ఎన్.ఎస్.ప్రకాశరావు
ఎన్.ఎస్.ప్రకాశరావు ప్రముఖ కథా రచయిత. 18-12-1947లో విశాఖపట్టణం లో జన్మించాడు. అతి స్వల్ప కాలం జీవించి, ఈయన 1973 లో మరణించాడు. ఈయన విద్య మొత్తం విశాఖపట్టణంలోనే గడచింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు. ఈయన కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి ల రచనలు చదివి, వారి ప్రేరణతో కథలు రాయడం మొదలు పెట్టాడు. కెమికల్ ఇంజనీరింగ్ లో పీ.హెచ్.డి చేస్తూనే పలు పత్రికలకు కథలు పంపుతుండేవాడు.
రచనలు
మార్చుఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, విరసం లాంటి పలు పత్రికలలో అనేక కథలు ప్రచురితమైనవి. ఎన్నెస్ కథలు పేరుతో కథా సంపుటం వెలువడింది.
ఎన్నెస్ కథలు
మార్చుఈ కథా సంపుటిలో 14 కథలున్నాయి. ఇవి రచయిత తన ఆదర్శాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన కథలు. ఈ సంపుటిలో
- మనిషీ - మహిషీ,
- పేపర్ టైగర్,
- రగులుతున్న రాక్షసిబొగ్గు,
- పగ,
- దరమ పెబువులు,
- దేవుడు చేసిన మేలు,
- దేవుడి నిజాయితీ,
- మంచి,
- సోల్‌మెండర్,
- మొదటి రాత్రి,
- ఫ్రెండ్స్ మొదలైన కథలున్నాయి.
వ్యాసాలు
మార్చు- విద్యావిధానం మారాలి
- విప్లవ కథకుల సమస్యలు
- తెలుగు కథ ఇటీవలి ధోరణులు
- కథాశకలాలు
విశేషాలు
మార్చు- విశాఖ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యుడుగానూ, కొన్నేళ్ళు కార్యదర్శిగానూ పనిచేసాడు.
- విరసం పుట్టినప్పటినుండి అందులో క్రియాశీలకంగా పనిచేస్తూ నిబద్దతతో ఉండేవాడు.
- వివాహం జరిగిన మూడు నెలల్లోనే ప్రమాదానికి గురియై మరణించాడు
- ఈయన గురించి నిషారా పేరుతో రావిశాస్త్రి రాసిన గేయం 6-7-1973 న ఆంధ్రజ్యోతి వారపత్రికలోనూ, 15-8-1973 న ప్రజా సమస్యల లోనూ, జూలై 1973 న సృజన వారపత్రిక లోనూ ప్రచురితమైంది.
వాటిలో కొన్ని వాఖ్యాలు
నువ్వులేవు
నవ్వులు చిందించేవు
పువ్వులు అందించావు
కదలెన్నో పండించావు
కలలెన్నో సృష్టించావు
మెరుపులు మెరిపించావు
ఆశలు చిగురించావు
మెరుపులా మాయమయ్యావు
- ఈయన కథల్లో పేపర్ టైగర్ నుండి చిన్న ముక్క :
నరసింహంగారింటికి రికమండేషన్తో బయలుదేరిన వరప్రసాద్ దారిలో కొట్టిన వర్షానికి తడిసి అతుక్కుపోయిన చొక్కాతో, ఎత్తుగా దువ్విన జుట్టు అణగారిపోయి నూనె, నీళ్ళతో కలసి ముఖమంతా జిడ్డులా తయరైతే నరసింహం గారింటి వరండాలోకొచ్చిన అతడు రుమాలుతో తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో చేతులు, తుడుచుకోవాలో తేల్చుకోలేకపోతూ కాలింగ్ బెల్లు కొడతాడు.
తలుపు తియ్యగానే చానమచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్కపలుచనివాడైన ప్రసాదు కనిపిస్తాడు. అతని రూపురేఖా విలాసాలు చూసి, లోనికి రమ్మనాలో బయటుండమనాలో తేల్చుకోలేక నిల్చున్న నరసింహం గారికి లెటరందిస్తాడు.
స్వతహాగా నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో మంచి ప్రాక్టీసు ఉంది. ఆయన తన మనవడితో ఆడుకుంటూ ఎంతగా బోసినవ్వులు చిందిస్తాడో, అప్పుడే పని కుర్రాడితో అంతకటువుగానూ మాట్లాడుతాడు. తన క్లయింట్లతో ఎంత మృదువుగా మాట్లాడతాడో తన రైతులతో అంత కర్కశంగా మాట్లాడుతాడు. ఆయా సంధర్భాలకు తగినట్టుగా గంభీరంగా, ప్రసన్నంగా లేదా ప్రసన్న గంభీరంగా, గంభీర ప్రసన్నంగా మార్చుకుంటుంటాడు. అయినప్పటికీ వరప్రసాద్ అవతారం వలన తెలియకుండానే ఆయనకు అలవాటుకాని అయోమయపు రంగు వచ్చింది.