కుచేలుడు శ్రీకృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుదాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కంధములో వస్తుంది.

కుచేలుడికి సపర్యలు చేస్తున్న శ్రీకృష్ణుడు

కుచేలుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీకృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేసేటపుడు కుచేలుడు శ్రీకృష్ణుడికి సహాధ్యాయి. విద్యాభ్యాస మయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకోగా, కుచేలుడు తన స్వగ్రామము చేరుకొంటాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా ఎక్కువ సంతానం కలుగుతుంది. అధిక సంతానముతో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే, కుచేలుడి భార్య లోకరక్షకుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని రమ్మంటుంది.

కుచేలుడు ద్వారకా నగరానికి బయలుదేరుతూండగా అతనిని భార్య ఒక చిన్నఅటుకుల మూట ఇస్తుంది. కుచేలుడు ద్వారక చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు, రాజప్రాసాదాలూ చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడినప్పటికీ, లోకరక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం అతనికి లభిస్తుంది. శ్రీకృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసన మిచ్చి, కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సుపై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు అతడి అదృష్టాన్ని కొనియాడుతారు.

సపర్యలు అయ్యాక కుచేలుడితో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి గురుపత్ని దర్భలు తెమ్మని పంపగా వర్షము పడడం వల్ల ఎంతకూ తిరిగి రాకపోవడంతో మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని గుర్తు చేసుకుంటారు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో నాకు ఏం తీసుకు వచ్చావు అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచబోతూంటే శ్రీకృష్ణుడు ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు తినబోతుండగా రుక్మిణి, స్వామీ మీరు మొదటి సారి అటుకులు తిన్నపుడే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కుచేలుడు&oldid=3877619" నుండి వెలికితీశారు