కపిల హింగోరాణి
పుష్ప కపిల హింగోరాణి భారతీయ న్యాయవాది. ఆమె "ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి మాతృమూర్తి" (మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) అనే పేరు పొందింది.
కపిల హింగోరాణి | |
---|---|
జననం | |
మరణం | 2013 డిసెంబరు 31 | (వయసు 86)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | న్యాయవాది |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం |
జీవిత భాగస్వామి | నిర్మల్ హర్‌దాస్‌మల్ హింగోరాణి |
పిల్లలు | 3 |
జీవిత విశేషాలు
మార్చుకెన్యా లోని నైరోబీలో భారతీయ మూలాలున్న కుటుంబంలో 1927 డిసెంబరు 27 న కపిల జన్మించింది. 1947 లో ఇంగ్లండు లోని కార్డిఫ్‌లో న్యాయవాద విద్య చదివేందుకు వెళ్ళింది. 1951 లో డిగ్రీ పొందింది. కార్డిఫ్ లా స్కూల్‌లో చదివిన మొదటి భారతీయ సంతతికి చెందిన కెన్యా మహిళ, కపిల. అక్కడి అబెర్‌డేర్ హాల్‌లో ఆమె గౌరవార్థం ఒక ఫలకాన్ని ఏర్పాటు చేసారు. [1] లండను లోని లింకన్స్ ఇన్ నుండి బారిస్టరయింది.
1960 లలో న్యాయవాది నిర్మల్ హర్‌దాస్‌మల్‌ను పెళ్ళి చేసుకుంది. వారికి ముగ్గురు పిల్లలు. కపిల తన 86వ ఏట, 2013 డిసెంబరు 31 న మరణించింది. [2] 2017లో, భారతదేశ సుప్రీంకోర్టు లైబ్రరీలో ఆమె చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఆ గౌరవం పొందిన మొట్టమొదటి మహిళా న్యాయవాది, ఆమె. [3]
న్యాయవాద వృత్తి
మార్చుకపిల, 1961 లో ఢిల్లీలో సుప్రీమ్ కోర్టులో న్యాయవాద వృత్తిని మొదలుపెట్టింది. [4] తన భర్తతో కలిసి 100 కు పైగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై పనిచేసింది.[4][5]
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు మాతృమూర్తి
మార్చుభారతదేశ చట్టాల ప్రకారం, బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉండేది. కపిల, ఆమె భర్త నిర్మల్ హింగోరాణి బీహార్‌లో విచారణలో ఉన్న ఖైదీల తరపున సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీరు వివిధ కేసులలో విచారణ ఎదుర్కొంటూ, శిక్ష ఏమీ లేకుండా దీర్ఘ కాలం పాటు జైల్లో మగ్గుతున్న నిందితులు వీరు. కపిల ఆ కేసును వాదించిన రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు, బీహార్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఆ కేసులో పేర్కొన్న బాధితులందరినీ విడుదల చేసింది. ఈ తీర్పు చివరికి దేశవ్యాప్తంగా 40,000 మంది విచారణలో ఉన్న నిందితులను కూడా విడుదల చేయడానికి దారితీసింది. భారత న్యాయవ్యవస్థలో మైలురాయి లాంటి ఈ కేసులో పేర్కొన్న ఆరుగురు మహిళా ఖైదీల్లో హుస్సేనారా పేరిట దీనికి 1979 హుస్సేనారా ఖాటూన్ కేసుగా పేరు వచ్చింది. [6] దీంతో కపిలకు "మదర్ ఆఫ్ పిఐఎల్" అనే కీర్తి లభించింది. [5] [7] ఈ కేసు భారతీయ న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు దారితీసింది. [8]
భాగల్పూర్ బ్లైండింగ్ కేసు
మార్చుభాగల్పూర్లో 33 మంది విచారణలో ఉన్న నిందితులను, పోలీసులు సూదులు, యాసిడ్ ఉపయోగించి అంధులను చేసిన సంఘటనపై కూడా ఆమె కోర్టులో పోరాడింది. బీహార్‌కు చెందిన ఒక న్యాయవాది ఈ దారుణాల గురించి ఆమెకు వ్రాసిన తరువాత, ఆమె ఈ పిటిషన్‌ను చేపట్టింది. చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై విచారణ జరపాలనీ, బాధితులను విడుదల చేసి వారికి జీవితాంతం వైద్య సహాయం, పెన్షన్‌లు ఇవ్వాలనీ సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. [9]
మూలాలు
మార్చు- ↑ "Pioneer in law returns to Cardiff".
- ↑ "'Mother of PIL' Kapila Hingorani dies at the age of 86". Times of India. 2 January 2014. Retrieved 2 January 2014.
- ↑ "Did you know that the first woman lawyer to have her portrait in SC library abolished devdasi system in Kerala?".
- ↑ 4.0 4.1 "ఎబౌట్ కపిల హింగోరాణి". ది కపిల అండ్ నిర్మల హింగోరాణి ఫౌండేషన్. Archived from the original on 2021-07-28. Retrieved 2022-07-12.
- ↑ 5.0 5.1 Sinha, Nidhi. "In Public Interest". Indian Express. Retrieved 12 January 2015.
- ↑ "Hussainara Khatoon & Ors vs Home Secretary, State Of Bihar". indiankanoon.org. Supreme Court of India. Retrieved 12 January 2015.
- ↑ "The spark that lit the PIL fire". Archived from the original on 2014-05-14. Retrieved 2022-07-12.
- ↑ "Finding the Roots of India's PIL Revolution" (PDF).
- ↑ Sinha, Nidhi. "In Public Interest". Indian Express. Retrieved 12 January 2015.