కాకటూరి పద్మావతి

కాకటూరి పద్మావతి ఒక వాగ్గేయాకారిణి,[1][2] సంగీత విద్వాంసురాలు.[3] మూడు వందలకు పైగా కృతులు, కీర్తనలు రచించింది. ఈమెకు సంగీత చూడామణి అనే బిరుదు ఉంది. 1915 లో మచిలీపట్నంలో జన్మించిన ఈమె చిన్నతనం నుంచే సంగీత సాహిత్యాల మీద అభిరుచి పెంచుకున్నది. వివిధ గురువుల దగ్గర సంకీర్తనలు సాధన చేసింది. తర్వాత సొంతంగా సాధన చేసి వాగ్గేయకారిణిగా రాణించింది. ఆకాశవాణిలో ఆమె రాసిన పలు సంకీర్తనలు, మంగళహారతలు, సంగీత రూపకాలు ప్రసారం అయ్యాయి. ఈమె రచనల్లో ప్రముఖ వాగ్గేయకారుల ప్రభావం కనపడుతుంది. సంగీత రత్నమాల, సంగీత కదంబమాల, సంగీత వైభవ మాల అనే పుస్తకాలు కూడా రచించింది.

కాకటూరి పద్మావతి
జననం1915
మచిలీపట్నం
మరణం2000
వృత్తిసంగీత విద్వాంసురాలు
జీవిత భాగస్వామికాకటూరి రాధాకృష్ణయ్య
తల్లిదండ్రులు
  • మల్లవరపు వెంకటరమణయ్య (తండ్రి)
  • తులసమ్మ (తల్లి)

బాల్యం సవరించు

పద్మావతి 1915 న మచిలీపట్నంలో మల్లవరపు వెంకటరమణయ్య, తులసమ్మ దంపతులకు జన్మించింది. చిన్నతనం నుంచే సాహిత్యం మీద ముఖ్యంగా ఆమె అమ్మమ్మ ప్రోత్సాహంతో భాగవతం మీద ఆసక్తి పెంచుకున్నది. లంకా నరసింహ శాస్త్రి దగ్గర సంస్కృతం అభ్యసించింది. పి. ఎస్. చొక్కనాయకీ దగ్గర సంగీతం, వీణా వాద్యం అభ్యసించారు. జొన్నలగడ్డ నారాయణ మూర్తి దగ్గర సాహిత్యంలో మెరుగులు దిద్దుకున్నది. గురువు దగ్గర డెబ్బైకి పైగా కీర్తనలు సాధన చేసింది. ఆకాశవాణి ప్రసారం చేసిన సంగీత శిక్షణా కార్యక్రమం స్ఫూర్తితో సొంతంగా సాధన చేసి వాగ్గేయకారిణిగా రాణించింది.

వ్యక్తిగతం సవరించు

ఈమె కాకటూరి రాధాకృష్ణయ్యను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు సంతానం కలగకపోవడంతో పిల్లలని పెంచుకున్నారు. 85 ఏళ్ళ వయసులో మరణించింది.

రచనలు సవరించు

కృతులు, కీర్తనలు, రాగమాలికలు, వర్ణాలు, థిల్లానాలు, గోపికా గీతాలు, మంగళహారతులు మొదలైన అనేక ప్రక్రియల్లో ఆమె రచనలు చేశారు.

పాటలు సవరించు

శంకరాచార్య రాసిన అన్నపూర్ణ అష్టకం ప్రభావంతో వారణాసి పురవాసిని అనే అనుపల్లవితో శ్రీరాజరాజేశ్వరి కృతిని సృష్టించి కళ్యాణి రాగంలో స్వరపరిచింది. చంద్రశేఖరేంద్ర స్వామి కి స్వాగతంగా భిక్షాటనము అనే కీర్తన రచించి ఆలపించింది. తర్వాత ఆయన ఆదేశం మేరకు కామాక్షి అమ్మవారి మీద కామకోటి కామాక్షీ, జగన్మాత కామాక్షీ అనే కీర్తనలు స్వరపరిచింది. శృంగేరి అమ్మవారి మీద శ్రీ శారదే అనే కీర్తన, గయ క్షేత్రంలోని గౌరి దేవి మీద షణ్ముఖప్రియ కీర్తన స్వరపరిచింది.ఈమె కీర్తనల్లో కొన్నింటిని ఆకాశవాణి ప్రసారం చేసింది. వనితావాణి కార్యక్రమంలో ఆమె రాసిన మంగళ హారతులు, కీర్తనలు, శరద్రాత్రి, సత్యభామ, లక్ష్మీ పూజ లాంటి సంగీత రూపకాలు ప్రసారమయ్యాయి.

తెలుగు సాంప్రదాయంలో కనిపించే మంగళహారతుల్లో ఈమె రాసి స్వరపరిచిన జయ జయ హారతి జానకి దేవికి, రారే రారే రమణులార హారతియ్యరే రమణీమణికి పాటలు ప్రాచుర్యం పొందాయి. పాడరె మృదుమధురముగా భరతమాత ప్రకీర్తిని లాంటి దేశభక్తి గేయాలు, సిరి వచ్చి మా ఇంటి తలుపు తట్టింది, స్నానమాడరే గంగా స్నానమాడరే లాంటి జానపద గీతాలకూ ప్రాణం పోసింది. ఇంకా గొబ్బి పాటలు, లాలి పాటలు, పడవ పాటలు మొదలైన అనేక ప్రక్రియలలో తన రచనా పాటవాన్ని చాటింది. హరికథలు, బుర్రకథలు, నాట్య సంబంధ రచనలు కూడా చేసి స్వరపరిచింది.

పుస్తకాలు సవరించు

సంగీత రత్నమాల, సంగీత కదంబమాల, వైభవమాల ఆమె సంగీతం మీద రాసిన పుస్తకాలు. చిన్నప్పటి నుంచి చదివిన భాగవతం మీద బాల గోపాల చరిత్ర అనే పుస్తకం రాసింది. నాట్య సంబంధమైన రచనల్లో కల్యాణ జానకి, అలమేలు మంగా చరిత్ర, బృందావనం, శరద్రాత్రి మొదలైనవి ఎన్నదగిన రచనలు.

మూలాలు సవరించు

  1. G., S (11 November 2011). "Confidence personified". thehindu.com. The Hindu. Retrieved 28 November 2018.
  2. "Andhra Composers". Archived from the original on 2014-10-28. Retrieved 2018-11-28.
  3. గంటి, ఉషాబాల (1 November 2018). "సంకీర్తనా సిరి కాకటూరి". ramojifoundation.org. రామోజీ ఫౌండేషన్. Archived from the original on 23 డిసెంబరు 2018. Retrieved 28 నవంబరు 2018.