కనకధారా స్తోత్రం

వ్యసవివరణ

వికీసోర్స్‌లో కనకథారా స్తవం పూర్తి పాఠం, అర్ధం చదువవచ్చును.

రంగాపురం దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీ దేవి ప్రతిమ

కనకథారా స్తోత్రం లేదా కనకథారా స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మీ దేవిని కీర్తిస్తూ ఆది శంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. సకలసంపత్ప్రదాయకమని ఈ స్తోత్రం పారాయణ పట్ల భక్తులకు విశ్వాసం ఉండడం వలన, ఈ స్తోత్రంలోని పద, భావ సౌందర్యం వలన అత్యంత ప్రాచుర్యం కలిగిన లక్ష్మీదేవి ప్రార్థనలలో ఇది ఒకటి. ఈ స్తోత్రం మార్కెట్లో అనేక అడియో సి.డి.లు, క్యాసెట్టులు ద్వారా లభిస్తుంది.


ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి బిక్షకు వెళ్ళారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహారపదార్ధాలు లేవు. ఇంటి ఇల్లాలు నిరు పేదరాలు. ఆమెకి కట్టుకోడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన ఆమెకి ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటునుండే ఉసిరికాయను శంకరునికి సమర్పించింది. పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకథారాస్తవము చెప్పగా ఆ పేదరాలి యింట బంగారు ఉసిరికాయలు వర్షించాయి.


సంప్రదాయం ప్రకారం సాధారణంగా అన్ని ప్రార్థనల, స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని భక్తితో, నియమ నిష్ఠలతో పారాయణం చేయాలి. ఫలితాన్ని ఆశించినవారు సాధారణంగా పెద్దల సలహాను తీసికొని, రోజుకు ఇన్నిమార్లు, ఇన్ని రోజులు అని పారాయణ చేస్తారు. స్తోత్రానికి ముందుగా ప్రార్థన, పూజ వంటి కార్యక్రమాలు, స్తోత్రం అనంతరం నైవేద్యం, హారతి, తీర్ధ ప్రసాద వితరణ వంటి ఉపచారాలు చేస్తారు. దేవాలయాలలో అర్చనలో కూడా ఈ స్తోత్రాన్ని పఠిస్తారు.

ఉదాహరణ శ్లోకాలు

మార్చు

మొత్తం స్తోత్రంలో 25 శ్లోకాలున్నాయి. ఇందులో మొదటిది ("అమందానంద...") హయగ్రీవ స్తోత్రం. చివరిది ("సువర్ణ ధారా...) ఫలశ్రుతి. ఈ రెంటినీ మినహాయిస్తే 23 శ్లోకాలు. వివిధ శ్లోకాలలో స్వల్పంగా పాఠాంతరాలున్నాయి. ఉదాహరణగా మూడు శ్లోకాలు క్రింద ఇవ్వబడ్డాయి.


అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥

నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై
నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై ।
నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో౭స్తు దామోదర వల్లభాయై ॥

సరసిజ నయనే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥

స్తోత్రం సంక్షిప్త భావం

మార్చు

స్తోత్రంలోని వివిధ శ్లోకాల సంక్షిప్త భావం ఇక్కడ ఇవ్వబడింది. (వివరమైన అర్ధం కోసం వికీసోర్స్ చూడండి.)


  1. (వందే వందారు...)—భక్తుల కోర్కెలు తీర్చేవాడు, లక్ష్మీదేవికి ఆనందము కూర్చువాడు, జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన హయగ్రీవునికి వందనము.


  1. (అంగం హరే: పులక భూషణం ...)—నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టివేసిన మంగళమూర్తి, సకలసిద్ధిస్వరూపిణి అయిన శ్రీలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించును గాక !


  1. (ముగ్ధా ముహుర్విదధతీ .. )—కమలము చుట్టు పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !


  1. (విశ్వామరేంద్ర ...)—దేవేంద్ర పదవిని సైతము ప్రసాదింపగలిగిన, ఎల్ల ఆనందములకును మూలమైన, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపగల శ్రీ మహాలక్ష్మీ మాత నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !


  1. (కాలాంబుదాళి...)—విష్ణుమూర్తి నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !


  1. (బాహ్యాంతరే మురజిత: ...) శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలము లోని కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడా ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !


  1. (ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ...) శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు మన్మధునకు స్థానము కల్పించిన లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !


  1. (దద్యాద్ దయానుపవనో ...)—లక్ష్మీదేవి చల్లని చూపులు ఈ దరిద్రుడనెడి విచారగ్రస్తునిపై దయతో వాలి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !


  1. (ఇష్టా విశిష్ట మతయో౭పి ...)—ఆ తల్లి కరుణార్ద్ర దృష్టి వలన ఆశ్రితులైన పండితులకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !


  1. (గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ...)—విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమ.


  1. (శ్రుత్యై నమో౭స్తు ...)—శుభముల నొసంగు వేదమాతృ రూపురాలైన లక్ష్మీదేవికి, ఆనందగుణ సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు, నూర దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి, విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.


  1. (నమో౭స్తు నాళీక నిభాననాయై ...)—పద్మము వంటి ముఖము గలిగినది, పాల కడలిలో జన్మించినది, అమృతమునకును చంద్రునికిని తోబుట్టువైనది, నారాయణునకు ప్రేమాస్పదురాలైనది అయిన లోకమాతకు దండములు.


  1. (నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై ...)—బంగారు పద్మముపై ఆసీనయైనది, సమస్త భూమండలమునకు నాయిక అయినది, దేవాదులకు దయ జూపునది, శార్ఞ్గమను ధనుస్సును ధరించిన విష్ణుమూర్తికి ప్రియముకూర్చునది అయిన శ్రీ కమలాదేవికి దండములు.


  1. (నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై ...)—భృగుమహర్షి బిడ్డయైనది, విష్ణువు వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు దామోదరప్రియాదేవికి నమస్కారము.


  1. (నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై ...)—కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి, సకల భువనములకు తల్లియైనది, దేవాదులచే పూజింపఁబడునది, నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని ప్రేమను చూరగొన్నదియగు శ్రీదేవికి దండములు.


  1. (సంపత్కరాణి ...)—తల్లీ! మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను, సుఖములను గలిగించునవి.సామ్రాజ్యమును సైతము ప్రసాదింప జాలినవి. పాపములను హరించునవి. అవి నన్నెల్లప్పుడును వీడకుండును గాక !


  1. (యత్కటాక్ష సముపాసనా విధి: ..)—హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.


  1. (సరసిజ నయనే సరోజ హస్తే ...)—కమలములవంటి కన్నులు గలది, కమలములు చేత ధరించినది, తెల్లని వలువలు, గంధము, పూలమాలలతో ప్రకాశించునది, సౌందర్యమూర్తి అయిన శ్రీమహాలక్ష్మీ! నీవు ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానవు. హే భగవతీ ! హరివల్లభా! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !


  1. (దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట ...)—జననీ! సకలలోకాధినాధునకు గృహిణీ! క్షీర సముద్రరాజ పుత్రీ! దిగ్గజముల భార్యలు (అడు యేనుగులు) బంగారు కలశముల యందు పట్టి తెచ్చిన ఆకాశగంగ విమల జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననీ! శ్రీశ్రీ మహాలక్ష్మీ! నీకు ప్రాతఃకాలములో నమస్కరిస్తున్నాను.


  1. (కమలే కమలాక్ష వల్లభే ... )—అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటే ముందు నేనే పాత్రుడనగుదును. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల)తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !


  1. (బిల్వాటవీ మధ్య లసత్సరోజే ...)—మారేడు చెట్ల తోట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.


  1. (కమలాసన పాణినా ...)—ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా! తల్లీ! శ్రీ మహాలక్ష్మీ !


  1. (అంభోరుహం జన్మగృహం భవత్యా: ...)—హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగా జేసికొనుము.


  1. (స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం ...)—వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను ఈ స్తోత్రము ద్వారా సేవింతురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటే అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.


  1. ఫలశ్రుతి: (సువర్ణ ధారా స్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితమ్ త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్) - ఆదిశంకరులు కూర్చిన ఈ కనకథారా స్తవమును దినమునకు మూడు సంధ్యలలో పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

మూలాలు, వనరులు

మార్చు


బయటి లింకులు

మార్చు