కర్పూర వసంతరాయలు

కర్పూర వసంతరాయలు సి. నారాయణ రెడ్డి రచించిన గేయ కావ్యం. ఈ గ్రంథం 1957 లో ప్రచురితమైంది.[1]

సా.శ 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ప్రభువు కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్థాన నర్తకి లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతమే ఈ కావ్యం. మల్లంపల్లి సోమశేఖరశర్మ రాసిన HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పూర వసంతరాయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించాడు.

కుమారగిరి రెడ్డి ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. అందుకే అతనిని కర్పూర వసంతరాయలుగా పిలిచేవారు. కుమారగిరి రెడ్డి స్వయంగా పండితుడు, కవి. ఇతడు వసంతరాజీయ్యము అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని వ్రాశాడు.

రాజ్య భారాన్ని తన మంత్రి, బావ అయిన కాటయ వేమారెడ్డి పై మోపి, సంగీత, నాట్య, వినోదాలతో కాలాన్ని కర్పూరం వలె వెలిగించాడు. కుమారగిరి, లకుమ నాట్యానికి, ఆమె లావణ్యానికి దాసుడు అవుతాడు. రాజ్యాన్ని, రాణిని విస్మరిస్తాడు. రాజ్య పరిరక్షణ కోసం రాణి లకుమను అర్థిస్తుంది. లకుమ ప్రాణత్యాగం తో ఈ కావ్యం ముగుస్తుంది. రెడ్డి రాజుల చరిత్రకు ప్రాణం పోసిన మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితమిచ్చాడు నారాయణ రెడ్డి. ఈ కావ్యాన్ని నారాయణరెడ్డి స్వయంగా ఆలపించారు కూడా.

మూలాలు మార్చు

  1. "సినీ తోటలో కావ్య కోయిల". www.teluguvelugu.in. Archived from the original on 2021-12-07. Retrieved 2021-12-07.