కల్లోల లోయ పుస్తకాన్ని ప్రముఖ పౌరహక్కుల ఉద్యమనేత, సాహిత్యవేత్త కె.బాలగోపాల్ రచించారు.

కల్లోల లోయ
కృతికర్త: కె.బాలగోపాల్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
విడుదల: 2007

రచన నేపథ్యం మార్చు

1995 నుండి 2003 మధ్యకాలంలో 5సార్లు కాశ్మీరులో పర్యటించిన మానవ హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశం ఈ పుస్తకం. ఆంగ్లంలో ముద్రితమైన ఆ నివేదికలను తెలుగులోకి అనువదించి క్రమానుగత కథనాన్ని అందించే ప్రయత్నం చేశారు. చారిత్రిక నేపథ్యాన్ని మాత్రం వివిధ చరిత్ర గ్రంథాలు, కశ్మీరీ మేధావులతో జరిపిన సంభాషణలపైన ఆధారపడి రచించినట్టు బాలగోపాల్ పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని 2007 జనవరిలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు. 2008లో ద్వితీయ ముద్రణ పొందింది.

రచయిత గురించి మార్చు

ప్రధాన వ్యాసం:కె.బాలగోపాల్
కె.బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమ నేత, రచయిత, వ్యాసకర్త. ఆంధ్రప్రదేశ్ లో మానవహక్కుల ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయనది కీలకమైన పాత్ర. రచయితగా సాహిత్యవిమర్శలు, సామాజికాంశాలు రాశారు. సాహిత్యాన్ని మార్క్సిస్టు దృక్పథంలో ఆయన చేసిన విమర్శలు సాహిత్యంపై బాలగోపాల్ గ్రంథంగా ప్రకటించబడింది.

దృక్పథం మార్చు

అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్య కాశ్మీర్ సమస్య. 1948లో కాశ్మీర్ భూఖండంపై హక్కు గురించి ప్రారంభమైన ఈ సమస్యలో భారత్-పాక్ ల మధ్యన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన స్థానం ఉంది. ఈ పుస్తకం అటు పాకిస్తాన్, ఇటు బారతదేశంల కోణాల నుంచి కాక పౌరహక్కుల దృక్పథంతో కాశ్మీరీల దృక్కోణం నుంచి వ్రాయబడినది. పౌరహక్కుల సంఘాల వారి 5 నిజనిర్ధారణ కమిటీల సారాంశంగా రాయడం వల్ల ఈ విషయం సుస్పష్టం. ఆ ఐదు నిజనిర్ధారణ కమిటీల్లోనూ వ్యక్తిగా బాలగోపాల్ పాల్గొన్నారు. అన్ని కమిటీల ముసాయిదాలు రూపొందించారు. ఐనా ఇవి వ్యక్తిగతాభిప్రాయాలుగా కాక ఒక దశాబ్ద కాలంపైగా కాశ్మీర్ సమస్యను హక్కుల కోణం నుంచి పరిశీలించి, దాని గురించి చర్చించి, ప్రజల్లో ప్రచారం చేసిన భారతదేశ హక్కుల ఉద్యమం, ఆ క్రమంలో రూపిందించుకున్న అభిప్రాయాలే ఈ పుస్తకం అని బాలగోపాల్ పేర్కొన్నారు.[1]

అంశాలు మార్చు

ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యను ఈ క్రమంలో వివరించారు:[2]

  1. చారిత్రిక పూర్వరంగం
  2. విలీనం అనంతరం - ప్రజాస్వామ్య విధ్వంసం
  3. తిరుగుబాటు - అణచివేత
  4. సర్కారీ మిలిటెంట్ల సాయంతో మళ్ళీ ఎన్నికలు
  5. పౌర ప్రభుత్వం పునరాగమనం
  6. కాల్పుల విరమణ - చర్చల ప్రతిపాదన
  7. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, పాత వాస్తవాలు
  8. ఈ కథకు ముగింపు కనుచూపు మేరలో లేదు

మూలాలు మార్చు

  1. కల్లోల లోయకు బాలగోపాల్ రాసిన ముందుమాట
  2. కల్లోల లోయ:కె.బాలగోపాల్:విషయసూచిక