కన్నెగంటి నాసరయ్య

కన్నెగంటి నాసరయ్య గుంటూరు జిల్లా తెనాలిలో 1924లో ఒక సామాన్య కర్షక కుటుంబములో జన్మించాడు.[1]

గ్రామములో విద్యాభాసము తదుపరి కర్షక క్షేత్రము నుండి కళాక్షేత్రము వైపు దృష్టి మరల్చాడు.1942లో నేతాజీ నాట్యమండలి స్థాపించాడు. జాతీయ నాయకుల చరిత్ర యక్షగానాలుగా మలచి వేలకొలది బుర్రకథలుగా చెప్పాడు. నాసరయ్య బుర్రకథలు ప్రజలను చైతన్య పరచి స్వాతంత్ర్య సమరోన్ముఖులను చేశాయి. స్వాతంత్ర్యానంతరం 'జనతా ఆర్ట్ థియేటర్' స్థాపించి సామాజిక సమస్యలను ప్రతిబింబించే "ఇదా ప్రపంచం", "పరివర్తన", "భయం", "భలేపెళ్ళి", "ఉలిపికట్టె", "చీకటితెరలు" మున్నగు నాటికలను తెలుగు దేశమంతటా ప్రదర్శించాడు. 'భయం' వందల ప్రదర్శనలకు నోచుకుంది. నాసరయ్య కృషి, ప్రజ్ఞాపాటవాలు 'తెనాలి పట్టణం సాంస్కృతిక కెంద్రం' అనే నానుడిని సార్ధకం చేశాయి. ఆరు పదులు పైబడిన కళాప్రస్థానములో ఎందరో నటీనటులను తీర్చిదిద్ది రంగస్థలానికి పరిచరయం చేశాడు. ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందినా నాసరయ్య నిగర్వి, నిరాడంబరుడు, పరిపూర్ణకళాకారుడు. 2004 సంవత్సరములో 'సేవామూర్తి' పురస్కారము అందుకున్నాడు.

మూలాలు మార్చు

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 141