కిర్లియన్ ఫొటోగ్రఫీ
కిర్లియన్ ఫొటోగ్రఫీ (ఆంగ్లం: Kirlian photography) ప్రతి జీవపదార్థాన్నీ ఒక కాంతి ఆవరించి ఉంటుందనీ, అందులోని రంగుల మార్పు వల్ల జీవపదార్థంలోని లోపాలు వ్యక్తమవు తాయనీ తెలియజేసే ఒక నూతన వైజ్ఞానిక విధానం. సెమెన్ డి కిర్లియన్, వాలెంటినా కిర్లియన్ అనే శాస్త్రజ్ఞుల జంట, తమ వద్ద ఉన్న ఒక వైజ్ఞానిక పరికరంతో ప్రయోగాలు చేస్తుంటే జీవ పదార్థాలకు ఒక కాంతి వలయం ఉంటుందనే సత్యం వెల్లడైంది. సెమెన్ 1978 వరకు, వాలెంటినా 1971 వరకు జీవించారు. వారు 1935లో మొదటిసారి జీవపదార్థాల కాంతి వలయం గురించి కనుగొని ప్రకటించారు. వైద్యశాస్త్రంలో రోగనిదానానికి ఇది ఉపయోగపడుతుందని ఆ రోజుల్లోనే వారు ప్రకటించారు. మొదట ఇది పెద్ద విషయం కాదని కొట్టిపారేసిన కొందరు అమెరికన్ శాస్త్రజ్ఞులు, ఇందులోని విశేషాలను మరింత పరిశోధన చేసి తెలుసుకోవాలని ప్రయత్నించి, కొంత పురోభివృద్ధి సాధించారు. ఈ విషయం మీద 20వ శతాబ్దంలో చాలా పుస్తకాలు వెలువడ్డాయి. చైనీయులు వేల సంవత్సరాల కిందట కనుగొన్న సుమారు ఏడు వందల అకుపంక్చర్ పాయింట్ల వద్ద కాంతివలయంలోని తేజస్సు కేంద్రీకృతమై ఉందని శాస్త్రజ్ఞులు తెలుసుకొన్నారు.