ఎలక్ట్రానిక్ చిప్

మనిషికి మెదడు ఎంత అవసరమో కంప్యూటర్ కి చిప్ కూడా అంతే ముఖ్యం. చిప్ నే మైక్రోప్రాసెసర్ లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా అంటారు. అంగుళం కంటే తక్కువ పొడవు, వెడల్పు ఉండే సిలికాన్ రేకు మీద ట్రాన్సిస్టర్లను నిక్షిప్తం చేసి, వాటిని అనుసంధానించడం ద్వారా చిప్ ను తయారుచేస్తారు. కంప్యూటర్ని ఆన్ చేసిన తర్వాత మనం ఇచ్చే ఆదేశాల్ని క్రమబద్దీకరించి పూర్తిచేయటమంతా చిప్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. చిప్ లో ఉండే అరిథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమొరీ యూనిట్ అనే మూడు విభాగాల ద్వారా ఈ పని జరుగుతుంది. చిప్ సామర్థ్యం దాని పైన ఉండే ట్రాన్సిస్టర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. ప్రతీ ట్రాన్సిస్టర్ ఒక ఎలక్ట్రికల్ స్విచ్ లాంటిది. దానిని ఆన్ చేసినప్పుడు 1 అనీ, ఆఫ్ చేసినప్పుడు 0 అనీ చిప్ గుర్తిస్తుంది. దీని ద్వారానే కంప్యూటర్ కార్యకలాపాలు నడుస్తాయి. చిప్ పైన ట్రాన్సిస్టర్ ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ సామర్థ్యంతో పని చేస్తుంది. కంప్యూటర్ సామర్థ్యం కూడా అందుకు అనుగుణంగా ఉంటుంది.


మూలాలు:


 అమెరికాలో బెల్ లాబొరేటరీలోని ఇంజనీర్లు 1947 లో తొలిసారిగా ట్రాన్సిస్టర్ ని రూపొందించి విజయవంతంగా ప్రదర్శించారు. 

1958లో టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ కు చెందిన ఇంజనీర్ జాక్ కిల్బీ మొట్టమొదటి చిప్ నమూనాని తయారు చేశారు. ఈ పరికరం ప్రయోగశాల నుండి మార్కెట్ లోకి రావటానికి మరో 13 సంవత్సరాలు పట్టింది. ఇంటెల్ కంపెనీ 1971లో 4004 పేరుతో తొలి మైక్రోప్రాసెసర్ ని తయారుచేసింది. 2,300 ట్రాన్సిస్టర్లు కలిగిన ఈ చిప్ సెకనుకు 60,000 లెక్కలు చేసేది. అయితే దీని తర్వాత వచ్చిన 8080తోనే పీసీలో చిప్ ఏర్పాటు సాధ్యమైంది. దాని తర్వాతిదైన 8088 మార్కెట్ లో సంచలనం సృష్టించింది. తదనంతర కాలంలో పెంటియం సిరీస్ లో వచ్చిన చిప్ లు యావత్ పీసీ ప్రపంచాన్ని శరవేగంగా ముందుకు నడిపాయి. పెంటియం4 4 ఐదు కోట్లకు పైగా ట్రాన్సిస్టర్లతో తొలితరం 8088 కన్నా ఐదు వేల రెట్లు ఎక్కువ వేగంతో పని చేస్తుంది.