కెయ్డన్స్ బ్రెయ్కింగ్

చోదక మెళకువ

కెయ్డన్స్ బ్రెయ్కింగ్[గమనిక 1] (Cadence braking, అనువాదం: అవరోహణ గతినిరోధకం) లేదా స్టటర్ బ్రెయ్కింగ్[గమనిక 2] (stutter braking, అనువాదం: అంతరాయిక గతినిరోధకం) అనేది ఒక చోదక మెళకువ. బ్రెయ్క్ వేసినప్పుడు చక్రాలు తిరగకుండా ఆగిపోతాయి. దీనితో కింద నేల నున్నగా ఉంటే బండి జారుకుంటూ పోతుంది. అంతే కాక ఆగిపోయిన చక్రాలతో బండిని కావలసిన వైపుకు తిప్పలేము. బ్రెయ్కుని ఒకేసారి కొట్టకుండా, టపటపా నొక్కడాన్ని కెయ్డన్స్ బ్రెయ్కింగ్/స్టటర్ బ్రెయ్కింగ్ అంటారు. దీని వల్ల నున్నటి నేలపై బండి వేగాన్ని తగ్గిస్తూనే, కావలసిన వైపుకు నడిపించుకోవచ్చు. బండిని అత్యవసరంగా ఆపాల్సి వచ్చినప్పుడు, బలమైన బ్రెయ్కుల దెబ్బకి చక్రాల తిరుగుడు ఒకేసారి పూర్తిగా ఆగిపోయి, బండి జారిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండడానికి ఈ పద్ధతి వాడతారు. ఎదురుగా ఏదైన అడ్డంకి ఉన్నప్పుడు, ఈ పద్ధతితో బండి వేగాన్ని తగ్గించి, ఇంకాస్త సమయం దొరకబుచ్చుకోవచ్చు. ఈలోపు బండిని సురక్షితమైన దిశగా తిప్పేయవచ్చు. ఇలా తిప్పడానికి తోలే వానికుండే నిడివిని పెంచడమే ఈ పద్ధతి యొక్క ఉద్దేశం. ఇది సాధనతో నేర్చుకోవలసిన పద్ధతి. ఇది వాడాలంటే సమయస్ఫూర్తి ఉండాలి. ఇలా అత్యవసర నిలుపుదలలలో కంగారు పడకుండా, జాగ్రత్తగా ఇది వాడడం తేలికైన పనేమీ కాదు. నేటి కార్లలో ఇలా బండి జారకుండా చూసుకునేందుకు ఎ.బి.ఎస్ (అన్టి-లొక్ బ్రెయ్కింగ్ సిస్టం—బ్రెయ్క్ వేసినప్పుడు చక్రాల తిరుగుదల ఆగిపోకుండా చూసుకునే సాంకేతికత) ఉన్నది. ఐతే ఎ.బి.ఎస్ లేని కార్లకు (ఉదా: పాత కార్లు) ఇప్పటికీ ఇది ఉపయోగకరమే.

స్లిపిజ్ 10–20% లోపు ఉన్నప్పుడు గతి నిరోధకం ఉచ్చస్థాయిలో ఉంటుంది [3] స్లిపిజ్ ఇంతకంటే పెరిగితే, చక్రపు తిరుగుడు వలన నేలపై ఉండే పట్టు తగ్గి, ఇక బండి వేగం కేవలం చక్రానికీ, నేలకీ మధ్య ఉండే రాపిడి వలనే తగ్గాలి. ఐతే చక్రం నేలను తాకిన చోట, ఈ రాపిడి వలన వేడి పుట్టి చక్రం కరిగిపోయే ప్రమాదముంది. అప్పుడు రాపిడి కూడా తగ్గుతుంది. అలాగే బ్రెయ్క్ పూర్తిగా నొక్కినప్పుడు, చక్రం తిరగదు కనుక బండిని తిప్పడం కూడా కుదరదు.

ఎ.బి.ఎస్ ఈ కెయ్డన్స్ బ్రెయ్కింగ్‌నే స్వయంచాలకంగా, వేగంగా సెకనుకు అనేక సార్లు అమలయ్యేలా చేస్తుంది. మనిషి మాత్రం సెకెనుకు ఒకసారే చేయగలడు [మూలాలు తెలుపవలెను] .

దీని వల్ల బండి వెళ్ళే దిశపై కొంతైనా నియంత్రణ ఉంటుంది. నేల గట్టిగా, తడిగా ఉంటే బ్రెయ్క్ వేసాక బండి జారుతూ వెళ్ళే దూరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఎ.బి‌.ఎస్ ఉన్న బళ్ళలో మాత్రం ఈ పద్ధతి వాడేకంటే బ్రెయ్కుల్ని గట్టిగా నొక్కి, పరిస్థితులకు అనుగుణంగా బండిని తిప్పితేనే ఫలితాలు బాగుంటాయి.

కెయ్డన్స్ బ్రెయ్కింగ్ (లేదా ఇలాంటి పద్ధతులు ఏవైనా) మంచు నేలల వంటి వాటిపై ఉపయోగపడవు (లెక్క ప్రకారం తేడా ఉంటుంది కానీ, మంచూ, ఐస్ వంటివి ఎంత నున్నగా ఉంటాయంటే ఈ పద్ధతుల వాస్తవిక ప్రయోజనం దాదాపు శూన్యం- వీటికంటే వింటర్ టైర్ వల్ల బాగా ప్రయోజనము ఉంటుంది) . అలాగే, బాగా వదులుగా ఉన్న నేలపై తోలేటప్పుడు గట్టిగా బ్రెయ్క్ వేస్తే, చక్రాలు తిరగడం ఆగి, కిందున్న మట్టి చక్రాల ముందు పోగయ్యి, తేలిగ్గా ఆగేలా చేస్తుంది. [4] ఐతే బండిని తిన్నగా తీసుకెళుతూ ఆపడం కుదిరితేనే ఇలా చేయడానికి అవుతుంది (ఎదురుగా ఏ అడ్డంకీ లేకపోతే). ఎందుకంటే బ్రెయ్క్‌ను బలంగా నొక్కితే బండి దిశను మార్చడం కుదరదు గనుక. ఎ.బి.ఎస్ సూత్రం కూడా కెయ్డన్స్ బ్రెయ్కింగే కనుక, ఇలాంటి వదులు నేలలపై ఎ.బి.ఎస్ బళ్ళు మామూలు బళ్ళు ఆగినంత త్వరగా ఆగవు. పాత రోజుల్లో నున్నటి నేలపై తోలేటప్పుడు ద్విచక్రవాహనచోదకులు బ్రెయ్కులను లయబద్ధంగా వేసేవారు. బ్రెయ్క్ వేసిన వెంటనే బండి మీది బరువు ముందు చక్రం మీదకి పడుతుంది. మళ్ళీ వదలగానే వెనుక చక్రం మీదకి వస్తుంది. ఇలా బండి వేగం తగ్గుతుంది. ఆధునిక సస్పెన్షన్‌లతో ఈ పద్ధతి వల్ల పెద్ద ఉపయోగము ఉండకపోవచ్చు.

కెయ్డన్స్ బ్రెయ్కింగ్ ఉపయోగకరమైన పద్ధతే. ఐతే దీనిలో చక్రాల పైన బ్రెయ్క్ యొక్క ప్రభావం పడుతూ, ఆగుతూ ఉంటుంది. అలా కాకుండా చక్రం ఏ దశలో ఐతే స్లిప్ అవుతుందో, బ్రెయ్క్‌తో నొక్కిపెట్టి సరిగ్గా ఆ స్థితిలో చక్రాన్ని ఉంచితే, గతి నిరోధకం ఇంకా బాగా అవుతుంది. ఇలా బ్రెయ్క్‌లు వేయడాన్ని థ్రెషౌల్డ్ బ్రెయ్కింగ్ అంటారు. ఈ మెళుకువ నేర్చుకోవడం ఇంకా కష్టం. నేటి బళ్ళలో ఈ పని కూడా ఎ.బి.ఎస్ చేతిలోకి వెళ్ళిపోయింది.

థ్రెషౌల్డ్ బ్రెయ్కింగ్, ఎ.బి.ఎస్‌లు తిన్నగా వెళ్ళే బండిని వీలైనంత త్వరగా ఆపగలవు. ABS, కెయ్డన్స్‌లు బండి ఆగేటప్పుడు దాని దిశపైన తోలేవానికి నియంత్రణను ఇవ్వగలవు.

గమనికలు

మార్చు
  1. ఖెయ్‌డెన్స్ ప్రెయ్‌ఖింగ్క్/ప్రెయ్‌ఖిఙ్.[1] 'డ'ను తెలుగులోలా మూర్ధన్యంగా కాకుండా, దంతమూలీయంగా పలకాలి.
  2. స్టఠర్/స్టఠృ ప్రెయ్‌ఖింగ్క్/ప్రెయ్‌ఖిఙ్.[2] ట, ఠలను తెలుగులోలా మూర్ధన్యాలు కాకుండా, దంతమూలీయములుగా పలకాలి.

మూలాలు

మార్చు
  1. Wikipedia, contributors (5 October 2022). "Examples#Rules for English consonant allophones". Allophone. Wikipedia, The Free Encyclopedia. 1114161904. Retrieved 5 October 2022. Voiceless stops /p, t, k/ are aspirated when they come at the beginning of a syllable [...] Voiced obstruents, which include stops and fricatives, such as /b, d, ɡ, v, ð, z, ʒ/, that come at the end of an utterance like /v/ in "improve" or before a voiceless sound like /d/ in "add two") are only briefly voiced during the articulation. [...] Voiced stops and affricates /b, d, ɡ, dʒ/ in fact occur as voiceless at the beginning of a syllable unless immediately preceded by a voiced sound, in which the voiced sound carries over.
  2. Wikipedia, contributors (5 October 2022). "Examples#Rules for English consonant allophones". Allophone. Wikipedia, The Free Encyclopedia. 1114161904. Retrieved 5 October 2022. Voiceless stops /p, t, k/ are aspirated when they come at the beginning of a syllable [...]When considering /r, l/ as liquids, /r/ is included in this rule as well as present in the words [...] Voiced stops and affricates /b, d, ɡ, dʒ/ in fact occur as voiceless at the beginning of a syllable unless immediately preceded by a voiced sound, in which the voiced sound carries over. [...]Voiced obstruents, which include stops and fricatives, such as /b, d, ɡ, v, ð, z, ʒ/, that come at the end of an utterance like /v/ in "improve" or before a voiceless sound like /d/ in "add two") are only briefly voiced during the articulation.
  3. Tyre-road friction and tyre slip
  4. Automotive Brakes By Jack Erjavec p359 "A locked tire allows a small wedge of snow to build up ahead of it, which allows it to stop in a shoreter distance thana rolling tire."