు. కొంతకాలం మిలిటరీ అకౌంటు శాఖలో అనేక ప్రదేశాల్లో పనిచేశాడు. 1920 ఫిబ్రవరి 20 న కాకినాడలో రఘుపతి వెంకటరత్నం గారి బాలికల అనాథాశ్రమంలో నాలుగవ ఫారం విద్యార్థిని జానకీదేవిని సంస్కారవివాహ విధానంలో పెళ్ళిచేసుకొని, నెల్లూరులో కాపురం పెట్టాడు. అర్థాంగి ప్రేరణతో మిలిటతీ ఉద్యోగం మానుకొని, జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. 1920లో చతుర్వేదుల కృష్ణ, బొమ్మా శేషురెడ్డి, తదితరులతో కలిసి, జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యాడు. 1921 లో మహాత్ముడు నెల్లూరుకు సమీపంలో పల్లెపాడులో పినాకిని సత్యాగ్రహాశ్రమం ప్రారంభించిన తర్వాత, చెంచయ్య దంపతులు ఆశ్రమ సహాయకులుగా పనిచేశారు. ఆశ్రమంలో దొంగలుపడి, ఆశ్రమవాసులను కొట్టి బాధించిన తర్వాత, చెంచయ్య దంపతులు నెల్లురులో కాంగ్రెస్ ప్రచారకులుగా కొన్నేళ్ళు పనిచేశారు. ఈ దంపతులు 1927లో నెల్లూరు పెద్దగాలివాన తర్వాత అనాథ బాలలకోసం ఏర్పాటయిన అనాథాశ్రమం బాధ్యత తీసుకొన్నారు. జానకీదేవి ఒక ఆడపిల్లను ప్రసవించి చనిపోయింది. ఆ శిశువును అనాథ బాలల ఆశ్రమం సంరక్షించింది.
మిషను మీద బట్టలు కుట్టి జీవిస్తూ చెంచయ్య దేశసేవ, సంఘసేవ చేస్తూన్న సమయంలో మదరాసు వితంతు శరణాలయంలోని హరిజన వితంతు బాలిక కమలమ్మను వివాహం చేసుకొని, నెల్లూరులో సర్వేపల్లి కాలువ గట్టున యానాది సంఘంలో గుడిసె వేసుకొని అక్కడే జీవితాంతం ఉన్నాడు. అప్పటి మాజీ కలెక్టరు భగవంతం వంటివారి ప్రమేయం వల్ల ఈ వివాహం జరిగింది. చెంచయ్యకు టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి కొందరు కాంగ్రెసు పెద్దలు సహయం చేశారు. ఆ తరువాత ఆయన కొన్నాళ్ళు సబర్మతి ఆశ్రమంలో ఉండి వచ్చాడు.
చెంచయ్య నెల్లూరులో జరిగిన విదేశీ వస్త్ర దహన కార్యక్రమంలో, నెల్లూరులో ప్రార్థన సమాజం స్థాపనలో పాల్గొన్నాడు. వేసవిలో భార్యాభర్తలు కలిసి శాంతినికేతన్ దర్శించి, గురుదేవుల వద్ద కొంతకాలం ఉన్నారు. అక్కడే మహాత్మా గాంధీజీని కలిశారు. చెంచయ్య దంపతులు అస్పృశ్యతా నిర్మూలనలో జీవితాంతం కృషి చేశారు. వీరు కొంతకాలం హరిజనవాడలో, తరువాత యానాదుల ఇళ్ళమధ్య గుడిసె వేసుకొని ఉన్నారు. ఈ దంపతులకు వసంతకుమార్ అనే కుమారుడు కలిగాడు. చెంచయ్య 1946 లోనే కుమారుడిని హరిజన్ గా రికార్డ్ చేయించారు. కుమారుడు ఎం.ఎ పాసయి, ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ లో ఎంపిక అయి విద్యాశాఖాధికారి అయిన తరువాత అతడు హరిజనుడు కాదని ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడు. హైకోర్టు అతన్ని మరల ఉద్యోగంలో నియమించింది.
చెంచయ్య దంపతులు వృద్ధాప్యంలో, 1969లో ఏడాదిపాటు నెల్లూరు సమీపంలో, ముత్తుకూరులో ప్రశాంత జీవనం గడిపి కుమారుడి వద్దకు వెళ్ళారు. చెంచయ్య 1969 జులై 7న గుండె నొప్పితో 73వ ఏట ప్రాణాలు విడిచాడు. చెంచయ్య పేర బాపట్లలో 1978 లో ఒక ప్రాథమిక పాఠశాల నెల్కొల్పబడింది. [1][2][3]
మూలాలు
మార్చు- ↑ ఇస్కా వసంతకుమార్ ప్రచురించిన "స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ ఇస్కా చెంచయ్య గారి స్వీయ చరిత్ర", 1978.
- ↑ పెన్న ముచ్చట్లు వ్యాస సంకలనం లోని రెండు వ్యాసాలు, నెల్లూరు బ్రహ్మసమాజానికి ఆద్యుడు ఇస్కా చెంచయ్య, నమ్మిన సిద్ధాంతాలను ఆచరించిన ఇస్కా చెంచయ్య, పల్లవి ప్రచురణ, విజయవాడ, 2014.
- ↑ పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య స్మృతిశకలాలు లో భాగంగా దేశభక్తులు ఇస్కా చెంచయ్య ఆత్మకథ