కపర్దీ యం.వి.యన్.
మందలపర్తి వెంకటనారాయణ (యం.వి.యన్.) కపర్దీ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు; కార్మిక నేత (ట్రేడ్ యూనియనిస్ట్), మంచి వక్త, భాషాసాహిత్యాల్లో అభినివేశం ఉన్న సునిశిత మేధావి, కొంతకాలం పత్రికా రచయిత కూడా. 1923, అగస్ట్ 30న కపర్దీ ఆనాటి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు ప్రాంతంలోని పెద నిండ్రకొలను గ్రామంలో పుట్టి, 15 సంవత్సరాలు వచ్చేవరకూ అక్కడే పెరిగారు.
మందలపర్తి వెంకటనారాయణ కపర్దీ | |
---|---|
జననం | ఆగస్టు 30, 1923 పెద నిండ్రకొలను, పశ్చిమ గోదావరి జిల్లా |
మరణం | మే 25, 1981 హైదరాబాదు, తెలంగాణ |
ఇతర పేర్లు | కపర్దీ యం.వి.యన్. |
వృత్తి | ట్రేడ్ యూనియనిస్ట్. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి (1973 నుండి 1981 లో మరణించే వరకు) |
పిల్లలు | రామచంద్ర రావు, శ్రీపతి, నారాయణ మూర్తి, బాబూరావు, జగన్, కిషోర్, మహాలక్ష్మి (అమ్మాజీ), విమలాదేవి( వాణి) |
కుటుంబం | శేషమ్మ (భార్య) |
తండ్రి | రామచంద్ర రావు |
తల్లి | శేషమ్మ |
చదువు
మార్చు1938లో చేబ్రోలు హైస్కూల్ నుంచి ఎస్సెస్సెల్సీ పరీక్ష ఉన్నత శ్రేణిలో పాసయ్యారు; స్వర్ణ పతకం కూడా పొందారు. 1940లో గుంటూరు ఏసీ కాలేజీ నుంచి ఇంటెర్మీడియేట్ పరీక్ష ఉన్నత శ్రేణిలో పాసయ్యారు; స్వర్ణ పతకం పొందారు. 1942లో బీయెస్సీ పరీక్ష రాయవలసివున్న కపర్దీపై అరెస్టు వారెంట్ రావడంతో ఆయన చదువును అర్ధాంతరంగా ముగించవలసి వచ్చింది.
కపర్దీ దాదాపు నాలుగు దశాబ్దాలు ప్రజాజీవనం గడిపారు. ఎన్నెన్నో ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించారు. నాలుగేళ్ళు జైలు జీవితం అనుభవించారు.
1981 మే 25న, 57వ యేట, హైదరాబాదులో కన్నుమూశారు.
నేపథ్యం
మార్చుకపర్దీ తండ్రి రామచంద్రరావు (1885-1942) సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా, గ్రామ కరణం పదవికి రాజీనామా చేసి చరిత్ర సృష్టించారు. కపర్దీ తల్లి శేషమ్మ (1890-1982) వెయ్యి పున్నములు పైగా దర్శించిన పరిపూర్ణ ఆయుష్మంతురాలు.
కపర్దీ తండ్రి రామచంద్రరావు జాతీయభావాలు కలిగిన వ్యక్తిగా జిల్లాలో ప్రసిద్ధుడు. ఆయనపై, "లోక్ మాన్య" బాల్ గంగాధర్ తిలక్ ప్రభావం ప్రగాఢంగా ఉండేది. అదే ప్రభావం కపర్దీ వ్యక్తిత్వంపై కూడా మొదట్లో ప్రసరించింది. తిలక్ రాసిన "గీతా రహస్య" పుస్తకాన్ని చిన్ననాటనే చదివిన కపర్దీ దానిపై మక్కువ పెంచుకున్నారు.
తండ్రి ప్రోత్సాహం మీదనే, సంస్కృత సాహిత్యంలోని ప్రామాణిక రచనలు అధ్యయనం చెయ్యడం చిన్ననాటనే మొదలు పెట్టారు కపర్దీ; ఈ అధ్యయనం ప్రభావంలోనే ఆయన ధర్మనిష్ఠ నుంచి సత్యశోధన దిశగా మళ్ళారు. ఈ క్రమం గుంటురు లోని ఏ.సీ.కాలేజీలో చదివే రోజుల్లో ఉచ్ఛ దశకు చేరింది. అక్కడే, కపర్దీకి వామపక్ష సాహిత్యంతో తొలిపరిచయం ఏర్పడింది. దాదాపు అదే రోజుల్లో, జార్జి బెర్నార్డ్ షా, జవాహర్లాల్ నెహ్రూ లాంటివారి రచనలను కూడా కపర్దీ చదివారు. వామపక్ష-ప్రజాస్వామ్య వాదిగా ఆయన రూపుదిద్దుకోవడానికి ఆ దశలో పడిన ప్రభావాలే పునాది.
కుటుంబం
మార్చు1941లో కపర్దీ తన మేనమామ బొమ్మకంటి సూర్యనారాయణమూర్తి పెద్ద కుమార్తె శేషమ్మ (1926-1982)ను పెళ్ళాడారు. కపర్దీ-శేషమ్మ జంట బంధుమిత్రులను ఆదరించడానికి ప్రసిద్ధులు. వారికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. శేషమ్మ కూడ రెండున్నర దశాబ్దాల కాలం ప్రజాజీవనంలో ప్రత్యక్షంగా పాల్గొంది.
ఉద్యమ జీవనం
మార్చు1942లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా ఉద్యమ జీవనం మొదలుపెట్టారు కపర్దీ. అదే సంవత్సరం "కొల్లేరు అన్సర్వే భూముల పోరాటా"నికి - ఇందుకూరి సుబ్బరాజు, దూసనపూడి విరాటరాజులతో కలిసి - కపర్దీ నాయకత్వం వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురినీ కొల్లేరు ప్రాంతంలో అడుగుపెట్టడానికి వీల్లేదని నిషేధిస్తూ, "ఎక్స్టెర్నుమెంటు ఆర్డరు" జారీ చేసింది. దాంతో, తాడేపల్లిగూడేన్ని కపర్దీ తన కార్యాచరణకు కేంద్రంగా మార్చుకున్నారు. 1973 వరకూ కపర్దీ కుటుంబం తాడేపల్లిగూడెంలోనే నివసించింది.
1942 లో సభ్య సమాజానికి వెలిగా, దుర్భర జీవనం సాగిస్తున్న పంచాయితీ పారిశుధ్య కార్మికుల సంఘాన్ని తాడేపల్లిగూడెంలో నిర్మించడంతో కపర్దీ కార్మికోద్యమ కార్యకలాపం మొదలయ్యింది.
ఆనాటికి అసంఘటితంగా ఉండిన మోటర్ కార్మికులను ఐక్యం చేసే లక్ష్యంతో ట్రేడ్ యూనియన్ రంగంలో కపర్దీ అడుగుపెట్టారు. అమరవీరుడు పేరేప మృత్యుంజయుడు మార్గదర్శకత్వంలో కపర్దీ ఈ కృషి ప్రారంభించి, దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దశాబ్ద కాలానికి రూపుదిద్దుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఈ మోటర్ కార్మిక ఉద్యమానికి పుట్టిన బిడ్డే! ఆంధ్రప్రదేశ్ మోటర్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగానూ, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎంప్లాయీస్ యూనియన్ వ్యవస్థాపక నాయకుడిగానూ కపర్దీ ఈ పరిణామం వేగవంతం కావడానికి రేయింబవళ్ళు కృషి చేశారు.
తాడేపల్లిగూడెంలో నిరుపయోగంగా పడివుండిన వందల ఎకరాల ఎయిర్ఫీల్డ్ భూములలో, అయిదున్నర దశాబ్దాలుగా, మూడువేలమంది బీదాసాదా కార్మికులు "సొంత ఇళ్ళు" కట్టుకుని నివసిస్తున్నారు. వారి "సొంత ఇంటి కల" సాకారమయ్యేలా చేసేందుకు ఏళ్ళతరబడి కృషిచేసినవాడు కపర్దీ.
నిర్వహించిన పదవులు
మార్చు1957లోనే కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన కపర్దీ, 1968 నాటికి జాతీయ సమితి సభ్యుడిగా ఎదిగి, మరణించేనాటికి సి.పి.ఐ. రాష్ట్ర సమితి కార్యదర్శి వర్గ సభ్యుడిగా కూడా వున్నారు. ఆనాటికి ఆయన ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి.) జాతీయ నేతల్లో ఒకడిగా బాధ్యతలు నిర్వహించడానికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ (ఎ.పి.టి.యు.సి.) ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు.
ప్రత్యేకతలు
మార్చుప్రభావశీలమైన వక్త - మంచి అనువాదకుడు.
తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ భాషా-సాహిత్యాల్లో అభినివేశం కలిగిన మేధావి.
1961లోనే ఆనాటి సోవియట్ యూనియన్లో పది నెలల పాటు పర్యటించి అక్కడ పరిశ్రమల నిర్వహణ తీరునీ, కార్మికుల జీవన స్థితి గతులను అధ్యయనం చేశారు.
1980 పార్లమెంటు ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి సి పి ఐ అభ్యర్థి గా పోటీ చేసి 18 శాతం ఓట్లను సాధించారు.
శత జయంతి ఉత్సవాలు
మార్చు2023 సంవత్సరం అగస్ట్ నెలలో కపర్దీ శతజయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున మొదలై, కొనసాగుతున్నాయి. ఇప్పటికి తెనాలి (అగస్ట్ 26), గుంటూరు (సెప్టెంబర్ 3), విజయవాడ (సెప్టెంబర్ 24), విశాఖపట్టణం (సెప్టెంబర్ 30), తాడేపల్లిగూడెం (అక్టోబరు 31) పట్టణాల్లో "కపర్దీ శతజయంతి సభలు" జరిగాయి. అగస్ట్ 30న, కపర్దీ శతజయంతి రోజున, కుటుంబ సభ్యులూ, ఆప్తులూ, ఆత్మీయులూ హైదరాబాద్ లోని సత్యనారాయణరెడ్డి భవన్ లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
ఈ సంవత్సరంలో వివిధ పట్టణాలలో శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
శత జయంతి విశేష సంచిక
మార్చు"దారిదీపం" మాసపత్రిక సంపాదక వర్గం సారధ్యంలో "ఆదర్శ కమ్యూనిస్టు - అరుదైన కార్మిక నేత" పేరుతో యం వి యన్ కపర్దీ శతజయంతి విశేష సంచికను రూపొందించి, విడుదల చేసింది.