కావ్య ప్రయోజనాలు

కావ్యానికి ప్రయోజనం ఏమిటీ. కేవలం ఆనందం కలిగించడమేనా? ఉపదేశం కూడా కావ్య ప్రయోజనమా అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన అలంకారికులు కావ్యానికి అనేక ప్రయోజనాలు తెలిపారు.

భామహుడు

ధర్మార్థ కామ మోక్షేషు వైచక్షణ్యం కళాసుచ
ప్రీతిం కరోతి కీర్తిం చ సాధు కావ్య నిషేవణం

ధర్మార్థ కామ మోక్షాలలోను, కళలలో నైపుణ్యాన్ని, కీర్తిని, ప్రీతిని సత్కావ్యం కలిగిస్తుందని భామహుని అభిప్రాయము. ఇదే కావ్య ప్రయోజనం

మమ్మటుడు

మమ్మటుడు తన కావ్య ప్రకాశంలో కావ్య ప్రయోజనాలుగా ఈ క్రింది వానిని వివరించాడు.

కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే శివేతర క్షతయే
సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేస యుజే.

కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మితమైన ప్రభోధం కొరకు అని మమ్మటుని అభిప్రాయము.

ఈ విషయాలను పూర్తిగా పరిశీలించాల్సి ఉంది.

కావ్యం యశస్సు కొరకు: మార్చు

కావ్య రచన చేసిన మహా కవులు భౌతికంగా నిశ్శరీరులైనా వారి యశక్కాయము సజీవమే. అందువల్లనే" జయంతి తే సుకృతినో రససిద్దా కవీశ్వరా, నాస్తి తేషాం యశహ్ కాయే జరామరణజం భయం" అని నానుడి. రస సిద్దులైన కవీశ్వరుల కీర్తి శరీరానికి ముసలితనం, మరణం లేదు అని భావన. వ్యాస వాల్మికాది కవులు తమ రచనల వల్లనే ఇప్పటికీ ప్రజలమధ్య సజీవులైనారు. వేమన వంటి మహాకవులు, నన్నయాది కవులు ఇప్పటికీ సజీవులే. ఇందుకు కారణం వారి రచనలే. కావ్యా నిర్మాణ క్షమా గుణమే వారిని సజీవులను చేసింది. ఇదే కావ్య ప్రయోజనం. రచయితలు సజీవులు కావడమే.

ఈ విషయాన్నే మిల్టన్ ఇలా అన్నాడు..Fame the last infirmity of noble minds……

కావ్యం ధన సంపాదన కొరకు: మార్చు

నిజానికి ప్రాచీన కవులందరు కావ్య రచన వలన ఆర్థికంగా లాభ పడినవారే. శ్రీనాధుడు కనకాభిషేకం పొందాదు. కవులు అగ్రహారాలు పొందారు. మణి మాణిక్యాదులు, ధనం కవుల సొత్తు అయింది. రాజులు కవులను పోషించారు. రాజ పోషణలో కవులు అపారమైన ధనాన్ని సముపార్జించారు. అందువల్లనే కావ్యం ధన సంపదన కారకమని మమ్మటుని అభిప్రాయం.

వ్యవహార ఙ్ఞానం కొరకు మార్చు

కావ్య రచన వలన, పఠన వలన వ్యవహారా ఙ్ఞానం పెరుగుతుంది. కవి సమాజాన్ని దర్శించి అందులోని వాస్తవాలను కావ్యంలో రచిస్తాడు. అందువల్ల కావ్యం సమాజానికి, సామాజిక జీవనానికి, సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తుంది. మానవ జీవితంలోని అనేక సమస్యలు కావ్యాలలో చర్చించబడినాయి. అందువల్ల కావ్యం వ్యవహార ఙ్ఞానాన్ని పెంచుతుంది.

అమంగళ పరిహరణం కొరకు మార్చు

కావ్య పఠనం వలన అశుభం తొలగిపోతుంది. పైగా కావ్య రచనోద్దేశమే అశుభ నివారణ. ఇది కావ్య రచనకు ప్రధానమైన ప్రయోజనం. ఇప్పటికీ విరాటపర్వాన్ని, ఉద్యోగపర్వాన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి చదివేవారున్నారు. మరణ దినాల్లో గరుడ పురాణం చదువుతారు.

సద్యః పరనిర్వృతి కొరకు మార్చు

కావ్యాన్ని రచించడం వలన, కావ్య పఠనం వలన రసానంద తన్మయత్వం కలుగుతుంది. ఇదే మోక్షం అంటే. దీనినే ప్రీతి అని కూడా అన్నారు. కావ్యాన్ని బ్రహ్మానంద రసానంద తన్మయత్వ స్థితికొరకు రచించినారు కవులు. ఇదే జగద్ధితం అన్నారు. దీనినే విశ్వశ్రేయస్సు అన్నారు.

కాంతా సమ్మిత ఉపదేశం కొరకు మార్చు

ఉపదేశం మూడు విధాలు. ప్రభుసమ్మితం, మిత్ర సమ్మితం, కాంతాసమ్మితం. వేదాలు ప్రభుసమ్మితాలు. శాస్త్రాలు మిత్ర సమ్మితాలు. కావ్యాలు కాంతా సమ్మితాలు. ప్రియురాలు ప్రియుని ఆలిచి, లాలించి, బుజ్జగించి ఉపదేశం చేస్తే ప్రియుడు వింటాడు. అట్లే కావ్యంలోని అలాంకారాలు, రీతులు, వృత్తులు, చందస్సు సహాయంతో కవి ఉపదేశాన్ని రమణియంగా అందిస్తాడు. ఇదే కాంతా సమ్మిత ఉపదేశమంటే.

ప్రాచీన అలంకారికులు కావ్యానికి ప్రయోజనాలుగా ఉపదేశాన్ని, ఆనందాన్ని సమానంగా భావించారు. భామహుడు, మమ్మటుడు ఇద్దరు చెప్పినది ఒకటే. భామహుడు ప్రీతి అన్న దానినే మమ్మటుడు సద్యహ్ పరనిర్వృతి అన్నాడు. ఇద్దరూ కావ్య ప్రయోజనం యశస్సు అని వివరించారు.


మరికొందరు కవులు కావ్య ప్రయోజనాలను ఈ క్రింది విధంగా వివరించారు.

  • నన్నయ అంధ్ర శబ్ధ చింతామణిలో " విశ్వశ్రేయహ్ కావ్యం " అన్నాడు. మహాభారతంలో " జగద్దితము" కావ్య ప్రయోజంగా వివరించాడు.
  • తిక్కన "ఆంధ్రావళి మోదమున్ బొరయునట్లుగా" అని కావ్యానికి ప్రయోజనం ఆనందం అని వివరించాడు.
  • పోతన " శ్రీ కైవల్య పధంబు చేరుటకునై" అని మోక్ష సాధన కొరకు కావ్యాన్ని రచిస్తున్నానని వివరించడమే కాకుండా " జగద్దితము" కొరకు రాస్తున్నానని చెప్పాడు.
  • పాశ్చాత్యులు ఆనంద ఉపదేశాలను రెండిటిని కావ్య ప్రయోజనాలుగా వివరించారు.
    • షెల్లీ -Poetry is metrical composition. It is the art of uniting pleasure with truth by calling forth imagination to the help of reason. - కవిత్వమంటే అంటే చందో బద్ద రచన. అది బుద్దియు , భావనం సాధనాలుగా ఆనంద సత్యాల ఐక్యాన్ని సంఘటించే కళ.
    • జాన్ డ్రైడన్ ఇలా అంటాడు..----ఏకైక ప్రయోజనం కాకున్నా కావ్యానికి ముఖ్య ప్రయోజనం ఆనందం. ఉపదేశాన్ని ఆనుషంగికంగా మాత్రమే అంగీకరించవచ్చు.
    • సర్ ఫిలిప్ సిడ్నీ--ఉపదేశించటం, అనందపరచటం కావ్య ప్రయోజనం అంటాడు.

పాశ్చాత్యులు ఆనంద ప్రయోజానాలు రెండు కావ్యా ప్రయోజనాలని వివరించారు. కళ కళ కోసం (Art for Arts sake) అని ఒక వర్గం, కళ సామాజిక చైతన్యం కోసమని (Art for society) ఒక వర్గం భావించారు. కళ కళకోసమని భావించేవాళ్ళు ఆనందానికి ప్రాధాన్యతనిస్తే, కళ సమాజంకోసమని భావించే వాళ్ళు ఉపదేశానికి ప్రాధ్యాన్యతనిచ్చారు.

మొత్తం మీద తేలిన సారాంశం ఏమంటే సాహిత్యం జగద్దితం కోసమని, విశ్వ స్రేయస్సు కావ్య ప్రయోజనమని... దీనినే లోక ప్రీతి అని కొందరు అన్నారు. విశ్వజనీనత కావ్యానికి ఉండాల్సిన మరో లక్షణం. ఈ దృష్ఠ్యా వాస్తవికత , కల్పన రెండు కలిసిన కావ్యంలో లోక నీతులు, లోక రీతులు, మానవ మనస్తత్వం కలగాపులగంగా కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆనందంతో పాటు, ఉపదేశకారకాలుగా కూడా ఉంటాయి.

అందువల్ల ఆనంద ఉపదేశాలు రెండు కావ్య ప్రయోజనాలని చెప్పవచ్చు.

[లంకెలు] మార్చు

* కావ్య ప్రయోజనాలు-వీడియో పాఠం