క్రిములను, కీటకాలను, చిన్న జంతువులను తినే మొక్కలను కీటకాహార మొక్కలు లేదా మాంసభక్షణ మొక్కలు (ఆంగ్ల భాష Insectivorous or Carnivorous plants) అంటారు. ఇవి చాలా ఆశ్చర్యకరమైనవి. ఈ మొక్కలు నత్రజని లోపించిన ముఖ్యంగా బురద నేలలలో పెరుగుతాయి. ఇవి తమకు కావలసిన నత్రజనిని తయారుచేసుకోలేవు. అందువల్ల ఈ విధంగా క్రిమికీటకాలలో లభించే మాంసకృత్తుల మీద ఆధారపడతాయి. ఈ మొక్కల పత్రాలు కీటకాలను ఆకర్షించి, పట్టుకొని, చంపి, జీర్ణం చేసుకోవడానికి అనువుగా బోనులుగా రూపాంతరం చెందుతాయి. ఈ పత్రాలను 'బోను పత్రాలు' అంటారు. ఈ పత్రాలు వివిధ ఎంజైములను స్రవించడం వలన కీటకాలలోని ప్రోటీనులు విశ్లేషించి జీర్ణం చేయబడతాయి. జీర్ణం చేయబడిన ప్రోటీనులను ఈ పత్రాలు శోషిస్తాయి. ఇవి ఉత్తర, దక్షిణ కరోలినా (usa), ప్రాంతాల్లో అగుపిస్తాయి.

పుష్పాలతో నెపెంథిస్ మిరాబిలిస్ మొక్క.
పిచ్చర్ మొక్క
సన్ డ్యూ
వీనస్ ఫ్లై ట్రాప్

కీటకాహార మొక్కలకు ఉదాహరణలు: నెపెంథిస్, డ్రోసిరా, యుట్రిక్యులేరియా, డయోనియా, సర్రెసీనియా, ఆల్ డ్రోవాండా, వీనస్ ఫ్లై ట్రాప్ (venus flytrap) మొక్క, పిచ్చర్ మొక్క (pitcher plant), సన్ డ్యూ (sundew) మొక్క.

  • 1. వీనస్ ఫ్లై ట్రాప్ (venus flytrap) మొక్క: కీటకం సన్నని వెండ్రుకలు, ముళ్ళు కలిగి ఉన్న, ఆకుపై వాలగానే, అది మెల్లగా ముడుచుకొని, కీటకాన్ని బంధించి, జీర్ణం చేసుకుంటుంది.
  • 2. పిచ్చర్ మొక్క (pitcher plant) : దీని ఆకులే చిన్న తిత్తులుగా ఏర్పడతాయి. వాటిపై ఒక మూత కూడా ఉంటుంది. తిత్తి ముఖద్వారపు అంచులు మకరందాన్ని కలిగి ఉంటాయి. తిత్తి అడుగు భాగాన ఒక రకమైన ద్రవ పదార్థం ఉంటుంది. కీటకం దానిపై వాలగానే, దానికున్న జిగురు మూలంగా, అది జారి తిత్తిలో పడుతుంది. వెంటనే తిత్తిపైన ఉన్న మూత మూసుకొనిపోతుంది. తిత్తిలో ఉన్న ద్రవం కీటకాన్ని జీర్ణింపజేస్తుంది.
  • 3. సన్ డ్యూ (sundew) మొక్క: ఇది జిగురుతో ఆకులను కలిగి ఉంటుంది. కీటకం ఆకుపై వాలగానే, అది చాపలా ముడుచుకుపోతుంది. ఆకునుండి స్రవించే ద్రవం కీటకాన్ని జీర్ణం చేస్తుంది.

మూలం మార్చు

  • The Dorling Kindersley Illustrated Family Encyclopedia, 2008