కళింగ యుద్ధం

ప్రాచీన భారతదేశపు యుద్ధం

కళింగ యుద్ధం మౌర్య సామ్రాజ్యానికి, కళింగ రాజ్యానికి మధ్య జరిగింది. దీనికి అశోక చక్రవర్తి సారథ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి భారతదేశం యొక్క ఒడిషా రాష్ట్ర ప్రాంతంలో వుండేది. భారత చరిత్రలో కళింగ యుద్ధం అతిపెద్ద, అతి ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. కళింగులు తీవ్రమైన ప్రతిఘటన చేసినా, ఆఖరుకి మౌర్యులే యుద్ధాన్ని గెలిచి, కళింగ రాజ్యాన్ని ఆక్రమించారు. సాంస్కృతికంగా కళింగ రాజ్యాన్ని రాజు లేకుండా నిర్వహించే పద్ధతి ఒకటి ఉన్నందున కళింగ ప్రాంతం/రాజ్యానికి ప్రత్యేకించి ఒక రాజు అంటూ ఎవరూ లేరు.[5]

కళింగ యుద్ధం
తేదీకాలం. 261 –  260 బి.సి
ప్రదేశంకళింగ, భారతదేశం
ఫలితంనిర్ణయాత్మకంగా మౌర్య సామ్రాజ్యం గెలిచింది
రాజ్యసంబంధమైన
మార్పులు
మౌర్య సామ్రాజ్యం లోని కళింగ ప్రాంతం
ప్రత్యర్థులు
మౌర్య సామ్రాజ్యంకళింగ
సేనాపతులు, నాయకులు
అశోకుడురాజా అనంత పద్మనాభన్ ???
బలం
Total 70,7006,000 పదాతి దళం,[1]
10,000 అశ్విక దళం[2] 700 యుద్ధ ఏనుగులు[1]
ప్రాణ నష్టం, నష్టాలు
10,00050,000 (అశోకుని ప్రకారం)[3][4]
(పౌరులతో సహా)

అశోకుడు పట్టాభిషిక్తుడైన తరువాత చేసిన ఏకైక అతిపెద్ద యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసి తట్టుకోలేక, బౌద్ధంలోకి మారాడని లోక ప్రతీతి.

నేపధ్యంసవరించు

 
మౌర్య సామ్రాజ్యం

కళింగ రాజ్యంపై మౌర్యులు దండెత్తడానికి రెండు కారణాలున్నాయి. రాజకీయపరమైన కారణం ఒకటి కాగా, మరొకటి ఆర్థిక కారణం. కళింగ రాజ్యంగ్ ఎంతో సంపన్న దేశం. అంతేకాక, అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం కలవారు. పైగా అది ఎంతో ప్రశాంతమైన రాజ్యం. ఇక్కడి ప్రజలు మంచి కళా నైపుణ్యం కలవారు కాబట్టే ఈ ప్రాంతానికి "ఉత్కళ" అని పేరు వచ్చింది.[6] ఈ ప్రాంతం మొత్తం మీద, దేశానికి ఆగ్నేయంగా ప్రయాణించి అక్కడి దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగిన మొట్టమొదటి రాజ్యం కళింగ కావడం విశేషం. దాంతో ఈ రాజ్యానికి ముఖ్యమైన రేవు పట్టణాలు, బలమైన నౌకాదళం ఉండటం కూడా ఈ దండయాత్రకు ఒకానొక కారణం. వీరి సంస్కృతి ఎంతో విశాలమైనది. అలాగే వారు అందరికీ సమానమైన పౌర స్మృతిని (యూనిఫాం సివిల్ కోడ్) పాటించేవారు.[7]

321 బిసిలో సామ్రాజ్య పతనం జరిగేంతవరకూ కళింగ రాజ్యాన్ని నంద వంశం పరిపాలించేది.[8] అశోకుని ముందు అతని ముత్తాత చంద్రగుప్త మౌర్యుడు కళింగ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అందుకే అశోకుడు, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన కళింగాన్ని, పట్టాభిషిక్తుడైన వెంటనే గెలవాలని ముందే నిర్ణయించుకున్నాడు. అతని రాజ్యంలో తన స్థానం సుస్థిరం కాగానే కళింగ రాజ్యం మీదకి దండెత్తాడు.[7] ప్రస్తుత ఒడిశా తీరప్రాంతాన్నే అప్పట్లో కళింగ రాజ్యంగా వ్యవహరించేవారు.

యుద్ధం జరిగిన కాలంసవరించు

అశోకుని పరిపాలనాకాలంలో 9వ ఏట ఈ యుద్ధం మొదలైంది. సుమారు 261 బిసిలో ఈ యుద్ధం జరిగింది. అతని తండ్రి చనిపోయిన తరువాత, సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన యుద్ధం తరువాత, అతను చేసిన రెండవ యుద్ధం ఇది. కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు అతను చేసిన ఈ యుద్ధంలో అతను ఘన విజయం సాధించాడు. కానీ ఈ యుద్ధంలో జరిగిన ప్రాణ, ధన నష్టం చూసిన అశోకుడు, ఇక తన జీవితకాలంలో రాజ్య ఆక్రమణల కోసం ఎటువంటి యుద్ధాలూ చేయనని ప్రతిజ్ఞ చేశాడు.

అనంతర పరిణామాలుసవరించు

యుద్ధంలో జరిగిన హింస చూసిన అశోకుడు, ఇంతటి వినాశనానికి తానే కారణమని భావించాడు. కళింగ ప్రాంతం మొత్తం దోపిడీకి గురై, నాశనమైంది. అశోకుని అధికారుల లెక్కల ప్రకారం కళింగుల వైపు 100,000 మంది ఈ యుద్ధంలో చనిపోయారు. అంతకు తక్కువ కాకుండానే అశోకుని వైపు కూడా జననష్టం జరిగింది. కానీ కొందరు ఒడిశా చరిత్రకారులు, కళింగ ప్రాంతపు వాసులు మాత్రం అవి తప్పుడు లెక్కలనీ, అంత భారీ నష్టం జరగలేదనీ, ఈ లెక్కలన్నీ అతిశయోక్తులనీ అరోపించారు. వారి ప్రకారం కళింగ సైన్యం తాము నష్టపోయిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువగా శత్రు సైన్యాన్ని నాశనం చేసింది. ఈ యుద్ధంలో కొన్ని వేలమంది స్త్రీ, పురుషులు మరణించారు అన్నది మాత్రం చరిత్ర చెప్పే నిజమని వారు చెబుతారు.

ఎడిక్ట్స్ ఆఫ్ అశోకా అనే పుస్తకంలో కళింగ యుద్ధం, దాని పరిణామాలపై అశోకుని ప్రతిస్పందన రాయబడింది. అప్పటికే అశోకుడు బౌద్ధమతంలో ఉన్నా, ఆ మత నియమాలను పాటించడం లేదు. ఈ యుద్ధం కారణంగా అతనిలో రక్తపాతంపై విముఖత రావడంతో పూర్తిస్థాయిలో బౌద్ధునిగా మారిపోయాడు. ధర్మవిజయం, అహింస ధర్మాలే ఆచరణీయాలని నిర్ణయించుకున్న అశోకుడు తన జీవితకాలంలో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచీ సైన్య విస్తరణ, రాజ్య విస్తరణ, ఆక్రమణలను పూర్తిగా మానేశాడు. ఈ యుద్ధం తరువాత దాదాపు 40 ఏళ్ళ పాటు రాజ్యం చేసిన అశోకుడు శాంతి, సామరస్యం, ప్రజల, రాజ్య శ్రేయస్సులే లక్ష్యాలుగా రాజ్యం చేశాడు. అంతేకాక, తన పిల్లలు ఇద్దర్నీ దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ బౌద్ధ మత ప్రచారం కోసం పంపాడు.

బయటి లింకులుసవరించు

  1. 1.0 1.1 Pliny the Elder (77 CE), Natural History VI, 22.1, quoting Megasthenes (3rd century BCE), Indika, Fragm. LVI.
  2. Roy, Kaushik. Military Manpower, Armies and Warfare in South Asia. Google Books. Routledge, 2015. Retrieved 17 August 2015.
  3. Ashoka (r. 268 – 231 BCE), Edicts of Ashoka, Major Rock Edict 13.
  4. Radhakumud Mookerji (1988). Chandragupta Maurya and His Times. Motilal Banarsidass Publ. ISBN 81-208-0405-8.
  5. "Detail History of Odisha".
  6. Das, Manmatha Nath (1949). Glimpses of Kalinga History. Calcutta: Century Publishers. p. VII; 271. Retrieved 16 May 2016. Cite has empty unknown parameter: |1= (help)
  7. 7.0 7.1 Ramesh Prasad Mohapatra(1986) Page 10. Military History of Orissa. Cosmo Publications, New Delhi ISBN 81-7020-282-5
  8. (Raychaudhuri & Mukherjee 1996, pp. 204-209, pp. 270–271)