కావ్య నాయకుడు
భారతీయ అలంకార శాస్త్రాలలో కావ్యములలో నాయకుడు ఎలా ఉండాలో, అతని లక్షణాలేమిటో వివరించారు.
సహితము - హితముతో కూడినది సాహిత్యం. సాహిత్యంలో వేదాలు శాస్త్రాలు, పురాణాలు-ఇతిహాసాలు, కావ్యాలు ప్రధానమైన విభాగాలు. వేదశాస్త్రాలు ప్రభుసమ్మితాలు.అంటే ప్రభువులా ప్రజలను నియంత్రిస్తాయి. శాసిస్తాయి. ప్రజలు సక్రమమార్గంలో పయనించేలా విధి, నిషేధాలను నిర్ణయిస్తాయి.వీటివలన ప్రజలకు కర్తవ్యబోధ కలుగుతుంది. ఇతిహాసాలు, పురాణాలు మిత్రసమ్మితాలు. అంటే ఉత్తమ పురుషుల జీవితాలను, చరిత్రను పొగుడుతూ ప్రజలకు దుర్మార్గులపైన ద్వేషము కలిగిస్తాయి. మిత్రుడిలా కర్తవ్యాన్ని ప్రబోధిస్తాయి కావ్యాలు కాంతాసమ్మితాలు. అంటే ఒక స్త్రీలాగ సరస ధోరణితో ఆకట్టుకునేలాగా కర్తవ్యాన్ని ఉపదేశిస్తాయి.కావ్యాలన్నీ ఉత్తమపురుషులను వర్ణిస్తూ, దుష్టులపట్ల విముఖత కలుగజేస్తాయి.
ఉత్తమ నాయకుడు అంటే అతని స్వభావం గుణగణాలు ఈవిధంగా ఉంటాయి. నాయకుడు -గుణాలు
1. మహాకులీనత : కులీనుడు అంటే ఉత్తమవంశంలో జన్మించినవాడు.
2. ఔజ్జ్వల్యము : చక్కని ప్రకాశిస్తున్న రూపాన్ని కలిగినవాడు
3.మహా భాగ్యము: భూమి మీద గొప్ప సంపదలు కలిగినవాడు, చక్రవర్తిగా ఉన్నవాడు
4.ఔదార్యము : దానగుణం కలిగినవాడు
5. తేజస్విత : దేశాన్ని ప్రకాశవంతంగా చేయగలవాడు
6.వైదగ్థ్యము : పనులందు చాలా నేర్పరి తనం కలిగి ఉండేవాడు
7.ధార్మికత్వము : ధర్మాచరణం పై ఆసక్తి కలిగి ఉంటాడు
8.మహా మహిమత్వము : భగవంతుని అంశ కలిగి ఉంటాడు
9. పాండిత్యం : విద్యయందు ప్రవేశం కలిగి ఉంటాడు
కావ్యాలలో ఉత్తమనాయకుడు అంటే ఈ విధమయిన నవలక్షణాలు ఉండాలి.
నాయకభేదాలు: నాయకులలో కనిపించే వ్యక్తిగతమైన స్వభావ భేదాలను బట్టి నాలుగు రకాల నాయకులుగా విభజించారు.
(1) ధీరోదాత్తుడు వీరుడు, దయామయుడు, గంభీరుడు, ఆత్మశ్లాఘము(తనని తాను పొగుడుకోవడం) పట్ల విముఖుడు, భూరి బలాఢ్యుడు(గొప్ప బలవంతుడు) (2) ధీరోద్ధతుడు గర్వం, పరనింద, ఆత్మశ్లాఘ, ముక్కోపితనం, క్రూరత్వం, వంచన (3)ధీర లలితుడు నిశ్చింతుడు, విమల వర్తనుడు, భోగలాలసుడు, కళలయందు అనురక్తుడు (4) ధీరశాంతుడు ధీరుడు, శాంతుడు, బుద్ధిమంతుడు, పండితుడు
నాయక లక్షణాలు : నాయకుడు తన కీర్తి, ప్రతాపం వలన ప్రసిద్ధుడుగా ఉంటాడు.సదా ధర్మార్థ కామ మోక్షముల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. రాజ్య పాలన మొదలైన సమస్త వ్యవహారములలోను మంచి దక్షత కలిగినవాడిగా ఉంటాడు.
శృంగార నాయకులు నాలుగు విధాలుగా ఉంటారు. 1 అనుకూలుడు 2. దక్షిణుడు 3. ధృష్టుడు 4. శఠుడు
1.అనుకూలుడు ఒక నాయికయందే అనురాగము కలిగినవాడు
2. దక్షిణుడు పెక్కు భార్యలను సమంగా ప్రేమించగలవాడు
3. ధృష్టుడు దోషములు బయటపడినా భయపడనివాడు
4. శఠుడు నాయికకు తప్ప ఇతరులకు తన తప్పులు తెలియకుండా తప్పు చేసేవాడు.
శృంగార నాయకులకు సహాయపడి, వారిని నాయికల పట్ల సానుకూలంగా చేసే వారు సహాయనాయకులు. వీరు కూాడ నలుగురే.
1. పీఠ మర్దుడు మహానాయకుడి కంటే తక్కువ స్థాయిలో ఉన్నా కథలో ఉపకథకు నాయకత్వం వహిస్తాడు 2.విటుడు నాయికను రంజింపచేసి నాయకుడికి సహాయం చేస్తాడు 3.చేటుడు తన వాక్కు నైపుణ్యంతో నాయకులను, నాయికలను కలపడానికి సహాయపడతాడు 4.విదూషకుడు నవ్వు పుట్టించే మాటలు, చేష్టలతో మహానాయకుడి మనస్సును రంజింపచేస్తాడు.