ఎంవీఎల్. ఎంవీఎల్ పూర్తిపేరు మద్దాలి వెంకట లక్శ్మీనరసింహారావు, కానీ ఆతను ఏంమ్వీయల్ గానే ప్రసిద్ధుడు. బందరు సమీపంలోని గూడూరు సొంతవూరు. బందరు కళాశాలలో బీఏ,. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఏం.ఏ చదివి, ప్రత్యమయశ్రేణిలో పాసయి, 1966లో ధర్మా అప్పారావు నూజివీడు కళాశాలలో తెలుగుశాఖ అధిపతిగా ఉద్యోగజీవితం ప్రారంభించి, చివరి వరకు అక్కడే పనిచేశాడు. ఆకర్షణీయమైన రూపం, మంచి కంఠం, గొప్ప ఉపన్యాసకునికి ఉండవలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. వృత్తిని, ప్రవృత్తిని సమానంగా ప్రేమించాడు. 1967లో వరలక్ష్మితో వివివాహం అయింది. కుమారుడు, కుమార్తె.

ఏంమ్వీయల్ కవి, రచయిత, జర్నలిస్ట్, నవలాకారుడు, కథకుడు కూడా. వివిధ వార్తాపత్రికల్లో ఆతను రాసిన 18 కథలు లభించాయి. "మలుపు. మెరుపు", "నిన్నటి స్వప్నం నేటి సత్యం" నవలలు రాసాడు. మొదటి నవలలో కళాశాలలో రాజకీయాలను ఇతివృత్తంగా స్వీకరించాడు. "ఉడుగర","వయోలిన్" అతని కవితా సంకలనాలు. కానుక, కవితాహారతి పరిశోధన గ్రంథాలు. అతని రచనల్లో భావుకత, సామజిక ప్రయోజనం, వ్యగ్యం, హాస్యం మిళితమై వుంటాయి. విద్యార్థిగా ఉన్న రోజుల్లో నార్ల చిరంజీవి ప్రభావం తనమీద ఉంది. శాండిల్య, తదితర నక్షత్ర సప్తకం మిత్రులతో కలిసి 'నవత' సాహిత్య పత్రిక నిర్వహించడంలో సహకరించాడు. తాను శ్రీ శ్రీ అభిమాని, శ్రీ శ్రీ ఇతరుల కవితా సంకలనాలకు రాసిన పరిచయాలను "వ్యూలు, రెవ్యూలు" పేరుతొ విద్యార్థిగా ఉండగానే అచ్చువేశాడు. తెలుగు అకాడమి ప్రచురించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, పాండురంగ మాహాత్మ్యానికి సంపాదకుడుగా వ్యవహరించి ముందుమాటలు రాశాడు. యువజ్యోతి నిర్వహించి యువజనుల అభిమానాన్ని సంపాదించుకొని, యువతలో కవితాభిరుచి కలిగించాడు. యువజ్యోతి శీర్షికలో యువత వేసే ప్రశ్నలకు హాస్యం, పన్, వ్యగ్యం రంగరించి సమాధానాలిచ్చేవాడు.

ఏంమ్వీయల్ గొప్పవక్త. ఆధునిక కవుల రచనలను పరిచయం చేసినా, ప్రాచీన ప్రబంధాలమీద ఉపన్యసించినా శ్రోతలను ఆకట్టుకొనేవాడు. యువకవులు అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేన్, వసీరా వంటి కవులను పరిచయం చేసాడు. ఏంమ్వీయల్ బాపు, రమణల ఏకలవ్య శిష్యుడు, ముత్యాలముగ్గు ఏంమ్వీయల్ నిర్మాతగా, బాపు దర్శకత్వంలో గొప్ప కళాత్మక చిత్రంగా పేరు తెచ్చుకొని, ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారం పొందింది. స్నేహం, గోరంతదీపం, ఓ ఇంటి భారతం సినిమాలకు మాటలు రాసాడు. సినీ గాయకుడు బాలు, బాపు, రమణలకు గొప్ప మిత్రుడు. ఏంమ్వీయల్ చతుర సంభాషణ ప్రియుడు. ఆతను ఎక్కడ వున్నా అతని చుట్టూ అభిమానులు మూగివుండేవారు. క్రమంగా నిండు చంద్రబిబం లాంటి తను ఒక్కొక్క కళ తరిగిపోయే చంద్రుడులా క్షీణించి, 23-01-1986లో అకాల మరణం పొందాడు.

ఆకరాలు:1.ఏంమ్వీయల్ రచనలు, 2. ఆంధ్రజ్యోతి, ఇతర తెలుగు వార్తాపత్రికలలో తన రచనలు, 3. తెలుగు అకాడమి ఏంమ్వీయల్ సంపాదకుడుగా అచ్చువేసిన పుస్తకాలు.4.ఏంమ్వీయల్ మీద అనేక తెలుగు పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, 5.ఏంమ్వీయల్ శ్రీమతి, కుమారుడు స్వర్గీయ రాంప్రసాద్, బంధువు శ్రీమతి వసంత తెలియజేసిన వివరాలు, ఎం.ఏలో ఏంమ్వీయల్ సహా విద్యార్థిగా, మిత్రుడుగా ఈ రచయతకు తెలిసిన వివరాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎంవీఎల్&oldid=4371557" నుండి వెలికితీశారు