కాసాని నారాయణ (నవంబరు 1, 1928 – ఫిబ్రవరి 8, 2005) భారత స్వాతంత్ర్యసమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. అతను 1972 శాసనసభ ఎన్నికలలో జనగాం శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నుకోబడ్డాడు.[1] అతను తెలంగాణ లో సామాజిక న్యాయం కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాడాడు. పధ్నాలుగేళ్లకే సాయుధ పోరాటంలో పాల్గొన్న వీరుడు. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ కి మధ్య శాంతి చర్చలలో పాల్గొన్నాడు.

జీవిత విశేషాలుసవరించు

అతను 1928 నవంబరు 1న వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల గ్రామంలో జన్మించాడు. నారాయణ కూడా ఐదో తరగతి దాకా చదువుకోగలిగాడు. చురుకుగా ఉండేవాడు. ఎంతోమంది గొప్పవాళ్ల ప్రబోధాలు, ప్రసంగాల వల్ల ఉత్తేజితుడైన నారాయణ నిజాం పాలనపై వ్యతిరేకత పెంచుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో ఆంధ్రమహా సభ, కమ్యూనిస్టు పార్టీలో కీలక కార్యకర్తగా మారాడు. జనాన్ని పోగు చేయడం ఒక పనిగా పెట్టుకున్నాడు. 1946లో రజాకార్లు నారాయణ గ్రామంపై దాడిచేసి 440 మందిని అరెస్టు చేసి చెంచల్‌గూడ జైళ్లో నిర్భందించారు. ఆ సమయంలో నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించాడు నారాయణ. అప్పటికి ఆయన వయసు పందొమ్మిది సంవత్సరాలు. నిజాం పాలనలో ఉరిశిక్ష పడ్డప్పుడు అవకాశం ఉన్నా క్షమాభిక్ష అడగటానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. కమ్యూనిస్టు పార్టీ ఆదేశంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా నారాయణ చేస్తున్న కార్యక్షికమాలు పెరగడం వల్ల అతనిపై నిర్భందం పెరిగింది. ఆ సమయంలో ఆజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. నారాయణ పటిష్టమైన పోరాట దళాలను నిర్మించాడు. ఆయన దళనాయకుడిగా, కేంద్ర దళ కమాండర్‌గా, జోనల్, ఏరియా దళకమాండర్‌గా వివిధ స్థాయిల్లో పనిచేశారు. నారాయణపై జెజె తిరుమల్‌రావు పీహెచ్‌డీ చేయడం, మల్లికార్జున శర్మ పుస్తకం రాయడం మరో విశేషం.

ఎమ్మెల్యే అయినప్పటికీ సాదాసీదా జీవితమే గడిపాడు. ప్రజా సమస్యలపై, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం తపిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించాలా అని కసరత్తులు చేస్తుండేవాడు. 1978లో రెండోసారి ఎన్నికలలో కూడా అతను కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు. కానీ ఓటమిపాలయ్యాడు. అప్పటికి ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటయ్యింది. అంతకుముందు ఆయన సమకాలీనులైన పీవీ నరసింహరావు, చెన్నమనేని, హయక్షిగీవాచారి, టి. పురుషోత్తమరావు వంటి వారు రెడ్డి కాంగ్రెస్‌లో ఉండేవాళ్లు. ఆ పార్టీ గుర్తు ఆవుదూడ. కానీ ఇందిరా కాంగ్రెస్ చేయిగుర్తును తెచ్చింది. పైగా అందులో చేరినవాళ్లంతా రెడ్డి కాంగ్రెస్ నేతలే. అయితే ఈసారి పార్టీ మారడం ఇష్టం లేక రెడ్డి కాంగ్రెస్ నుంచే పోటీ చేశాడు నారాయణ. ప్రజలకు అతను ఏ కాంగ్రెస్‌లో ఉన్నారో అర్థం కాలేదు. పైగా ఆయనతో ఉన్నవాళ్లంతా చేతిగుర్తు పార్టీకి మారారు. దాంతో గందరగోళంలో పడిన చాలామంది జనం నారాయణరావుది చేయి గుర్తుగా భావించారు. ఓట్లన్నీ అటే వెళ్లాయి. ఓడక తప్పలేదు. కానీ ఆ టర్మ్‌లో గెలిచిన అభ్యర్థి అభివృద్ధి చేయడానికి అక్కడ పనులు కనిపించలేదు. అప్పటికే అతను చేసేశాడు. అందుకే పీవీగారు అతనిని ‘నారాయణ ఓడి గెలిచాడు’ అని ప్రశంసించారు[2].

మూలాలుసవరించు

  1. 1972 ఎన్నికల ఫలితాలు
  2. Anupama (2012-06-12). "Pearls of Love & Wisdom Shared by My Parents: నలుగురి కోసం నారాయణ - Newspaper article on KN". Pearls of Love & Wisdom Shared by My Parents. Retrieved 2019-01-14.

బయటి లంకెలుసవరించు