కె.పి. లక్ష్మినరసింహ

కెపి. లక్ష్మినరసింహ ( KP LAXMI NARASIMHA ) పాలమూరు జిల్లాకు చెందిన వర్ధమాన కవి. రైతు కుటుంబంలో జన్మించాడు. పాఠశాల విద్యను పూర్తి చేయకుండానే చదువు ఆపేశాడు. ప్రైవేట్‌గా పదవ తరగతి రాసి, పాసయ్యాడు. ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం పిజి దాకా కొనసాగించాడు. ఆ క్రమంలోనే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు.

కె.పి. లక్ష్మినరసింహ
జననంకె.పి. లక్ష్మినరసింహ
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
ప్రసిద్ధికవి

కుటుంబ నేపథ్యం

మార్చు

కెపి లక్ష్మీ నరసింహ (పూర్తి పేరు కెపి లక్ష్మీనరసింహ మహారాజ్) మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొండమ్మ, పోచయ్య దంపతులకు 1993 మే నెల 9న జన్మించాడు.  ఇతనికి ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇతని కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవించడం వల్ల  బాల్యంలో విద్యకు దూరమై పశువులకాపరిగా జీవితాన్ని సాగించాడు. అలా పశువులకాపరిగా ఉన్న సమయంలో అదే గ్రామ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలకృష్ణరెడ్డి దృష్టిలో పడటం వల్ల ఆయన కెపి లక్ష్మీనరసింహను చూసి తమ పాఠశాలలో చేర్చుకున్నాడు. ఆ సమయంలో ఇతనికి దాదాపు పదవ తరగతి వయస్సు ఉంటుంది. అయినా తనకంటే చిన్న పిల్లలతోపాటు కూర్చుని చదువుకున్నాడు. తమ గ్రామ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకొని తర్వాత ప్రైవేటుగా 10వ తరగతి ఫీజు కట్టి పరీక్షలు రాశాడు. ఆ సమయంలో పోల్కంపల్లి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుల అనుమతితో పాఠాలు విన్నాడు. ఆ సమయంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లతిఫోద్ధిన్, ఇతర ఉపాధ్యాయులు పేరు లేకున్నా ఇతనిని బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎం.ఎ. (ఎకనామిక్స్), లైబ్రరీ సైన్స్, ఎం.ఎ. (పొలిటికల్ సైన్స్), PGDHR పూర్తి చేసి ప్రస్తుతం LLB చేస్తున్నాడు.

సాహిత్య ప్రస్థానం

మార్చు

కెపి లక్ష్మీనరసింహ డిగ్రీ, పిజీ చదివే సమయంలో చిన్న చిన్న ప్రేమ కవితలు, భావ కవిత్వం రాసేవాడు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతోంది. అప్పుడు సామాజిక సాహిత్యంపట్ల ఆకర్షితుడై ఉద్యమం గురించి రాసిన కవితలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి. అలా వివిధ సందర్భాలలో సమాజంలో జరుగుతున్న సంఘటనల వల్ల అతనిలో కలిగిన భావాలను నిత్యం రాస్తూ కవిత సంపుటాలుగా ప్రచురించాడు. ఇతని మొదటి పుస్తకం ఎం.ఎ. ఎకనామిక్స్ రెండవ సంవత్సరం చదువుతున్న (కుట్రజేస్తున్న కాలం-2014) సమయంలోనే వెలువరించాడు. ఇందులో ఈ లోకానికి అన్నం పెడుతూ ఆగమైపోతున్న అన్నదాతల వెతలను కవితలుగా రాశాడు. రైతు కవిత్వంతోపాటు వివిధ అంశాలపై కవిత్వం రాశాడు. 2016 సంవత్సరంలో “ఆరుతున్న మెతుకు దీపం” అనే కవిత సంపుటిని, 2017 సంవత్సరంలో “వెన్నెలవాడ” అనే కవితా సంపుటిని వేశాడు. ఇందులో వెలివాడ వెతలను, అంటరానితనం, మనువాదం గురించి కవిత్వం రాశాడు.  ఈ పుస్తకం కెపి లక్ష్మీనరసింహను దళితబహుజన కవిగా ముద్రపడేటట్టుగా చేసింది. ఈ సంపుటిలో మొత్తం అంటరానితనం గురించి మనువాదంపై బాణం ఎక్కుపెట్టినట్లుగా రాశాడు. 2019 సంవత్సరంలో ఇతను “చెరగని ఆటోగ్రాఫ్”, “ధర్మాగ్రహం నానీలు”, “అంబలి గంప” కథలు, “దాసుకున్న లోకం” అనే  4 పుస్తకాలు వెలువరించడం జరిగింది. “చెరగని ఆటోగ్రాఫ్” అనే పుస్తకంలో మొత్తం ప్రేమకు సంబంధించిన కవిత్వమే ఉంటుంది. “ధర్మాగ్రహం” నానీల పుస్తకంలో అనేక సామాజిక అంశాలపై, సమస్యలపై నానీల ప్రక్రియలో కవిత్వం రాశాడు. ఆరో పుస్తకంగా “అంబలి గంప” కథలు రాశాడు. ఈ పుస్తకంలో మొత్తం 16 కథలుంటాయి. వీటిలో ఎక్కువగా కులవివక్షతకు గురైన వ్యక్తుల కథలే ఉంటాయి. ఇందులోని మొదటి కథ ‘తండ్లాట’లో కెపి లక్ష్మీనరసింహ తన బాల్యంలో ఉన్నప్పుడు వారి తండ్రికి మరో వ్యక్తికి మధ్య జరిగిన వ్యవసాయానికి సంబంధించిన చర్చనే కథగా రాశాడు. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, చివరకు వారికి మిగిలిన అప్పుల కుప్పలను చూస్కొని ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారనేది ఈ కథలో రాశాడు. రెండో కథ విషయానికొస్తే అది కూడా వ్యవసాయానికి సంబంధించినదే. ఇందులో ఇద్దరు భార్యాభర్తల మధ్య రాత్రిపూట  సంభాషణగా నడుస్తుంది. కరువొచ్చి వ్యవసాయం కుంటుపడిన విధానం గురించి ఇద్దరు మాట్లాడుకొని పడుకుంటారు. ఉదయం కోడి కూయంగ పొలం దగ్గరకు వెళ్ళిన భర్తకు అంబలి గంపలో అన్నం తీస్కోని వెళ్ళిన భార్యకు భర్త శవమై కనిపిస్తాడు. అది చూసిన భార్య అక్కడే ఊపిరి వదులుతుంది. మూడో కథ ‘సెల్లని నోట్లు’ ఆకస్మికంగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసినప్పుడు ఎందరో పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విషయాన్ని ఒక పల్లెటూరి ముసలావిడ ఏ విధంగా అయితే నష్టపోయి మానసిక క్షోభకు గురై ప్రాణాన్ని కోల్పోయిందో ఈ కథ ద్వారా చెప్పాడు. నాలుగవ కథ ‘సెప్పుల సాయమ్మ’. ఇందులో చెప్పుల వృత్తినే జీవనాధారంగా చేసుకొని బతికే సెప్పుల సాయమ్మకు ఈ ఆధునిక ప్రపంచీకరణ ప్రభావంతో ఆ వృత్తినే కోల్పోయింది. వృత్తిని తను బతికే ఊరును వదిలిపెట్టి మహబూబ్ నగర్ పట్టణంలో యాచించే స్థితికి చేరింది. ఆమె జీవితాన్ని కెపి లక్ష్మీనరసింహ చాలా సహజంగా కళ్ళకుకట్టినట్లు రచించాడు. ఐదో కథగా ‘మరో ఉద్యమం’ అనే శీర్షికతో రాశాడు. ఆంధ్రవలస పాలనలో నష్టపోయిన తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆధిపత్య వర్గాలకే సొంతమైంది, దాని ఫలాలు  పేద ప్రజలకు అందకుండా పోయాయని మళ్ళీ మరో ఉద్యమం చేయాలనే ఉదేశ్యంతో రాశాడు. ఆరో కథగా ‘ఐ హేట్ యువర్ క్యాస్ట్’ అనే కథను డిగ్రీ చదివే ఓ విద్యార్థి తన క్లాస్మేట్ ని ఇష్టపడతాడు. కానీ తన మనసులోని మాట మూడు సంవత్సరాల వరకు చెప్పకుండా తనలోనే దాచుకొని డిగ్రీ చివరి రోజుల్లో చెప్తే గత మూడు సంవత్సరాలుగా ఫ్రెండ్లీగా ఉన్న అమ్మాయి ప్రేమ విషయం చెప్పేసరికి ‘మీదే కులం?’ అంటూ అడుగుతుంది. అబ్బాయి తన కులం చెప్పేసరికి ‘ఐ హేట్ యువర్ క్యాస్ట్’ అంటూ బదులిస్తుంది. అది తట్టుకోలేక ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటాడు. డిగ్రీ చదివే ఆధునిక విద్యార్థుల్లో కూడా ఈ కులపిచ్చి నాటుకుపోయిందంటు ఈ కథకుడు రాశాడు.  ఏడో కథగా ‘అన్న పెండ్లి అయ్యేంతవరకు’. ఈ కథలో ధనుష్ అనే దళిత యువకుడిని బీసి సామాజిక వర్గానికి చెందిన తన మిత్రుడు వాళ్ళ అన్న పెండ్లికై ధనుష్ చేత వాళ్ళ ఇంటికి సున్నం రంగులు వేయించుకొని చివరకి ‘మీరు మాదిగోల్లని అన్న పెండ్లి అయ్యేంతవరకు అమ్మ నిన్ను ఇంట్లోకి రానివ్వొద్దని చెప్పిందని’ మిత్రుడే కుల వివక్షతో అవమానించిన సందర్భాన్ని ఈ కథలో తెలియజేశాడు. ఎనిమిదో కథగా ‘మాదిగోన్ని’ అనే కథను రాయడం జరిగింది. ఇందులో కూడా కులవివక్షతకు గురైన ఒక మాదిగ యువకుడి ప్రేమ కథను చెప్పాడు. తొమ్మిదో కథగా ‘భీముడు’ అనే కథను రాశాడు. ఇందులో దొరల పెత్తనంలో నలిగిపోతున్న పేదల బతుకులను తెలియజేస్తూనే అంబేద్కర్ ఐడియాలజితో రాజ్యాధికారం ఏ విధంగా చేపట్టవచ్చో చాలా చక్కగా వివరించాడు. ఏడవ తరగతి చదువుతున్న భీముడు తన తండ్రిని ప్రోత్సహించి దొరకు ఎదురు తిరిగి సర్పంచిగా పోటీ చేసి గెలిచే విధానాన్ని కెపి లక్ష్మీనరసింహ పాఠకులకు తెలియజెప్పిన విధంగా చాలా బాగుంది. పదవ కథగా ‘మంగమ్మ’గా రాశాడు. ఆధిపత్య కులాల ఇళ్ళముందు పనిచేసే మంగమ్మకు ఆ ఇంటి కోడలి వల్ల ఎదురైన అవమానమే ఈ కథ. తరాలు మారినా కుల వివక్ష మారలేదు అనేదానికి సాక్ష్యంగా ఈ కథ రాశాడు. పదకొండో కథగా ‘ఇసపురుగు’ అనే శీర్షికతో రాశాడు. ఇది ఈ రచయిత డిగ్రీ చదివే రోజుల్లో వారి కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఒక పెద్ద మనిషిని వేదికపైనే  దళిత కులాలకు చెందిన వారిని అవమానిస్తూ ప్రసంగించడం జరుగుతుంది. దాన్నే కెపి లక్ష్మీనరసింహ కథగా మలిచాడు. పన్నెండవ కథగా ‘గెస్ట్ ఫ్యాకల్టీ’ అనే కథలో పీజీలు, బి.ఎడ్ చేసి అరకొర జీతాలకై గెస్ట్ ఫ్యాకల్టీ చేస్తున్న వారి గురించి రాయడం జరిగింది. ఉన్నత చదువులున్నా కూలినాలి చేసుకునే వారికి వచ్చినంత జీతం కూడా లేదని కుమిలిపోయే ఇద్దరు యువకుల కథే ఇది. పదమూడవ కథగా ‘బువ్వగంటె’గా రాశాడు. రచయిత తన గ్రామంలో శ్రీరామ నవమి పండుగ మొదలు పెట్టినప్పటి నుండి చురుకుగా పాల్గొంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి అదే వేడుకలో అన్నం వడ్డిస్తుంటే గ్రామ సర్పంచి కొడుకు వచ్చి ఇతనిని గుర్రుగా చూసి తన చేతిలో ఉన్న బువ్వ గంటెను లాక్కొని అన్నం పెట్టుకొని  తింటాడు. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తి అక్కడికి వచ్చి ‘మాదిగ కొడుకులు అన్నం పెడితే మేము తినాల్నా?’ అంటూ అవమానిస్తాడు. అప్పటి నుండి అవమానానికి గురైన వ్యక్తి ఈ కులవివక్ష ఉన్న చోటు నాకొద్దు అనుకోని అటువైపు వెళ్ళడం మానేస్తాడు. పద్నాలుగవ కథగా ‘నా బతుకే వోతున్నది బడికొచ్చి నేనేంజేతు’ అనే కథను రాశాడు. ఇందులో నేటికి అక్కడక్కడ జరుగుతున్న బాల్య వివాహాల గురించి రాశాడు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత అవగాహన కల్పించిన పేదరికం కారణంగానో, మరేదో కాని ఇంకా బాలికలకు వివాహ వయసు రాకముందే వివాహాలు చేయాలని చూస్తున్నారు. అలా తల్లిదండ్రులు చేయాలనుకుంటే ఆ అమ్మాయి  ఇంట్లోనే ఉండి కుమిలిపోతుంది. ఆ సమయంలో తన చెల్లెలు బడికి పోదాంరా అక్క అంటే ‘నా బతుకే వోతున్నది బడికొచ్చి నేనేంజేతు’ అని బదులిస్తుంది. పద ఐదవ కథగా ‘మూలం’ అనే శీర్షికతో రాశాడు. ఇందులో పెళ్లి వయసు వచ్చిన ఒక అమ్మాయికి సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అవుతుంటాయి. ఆమె తల్లిదండ్రులకు ఒకతే కూతురు. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అయినా సంబంధాలు క్యాన్సిల్ అవుతూనే ఉంటాయి. వచ్చినవారికి ఆమె చెప్పేది ఒకటే విషయం. పెళ్లి తర్వాత కూడా నా జీతంలో కొంత నా తల్లిదండ్రులకు ఇస్తాను అని. దానికి వచ్చిన వారు ఒప్పుకోరు అటువంటి సంబంధం నాకొద్దు అంటుంది ఈమె. చివరికి తన స్నేహితురాలి ద్వారా ఒక అబ్బాయి చూసి నచ్చుకుంటాడు. చివరికి కథ సుఖాంతంగా ముగుస్తుంది. ఇక చివరి పద ఆరవ కథగా ‘గవర్నమెంట్ జాబ్ ఉందా?’ అనే కథ రాశాడు. ఇందులో ఇతర కులస్తులు చూపించే వివక్ష కాకుండా సొంత కులంవాళ్ళు చూపించే ఆర్థిక వివక్షత గురించి రాశాడు. ఉద్యోగం ఉంటె ఒకలాగా మాట్లాడటం లేకుంటే తక్కువచేసి మాట్లాడటం అనేదానిని కథగా రాయడం జరిగింది.

         ఈ కథల గురించి ప్రొఫెసర్ కాశీం ‘ఈ కాలపు మాదిగ కథలు’ అని రాశాడు. మరో ప్రొఫెసర్ యం.యం. వినోదిని ‘గ్రామీణ కుల సమాజాన్ని స్కాన్ చేస్తున్న కెపి కథలు’ అని రాశారు. మరో ప్రముఖ రచయిత్రి డా గోగు శ్యామల ‘కలసిరాని కాలాన్ని వేటాడుతున్న అంబలి గంప కథలు’ అన్నారు. అలాగే మరో ప్రముఖ రచయిత ‘మార్పుకు దారి’ అంటూ రాశాడు.

ఈ కథలతోపాటు నూతన సాహితి ప్రక్రియ అయినటువంటి మొగ్గల ప్రక్రియలో కూడా తను ‘దాసుకున్న లోకం’ అనే తన ఏడవ పుస్తకంగా 2019 సంవత్సరం చివరలో వెలువరించాడు.

ఇతని కవిత్వం, కథలపై ఇతర కవుల అభిప్రాయాలు

మార్చు
  • నమ్ముకున్న పొలం, ఆశ పెట్టుకున్న ప్రకృతి తనను దగా చేసినా, అప్పుల పాలై బతుకు బండిని నడిపే దారి మూసుకపోయి చతికిల బడేసినా, భూతల్లిని విడిచి పెట్టని రైతు దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దివిటీ పట్టి చూపించిన కవి. --వల్లభాపురం జనార్ధన
  • "తెలంగాణాలో రైతు చేస్తున్న బతుకు యుద్దానికి కదిలిపోయిన హృదయాన్ని ఈ కవి కలంలో చూడగలం". - పరిమళ్
  • "రైతును, రైతుగోసను, ఆక్రందనను అక్షరమక్షరంలో ఆవిష్కరించిన కవి." - డా. భీంపల్లి శ్రీకాంత్
  • ‘ఈ కాలపు మాదిగ కథలు’ - ప్రొఫెసర్ కాశీం
  • ‘గ్రామీణ కుల సమాజాన్ని స్కాన్ చేస్తున్న కెపి కథలు’ - వినోదిని
  • ‘కలసిరాని కాలాన్ని వేటాడుతున్న అంబలి గంప కథలు’ - డా గోగు శ్యామల
  • ‘మార్పుకు దారి’ - వహీద్ ఖాన్

మూలాలు

మార్చు