ఏకస్వామ్యపు పోటీ
ఆర్థిక వ్యవస్థలో ఉండే పోటీ మార్కెట్ వ్యవస్థలలో ఒకటి ఏకస్వామ్యపు పోటీ (Monopolistic Competition). ఈ మార్కెట్‌లో ఉత్పత్తిదారులు, ఉత్పత్తిచేయు వస్తువులు ఒకదానికొకటి సన్నిహితంగా ఉంటాయి. ఈ వస్తువులు ఒకదానికొకటి ప్రత్యమ్నాయాలుగా కూడా వాడవచ్చు. కాబట్టి సహజంగానే ఉద్యమదారుల మధ్య పోటీ అధికంగా ఉంటుంది. ఏకస్వామ్యంలో మాదిరిగా వస్తువైవిధ్యం ఉండక ఒకదానికొకటి ప్రత్యమ్నాయాలుగా వాదుకొనే వీలుంది కాబట్టి ఈ మార్కెట్‌ను ఏకస్వామ్యపు పోటీ అంటారు. ఏకస్వామ్యంలో అసలే పోటీ ఉండదు కాని ఇక్కడ పోటీ అనేదే ప్రధాన లక్షణం. పోటీ అనేది కేవలం వస్తు ఉత్పత్తిలోనే కాకుండా ధర నిర్ణయంలోనూ కనిపిస్తుంది.
ఏకస్వామ్యపు పోటీ లక్షణాలు
మార్చు- 1. వస్తు వైవిధ్యము
వస్తు వైవిధ్యమే ఏకస్వామ్యపోటీ యొక్క ప్రధాన లక్షణం. వస్తువైవిధ్యం లేకున్నచో అది సంపూర్ణ పోటీకి దారితీస్తుంది. ప్రముఖ ఆర్థికవేత్త ఇ.హెచ్.చాంబర్లీన్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పాడు. వస్తువు నాణ్యతలోనే కాకుండా పేరు, రంగు మున్నగువాటిలో కూడా వైవిధ్యం కనిపిస్తుంది. ప్రతి ఉద్యమదారుడు కూడా వస్తువైవిధ్యం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ మార్కెట్‌లో ఉత్పత్తి చేయబడే వస్తువులు వస్తువైవిధ్యం కలిగి ఒకదానికొకటి ప్రత్యమ్నాయాలుగా ఉంటాయి కాని సజాతీయంకావు. కాబట్టి ఈ వస్తువుల అంధ్య జాత్యాంతరడిమాండు వ్యాకోచత్వం అధికంగా ఉంటుంది.
- 2. ప్రకటనలు
ఈ మార్కెట్‌లో ప్రకటనలు ముఖ్యపాత్ర వహిస్తాయి. అనేక సంస్థలు ఉండి అవి తయారుచేసే వస్తువులు ఒకదానికొకటి వాడడానికి ప్రత్యమ్నాయాలుగా ఉండుటచే ప్రతి ఉద్యమదారుడు వినియోగదారులను ఆకర్షించడానికి ప్రకటనలపై అధికమొత్తంలో ఖర్చు చేస్తాడు.
- 3. కొత్త సంస్థల ప్రవేశానికి స్వేచ్ఛ
ఏకస్వామ్య మార్కెట్‌లో వలె కాకుండా ఏకస్వామ్యపు పోటీలో కొత్త సంస్థలు ప్రవేశించడానికి ఎటువంటి ప్రతిబంధకం ఉండదు. మార్కెట్‌లో డిమాండు బాగా ఉన్న ఉత్పత్తులకు కొద్ది మార్పులతో ఉత్పత్తి చేయడానికి కొత్త కొత్త సంస్థలు ప్రారంభమవుతుంటాయి. సంస్థలు అధికమయ్యే కొద్దీ మార్కెట్‌లో పోటీ కూడా అధికమౌతుంది.
- 4. తక్కువ సంఖ్యలో సంస్థలు
సంపూర్ణపోటీతో పోలిస్తా ఈ మార్కెట్ వ్యవస్థలో సంస్థల సంఖ్య తక్కువగానే ఉంటుంది. వస్తువులు ప్రత్యమ్నాయాలుగా ఉంటాయి కాబట్టి ధర నిర్ణయంలో పోటీ అధికంగా ఉండి నష్టపోయే సంస్థలు బయటకు వెళ్ళిపోతాయి. ధర నిర్ణయంలో ఎవరికి వారే నిర్ణయం తీసుకున్ననూ మిగితా సంస్థల ప్రభావం చాలా ఉంటుంది.
- 5. డిమాండు రేఖ కిందికి వాలి ఉండుట
ఈ మార్కెట్ వ్యవస్థలో ధర పోటీ చాలా ఉంటుంది కాబట్టి డిమాండు రేఖ ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది. అంటే ధర తగ్గినప్పుడు డిమాండు పెరుగుతుంది. ఇందులో సగటు రాబడి రేఖనే డిమాండు రేఖగా పనిచేస్తుంది కాబట్టి ఉపాంత రాబడి రేఖ అంతకంటే క్రిందుగా ఉంటుంది. ధర నిర్ణయంలో కూడా డిమాండు రేఖ (సగటు రాబడి రేఖ) నిర్ణయాత్మక పాత్ర వహిస్తుంది.
ఏకస్వామ్యపు పోటీలో ధర, వస్తూత్పత్తి నిర్ణయం
మార్చుఏకస్వామ్య పోటీలో వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు ఒకదానికొకటి సన్నిహితంగా ఉంటాయి కాని పూర్తిగా పూరక వస్తువులు కావు. కాబట్టి ధర వివిధ సంస్థలలో వేర్వేరుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక సంస్థ ధర మరో సంస్థ ధరను ప్రభావితం చేయగలుగుతుంది. కాబట్టి పరిశ్రమ మొత్తానికి ధర నిర్ణయం చేయడం కష్టం. ధర నిర్ణయానికి క్రింది ప్రమేయాల ఆధారంగా చేయవచ్చు.
- ప్రమేయాలు
- ఇతర సంస్థలు చర్యలేమీ తీసుకోనట్లు భావించి సంస్థ ధర, ఉత్పత్తి నిర్ణయాలను తీసుకుంటుంది.
- ధర మార్చినందువల్ల వస్తువు యొక్క విక్రయాన్ని సంస్థ మార్చగలుగుతుంది.
- సంస్థ యొక్క డిమాండు, వ్యయ రేఖలు అన్ని సంస్థలకు సమానంగా ఉంటుంది.
- సంస్థ సమతౌల్యస్థితికి చేరుకుంటుంది.
స్వల్పకాలంలో సంస్థ సమతౌల్యం
మార్చుస్వల్ప కాలంలో సంస్థ స్థిరమూలధనం మారదు. కేవలం చర మూలధనాన్ని మార్చి ఉత్పత్తిని అధికం చేయగలుగుతుంది. స్వల్ప కాలంలో కొత్త సంస్థలు పరిశ్రమలో ప్రవేశించడానికి ఆసక్తి చూపవు. కాబట్టి పరిశ్రమలో సంస్థల సంఖ్యలో పెద్ద మార్పు ఉండదు. ఉపాంత రాబడి, ఉపాంత వ్యయంకు సమానమయ్యేవరకు ఉత్పత్తిని కొనసాగిస్తుంది. అప్పుడే సంస్థలు అధిక లాభాలు వస్తాయి. డిమాండు రేఖ (సగటు రాబడి) కిందికి వాలి ఉండుట వలన, ఉపాంత రాబడి రేఖ అంతకంటే కిందికి వాలి ఉంటుంది. కాబట్టి ఉపాంత రాబడి, సగటు రాబడి సమానమయ్యేదాని కంటే అధిక ఉత్పత్తి చేయుట వలన సంస్థకు లాభాలు తగ్గిపోతాయి.
దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యం
మార్చుదీర్ఘకాలంలో స్థిరమూలధనాన్ని కూడా మార్చి సంస్థలు ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకొనే వీలు ఉంటుంది. కాబట్టి ధరను తగ్గించి ఎక్కువ ఉత్పత్తిని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాయి. కొత్త సంస్థలు పరిశ్రమలో ప్రవేశించడానికి వీలు లేనప్పుడు ఉన్న సంస్థలు లాభాలు ఆర్జిస్తాయి. కాని కొత్త సంస్థలు ప్రవేశించే వీలున్నప్పుడు సామాన్య లాభాలు మాత్రమే ఆర్జిస్తాయి. ఉత్పత్తి నిర్ణయం మాత్రం ఉపాంత రాబడి, ఉపాంత వ్యయం రేఖలు కలుసుకొనే బిందువు వద్ద జరుగుతుంది.