కృత్రిమ ఉపగ్రహము

మానవుడు తయారుచేసి కక్ష్యలో ప్రక్షేపించిన వస్తువు
(కృత్రిమ ఉపగ్రహం నుండి దారిమార్పు చెందింది)

కృత్రిమ ఉపగ్రహము అనగా కృత్రిమంగా సృష్టించబడిన ఉపగ్రహము. నక్షత్రం చుట్టూ పరిభ్రమించేది గ్రహం. గ్రహం చుట్టూ పరిభ్రమించేంది ఉపగ్రహం. సహజంగా ఉద్భవించిన ఉపగ్రహాలను ఉపగ్రహాలు లేదా సహజ ఉపగ్రహాలు అంటారు. మానవునిచే కృత్రిమంగా తయారుచేయబడి గ్రహం చుట్టూ పరిభ్రమించేలా అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. సూర్య నక్షత్రం చుట్టూ పరిభ్రమింసున్న గ్రహాలలో భూ గ్రహం ఒకటి. భూ గ్రహం చుట్టూ పరిభ్రమింసున్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. కృత్రిమ ఉపగ్రహము అనేది ఒక యంత్రం. నేడు భూమి చుట్టూ అనేక కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. వీటిని మానవులు రకరకాల ప్రయోజనాల కోసం పంపడం జరిగింది. ఇవి మానవులకు అనేక రకాలుగా సేవలందిస్తున్నాయి. మానవ అభివృద్ధి క్రమంలో వీటి పాత్ర చాలా ప్రముఖమైనది. మానవుడు అత్యంత తొందరగా సమాచారాన్ని తెలుసుకొనుటకు ఇవి సహాయపడుతున్నాయి. ఉపగ్రహాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయటం ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఒకే సమయంలో గమనించి అవసరమైన సమాచారాన్ని ఒకే సమయంలో ప్రపంచంలోని అన్ని చోట్లకు అందించగలుగుతున్నాయి. వార్తలను ఎప్పటికప్పుడు టివి ప్రసారాల ద్వారా ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే సమయంలో వీక్షించగలగే సదుపాయం ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఉపగ్రహాల అనుసంధానమని చెప్పవచ్చు. కృత్రిమ ఉపగ్రహముల ద్వారా ప్రపంచంలో అన్ని మూలలకు ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించబడింది. కృత్రిమ ఉపగ్రహముల ద్వారా జీపీయస్ సౌకర్యం ఏర్పడింది, తద్వారా భూమిపై, గాలిలో, నీటిపై నావిగేట్ చెయ్యడం సులభమయ్యింది. ఈ ఉపగ్రహాలు సిగ్నల్స్ ద్వారా భూమి నుండి అవసరమైన సమాచారాన్ని సేకరించి, సిగ్నల్స్ ద్వారానే తిరిగి భూమికి పంపుతుంది. ఉపగ్రహలు వేర్వేరు పరిమాణాలలో, వేర్వేరు ఆకృతుల్లో ఉంటాయి. రాకెట్ ద్వారా ఉపగ్రహాలను గ్రహ కక్ష్యలలోకి చేరవేస్తారు. గ్రహ కక్ష్యలలో ఇవి తిరిగి పనిచేయుటకు వీటికి సోలార్ ప్యానల్ ను అమర్చుతారు. సోలార్ ప్యానల్ సూర్యకాంతిని గ్రహించి ఉపగ్రహానికి అవసరమైన విద్యుచ్ఛక్తిని అందిస్తుంది, తద్వారా ఉపగ్రహాంలోని యంత్రాలు పనిచేస్తాయి. ఉపగ్రహంలో ముఖ్యంగా భూమి యొక్క ఫోటోలను తీయుటకు కెమెరా, సందేశాలను ఇచ్చి, పుచ్చుకొనుటకు ఏంటీనా, విద్యుచ్ఛక్తి కొరకు బ్యాటరీ ఉంటాయి. కృత్రిమ ఉపగ్రహములను కంప్యూటర్ల ద్వారా శాస్త్రజ్ఞులు నియంత్రిస్తారు. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1 ను సోవియట్ యూనియన్ అక్టోబర్ 4,1957 న ప్రయోగించింది. ఇది ప్రతి 92.6 నిముషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుంది.

భూకక్ష్యలో ఉపగ్రహం

భూమి గురుత్వాకర్షణను కలిగివుంటుంది, భూమి తన నుండి పైకి వెళ్ళే వస్తువులను తిరిగి లాక్కుంటుంది. అందువలన ఉపగ్రహం భూకక్ష్యలో పరిభ్రమించేలా చేయాలంటే, దానిని నిర్దేశిత వేగంతో భూకక్ష్యలో ప్రవేశపెట్టాలి, అప్పుడే అది భూకక్ష్యలో తిరుగుతూ పనిచేస్తుంది. నిర్దేశిత వేగంతో భూకక్ష్యలో ప్రవేశ పెట్టలేని ఉపగ్రహాలు తిరిగి భూమిపైకి చేరడమో లేక భూకక్ష్యను దాటి అంతరిక్షంలోకి దూసుకుపోవడమో జరుగుతుంది.

Shakalamangalyam