కిలా రాయపూర్ ఆటల పోటీలు
కిలా రాయపూర్ ఆటల పోటీలు ప్రతి సంవత్సరం పంజాబ్లో నిర్వహించే గ్రామీణ క్రీడాపోటీలు.[1] వీటినే అభిమానులు గ్రామీణ ఒలంపిక్ క్రీడలు అని కూడా పిలుస్తారు. వీటిని లుధియానాకు దగ్గర్లోని కిలా రాయపూర్ లో నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బండ్ల పోటీలు, తాడు లాగే ఆట లాంటి సాంప్రదాయ పంజాబీ క్రీడలుంటాయి.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో లుధియానా దేశవిదేశాల నుంచి వచ్చిన క్రీడాభిమానులతో నిండిపోతుంది. ఇందులో రకరకాలైన ఎద్దులు, ఒంటెలు, కుక్కలు లాగే బండ్ల పోటీలను జనాలు ఆసక్తిగా నిలుస్తారు.
నేపథ్యం
మార్చునాగరిక మానవ జీవితం మొదటగా గ్రామాల్లో మొదలైంది. ప్రజల అవసరాల కొద్దీ నెమ్మదిగా గ్రామీణ క్రీడలు ప్రారంభమయ్యాయి. పొలాల్లో పనిచేయడం కోసం, శత్రువులను, క్రూర మృగాలను ఎదుర్కోవడం కోసం బలం కావాలి. దీనికోసమే కుస్తీ పోటీలు, పరుగు పందేలు, దూకే ఆటలు, బరువులెత్తే పోటీల్లాంటివి మొదలయ్యాయి. కబడ్డీ ఆట కూడా ఇలా బల ప్రదర్శన చేయడానికి ఉద్దేశించినదే. పంజాబ్ లో కబడ్డీ ఆట మంచి ప్రాచుర్యాన్ని సంపాదించుకుంది.
గురు హరగోవింద్ తమ అనుచరులు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో సిక్కుల ప్రధాన మందిరాలైన అకాల్ తక్త్లో కుస్తీ పోటీలు ప్రారంభించాడు. అప్పటి నుండి ఈ పోటీలు పంజాబీ ప్రజల జీవితాల్లో ప్రధాన భాగమయ్యాయి.
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం రాక మునపు కబడ్డీ, కుస్తీ పోటీలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. దాని తరువాత ఈ ఆటల పరిధి మరింత విస్తృతమైంది. హాకీ ఆట గురించి వారికి తెలియక ముందే వారు ఒక చివరన వంపు కలిగి ఉండే కట్టి, గుడ్డ ముక్కలతో చుట్టిన బంతితో అలాగే ఆడేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అసలైన హాకీ బ్యాటు, బంతితో ఆడటం మొదలు పెట్టారు. సరైన మైదానాలు అందుబాటులో లేకపోయినా పంజాబ్ నుంచి చాలా మంది క్రీడాకారులు భారత హాకీ జట్టులో స్థానం స్థాపించారు. దేశం యొక్క గొప్ప హాకీ క్రీడాకారుల్లో పంజాబ్ లోని జలంధర దగ్గర ఉన్న సంసార్ పూర్ నుంచే పన్నెండు మంది క్రీడాకారులు వచ్చారు.
ఈ పోటీల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పోటీదారులకు కూడా గ్రామస్తులే ఆశ్రయం ఇస్తారు.
రకాలు
మార్చుఈ ఆటల పోటీల్లో ముఖ్యంగా మూడు రకాల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. మొదటి విభాగంలో పూర్తి గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కుస్తీ లాంటి ఆటలుంటాయి. రెండవ విభాగంలో ఆధునిక క్రీడలైన హాకీ, వాలీ బాల్, ఫుట్ బాల్, సైక్లింగ్, హ్యాండ్ బాల్ లాంటివి. మూడవ విభాగం ఇనుప కడ్డీలను వంచడం, శరీరం మీద నుంచి వాహనాలు పోనిచ్చుకోవడం లాంటి సాహస క్రీడలు ఉంటాయి.
మూలాలు
మార్చు- ↑ "ఇవి.. మన ఒలింపిక్స్!". dailyhunt.in. ఈనాడు. Retrieved 30 January 2017.